`నో` చెప్పడం ఎలాగో అందరూ నేర్చుకోవాలని, అన్నింటికీ `ఎస్` చెప్పడం వల్ల జీవితంలో చాలా కష్టాలు పడ్డానని దర్శకుడు పూరీ జగన్నాథ్ తెలిపారు. `పూరీ మ్యూజింగ్స్` పేరుతో పలు అంశాలపై తన అభిప్రాయాలను పూరీ తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా `నో` చెప్పడం గురించి మాట్లాడారు.
``నో` చెప్పడం ఎలా అన్నది అందరూ నేర్చుకోవాలి. జీవితంలో ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎదుటి వ్యక్తి అడిగిన ప్రతిదానికి `ఎస్` చెప్పుకుంటూ పోతే కష్టాలు తప్పవు. అన్నింటికీ `ఎస్` చెప్పడం వల్ల నేను జీవితంలో చాలా కష్టాలు పడ్డా. ఎవరైనా మన ముందు ఓ ప్రపోజల్ పెడితే అది వాడి స్వార్థం కోసమే. మనం పెడితే మన స్వార్థం కోసమే. ఇందులో `నో` చెప్పిన వాడే సక్సెస్ అయినట్టు. `నో` చెప్పిన ప్రతిసారి మీరు చాలా సంతోషంగా ఫీలవుతారు. ప్రతిదానికి `ఎస్` చెబితే మీరు చులకనైపోతారు. `వాడ్ని డీల్ చేయడం సులభమ`ని మీ గురించి అనుకుంటారు. `నో` చెప్పగలిగేవాడే పవర్ఫుల్. అయితే మీరు `నో` చెప్పేటప్పుడు అవతలి వ్యక్తి బాధపడకూడదు. దానిని సాధన చెయ్యండ`ని పూరీ పేర్కొన్నారు.