"అమ్మ లేకపోతే మనం లేము. తల్లిని ఎంతో ఏడిపించి పుట్టాం. అయినా సరే.. పుట్టగానే మనం నవ్వితే పొంగిపోతుంది. నీకోసం తను పడ్డ కష్టాలన్నీ మరిచిపోతుంది. మొదటిసారి అమ్మా.. అని పిలిస్తే కరిగిపోతుంది. చూడటానికి బేబీలు క్యూట్‌గా ఉంటారు కానీ.. తల్లి శరీరాన్ని నాశనం చేసేస్తారు. అంతకు ముందులా స్ట్రాంగ్‌గా ఉండదు ఆ తల్లి. ఒక్క డెలివరీతో బాడీ మొత్తం డెలికేట్ అయిపోద్ది. మళ్లీ రికవరీ అంటే చాలా కష్టం. ఒక పులి తన పిల్లల్ని పెంచడానికి ఎన్ని కష్టాలు పడుతుందో వీడియో చూశాను. పిల్లల్ని ఒకచోట పెట్టి ఫుడ్ తీసుకురావడానికి అడవిలోకి వెళితే.. ఏ నక్కలొచ్చి పిల్లలను తినేస్తాయో.. లేదా గద్దలొచ్చి ఎత్తుకుపోతాయో తెలియదు. ప్రతీ క్షణం భయం. అనుక్షణం ఎలెర్ట్‌గా ఉండాలి పిల్లలను పెంచాలంటే. మన తల్లి కూడా ఒక పులే. నిన్నకాక మొన్న వచ్చాయ్ పెళ్లిళ్లు. ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి తల్లులే పిల్లల్ని పెంచుకుంటూ వచ్చారు. మొగుడు ఎలాంటివాడైనా.. ఉన్నా, లేకున్నా.. కంటికి రెప్పలా చూసేది మన తల్లే. తల్లిలేని పిల్లల్ని అడగండి.. వారు ఎన్ని కష్టాలు పడ్డారో. మొగుడు సంపాదించినా, సంపాదించకపోయినా.., ఇంటికి వచ్చినా, రాకపోయినా.. పిల్లల కడుపు నిండితేనేగానీ ఏ తల్లీ పడుకోదు. అందుకే ఎప్పుడూ.. తండ్రి కంటే తల్లే గొప్పదని అంటారు. కానీ చివరికి ఆ తల్లిని ఎక్కువగా బాధపెట్టేది ఆ పిల్లలే. అమ్మ కాళ్లకు చుట్టేసుకుని, అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతాం. కానీ వయసు వచ్చాక వేరే కొంగు పట్టుకుని పోతాం. చిన్నప్పుడు అమ్మ ఏం చెప్పినా ఆశ్చర్యంగా వింటాం. పెద్దయినాక అమ్మ ఏం చెప్పినా చాదస్తంగా ఉంటది. ఏ పిల్లలు మీ మాట వినరు. విన్నట్లు నటిస్తారు. అందుకే వృద్దాప్యంలో ప్రతి తల్లీ ఏడుస్తది. ఏడవాల్సిందే. తప్పదు.
అందుకే ప్రతి తల్లీకి చెబుతున్నా.. వృద్దాప్యంలో మీ పిల్లల్ని తిండి తప్ప.. ఏమీ అడగవద్దు. ఆశలు తగ్గించుకోండి. ఆరాటం తగ్గించుకోండి. నవ్వుతూ కనిపించండి. ఆరోగ్యం కాపాడుకోండి. వీలైతే ఒంటరిగా బతకండి. ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి. అడ్డాల్లోనే బిడ్డలు.. గడ్డాలు వచ్చినాక కాదు. రెక్కలొస్తాయ్.. పిట్టలు ఎగిరిపోతాయ్.. ఎక్కడెక్కడో గూడులు కట్టుకుంటాయ్. కట్టుకోనివ్వండి. అడవిలో ఆ తల్లి పక్షులు ఎలా మిగిలిపోతాయో.. మనమూ అంతే. వయసు అయిపోయి.. మనమూ పసిపిల్లలలాగా తయారవుతాం. మోకాళ్లు నీరసించి తప్పటడుగులు వేస్తాం. కొన్ని గుర్తుంటాయ్.. కొన్ని గుర్తుండవ్. అన్నం ముద్ద తింటుంటే.. చేతులు వణుకుతాయ్.మాటలు సరిగ్గారావు. ఎదురుగా పిల్లలు ఉంటారు. అమ్మా.. అని పెదాలు కదులుతుండగానే ప్రాణాలు పోతాయ్. అంతే జీవితం.." అని అమ్మ గురించి పూరి చెప్పుకొచ్చారు.