Advertisement

ప్రతి ఒక్కరూ రైతులా మారాలి: పూరీ జగన్నాథ్

Oct 13 2020 @ 09:14AM

ప్రతి ఒక్కరూ వ్యవసాయం మీద దృష్టి సారించాలని, తమ వంట గది పక్కనే స్వయంగా కూరగాయలను పండించుకోవాలని దర్శకుడు పూరీ జగన్నాథ్ సూచించారు. `పూరీ మ్యూజింగ్స్` పేరుతో ఆయన వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో అంశాల గురించి మాట్లాడిన పూరీ.. తాజాగా `వెర్టికల్ ఫార్మింగ్` గురించి మాట్లాడారు. 


`ఏడు వేల సంవత్సరాల క్రితమే మనం వ్యవసాయం నేర్చుకున్నాం. ఎన్నో పద్ధతుల్లో పంటలు పండిస్తున్నాం. ఇప్పుడున్న లేటెస్ట్ పద్ధతి `వెర్టికల్ ఫార్మింగ్`. ఈ పద్ధతిలో రోజూ మనకు కావాల్సిన కూరగాయలను మనమే పండించుకోవచ్చు. దీనికి ఎకరాల ఎకరాల భూమి అవసరం లేదు. మీ టెర్రస్ మీద, బాల్కనీలో, పార్కింగ్ ఏరియాలో కూడా పండించుకోవచ్చు. బయట పొలంలో 100 లీటర్ల నీరు కావాల్సి వస్తే.. ఈ పద్ధతిలో 5 లీటర్ల నీరు చాలు. పురుగుల మందులు వాడకుండా మనమే పెంచుకోవచ్చు. 2 ఎకరాల్లో పండించే కూరగాయలను ఈ పద్ధతి ద్వారా 2 వందల గజాల్లో పండించొచ్చు. అదీ ఆరోగ్యకరంగా, రసాయనాలు వాడకుండా పెంచవచ్చు. రోజురోజుకూ జనాభా పెరుగుతోంది. రాబోయే పాతికేళ్లలో ఇప్పటి కంటే 70 శాతం వ్యవసాయం పెరిగితే తప్ప మనకు ఆహారం దొరకదు. రోజుకు నాలుగు లక్షల మంది పిల్లలు పుడుతున్నారు. రెండు దశాబ్దాల తర్వాత ప్రపంచ జనాభా సంఖ్య మరో 200 కోట్లు పెరుగుతుంది. అందుకే మనమే రైతులా మారిపోవాలి. మన వంట గది పక్కనే కూరగాయలు పండించుకోవాలి. ప్రతి ఇంట్లోనూ రైతు పుట్టాల్సిన సమయం వచ్చేసింది. లేకపోతే రాబోయే రోజుల్లో మనకు తిండి దొరకదు. `వెర్టికల్ ఫార్మింగ్`పై ప్రభుత్వం దృష్టి సారించాలి. ప్రతి గ్రామంలోనూ `వెర్టికల్ ఫార్మింగ్`ను ప్రోత్సహించాలి. ఏ ఊరికి కావాల్సిన కూరగాయలు ఆ ఊర్లోనే పండే ఏర్పాట్లు చేయాలి. ఈ విధానం వల్ల 75 శాతం భూమి అందుబాటులోకి వస్తుంది. అందులో వరి, గోధుమలు, క్వినోవా వంటి పంటలు పండించుకోవచ్చు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటి నుంచే ముందడుగు వేయాలి. నాయకులందరూ తలపాగా చుట్టి రైతన్నల్లా మారాల`ని పూరీ పేర్కొన్నారు. 

 


Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.