చందాలతో నీళ్ల కొనుగోలు

ABN , First Publish Date - 2022-09-21T06:10:26+05:30 IST

పేదల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యం అని చెప్పుకొనే వైసీపీ ప్రభుత్వం వారికి కనీసం గుక్కెడు మంచినీరు కూడా ఇవ్వలేక చేతులెత్తేసింది.

చందాలతో నీళ్ల కొనుగోలు
మర్రివేముల ఎస్సీ పాలెంలో చందాలు వేసుకొని తెప్పించుకున్న ట్యాంకు వద్ద నీరు పట్టుకుంటున్న మహిళలు

మంత్రి నియోజకవర్గంలో పేదల పాట్లు 

మర్రివేముల ఎస్సీకాలనీలో దాహం కేకలు

అడుగంటిన బోర్లు..ముటుకుల నుంచీ అందని నీరు 

సరఫరాకు ముందుకు రాని ట్యాంకర్ల నిర్వాహకులు

మూడు రోజులుగా తెప్పించుకుంటున్న ప్రజలు

పుల్లలచెరువు, సెప్టెంబరు 20 : పేదల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యం అని చెప్పుకొనే వైసీపీ ప్రభుత్వం వారికి కనీసం గుక్కెడు  మంచినీరు కూడా ఇవ్వలేక చేతులెత్తేసింది. ఎస్సీ మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని  పుల్లలచెరువు మండలం మర్రివేముల ఎస్సీ కాలనీలో ఈ పరిస్థితి ఉంది. ఆ కాలనీలో 150 కుటుంబాలు నివాసిస్తున్నాయి. వారందరికీ కలిపి రెండు డీప్‌ బోర్లు ఉన్నాయి. వీటిలో ఒకటి పూర్తిగా అడుగంటగా మరొకదానిలో అరకొరగా వస్తున్నాయి. దీంతో గ్రామంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ ఆధ్వర్యంలో నీరు సరాఫరా చేయాలని భావించినా, ట్యాంకర్ల నిర్వాహకులు మందుకు రాలేదు. దీంతో గ్రామంలో నీటి ఎద్దడి తీవ్రమైంది. బోర్లు ఒట్టిపోవడంతో నీళ్లు సరిపోక మూడు రోజులుగా  మహిళలు పనులు మానుకోని ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. ఇక గ్రామంలోని యువత చందాలు వేసుకొని ట్యాంకురకు రూ.500 చెల్లించి రోజుకు రెండు ట్యాంకర్ల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వర్షాకాలంలోనే పరిస్థితి ఇలా ఉంటే వేసవిలో పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు.


ముటుకుల ప్రాజెక్టు ఉన్నా నిరుపయోగమే..

మండలంలో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు, 44 గ్రామాలకు తాగు నీరు ఇచ్చేందుకు రూ.17 కోట్లతో గతంలోనే ముటుకుల వద్ద తాగునీటి ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.35కోట్లు ఖర్చుపెట్టారు. అయినా అది నిరుపయోగంగానే మారింది. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ప్రాజెక్టుకు నీరు నింపి గ్రామాలకు ఇచ్చినట్లు చూపి బిల్లులు మార్చుకోవడం అనవాయితీగా మారింది. అయితే గత 11ఏళ్లుగా ఒక్కరోజు ఒక్క గ్రామానికి కుడా నీరు ఇచ్చిన చరిత్ర ఈ ప్రాజెక్టుకు లేదు. ముటుకుల నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మర్రివేములకు నీరు ఇస్తే శాశ్వతంగా తాగునీటి సమస్య తీరే అవకాశం వున్నప్పటికి అధికారులు దీని గురించి పట్టించుకోవడం లేదు.


ముందుకు రాని ట్యాంకర్ల యజమానులు

మర్రివేములలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసేందుకు అధికారు లు అనుమతించినా ట్యాంకర్ల యజమానులు మాత్రం ముందుకు రావ డం లేదు. మూడేళ్లుగా బిల్లులు రాకపోవడం,  ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు మామూళ్లు డిమాండ్‌ చేస్తుండటంతో వారు ముందుకు రావడం లేదని సమాచారం. గతంలో  గ్రామంలో రోజుకు ట్యాంకర్ల 20కిపైగా ట్యాంకర్లలో నీరు సరఫరా చేసేవారు. నేడు ఒకరు కూడా సరఫరాకు ముందుకు రాకపోవడం గమనార్హం. ఎస్సీ మంత్రి నియోజకవర్గంలో ఎస్సీలమే పనులు మానుకోని చందాలతో నీళ్లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని కాలనీవాసులు వాపోతున్నారు. 


Updated Date - 2022-09-21T06:10:26+05:30 IST