జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే అనవసరమైన భారం ఉండకూడదని, చుట్టూ ఉన్న చెత్తను గుర్తించి వదిలించుకోవాలని అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్. `పూరీ మ్యూజింగ్స్` పేరుతో ఆయన ఎప్పటికప్పుడు పలు అంశాలపై తన అభిప్రాయాలను వివరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన `ట్రాష్ బ్యాగ్స్` గురించి మాట్లాడారు.
`ఎడ్మండ్ హిల్లరీ ఎలాగైనా ఎవరెస్ట్ ఎక్కాలనుకున్నాడు. అందరితో కలిసి ప్లాన్ చేశాడు. 352 మంది పోర్టల్స్. కొందరు డాక్టర్లు. మరో 20 మంది సహాయకులు. మొత్తం నాలుగు వందల మంది. ఆహారం, మిగతా వస్తువులతో కలిసి 4500 కేజీల లగేజీ. అందరితో కలిసి బయలుదేరాడు. కొంత దూరం వెళ్లాక అందులో కొంత లగేజీ అవసరం లేదనిపించింది. వదిలేశాడు. బేస్ క్యాంప్‌నకు వెళ్లాక మరికొంత అనవసరం అనిపించింది. లగేజీతోపాటు మరికొందరిని వెనక్కి పంపేశాడు. మోస్తూ నడుస్తూ ఉంటే ఏది అనవసరమో అర్థమయ్యేది. వాటన్నింటినీ వదిలించుకున్నాడు. చివరకు అతనొకడే ఎవరెస్ట్ ఎక్కాడు. నిజానికి ఎవరెస్ట్ ఎక్కాలనుకున్నది అతనొక్కడే. మిగతా 400 మంది కాదు. అలాగే జీవితంలో నువ్వు అనుకున్నది సాధించాలనుకుంటే అనవసరమైన భారం ఉండకూడదు. మన చుట్టూ ఉన్న చెత్తను గుర్తించాలి. మన చుట్టూ ఉన్న చెత్త మనుష్యుల రూపంలో ఉంటుంది. అది గుర్తించే సరికి నా జీవితంలో సగం అయిపోయింది. మీరైనా జాగ్రత్తగా ఉండండి. గుర్తుపెట్టుకోండి.. ట్రాష్ బ్యాగ్స్‌ను గుర్తించి ఎప్పటికప్పుడు వదిలించుకోండ`ని పూరీ పేర్కొన్నాడు.