Advertisement

బ్రూస్ లీ.. గొప్ప యోధుడు: పూరీ జగన్నాథ్

Nov 16 2020 @ 16:56PM

అతి చిన్న వయసులోనే చనిపోయినా ప్రపంచం మీద తనదైన ముద్ర వేసిన గొప్ప యోధుడు బ్రూస్ లీ అని పేర్కొన్నారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌. పూరీ మ్యూజింగ్స్‌ పేరుతో ఆయన వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో అంశాల గురించి మాట్లాడిన పూరీ.. తాజాగా `బ్రూస్ లీ` గురించి మాట్లాడారు. 


`చైనా జ్యోతిష్యం ప్రకారం బిడ్డ పుట్టిన ఘడియ, సంవత్సరం రెండూ డ్రాగన్ అయితే వాడు మహార్జాతకుడవుతాడని చైనీయులు నమ్ముతారు. సరిగ్గా అదే టైమ్‌లో శాన్‌ఫ్రాన్సిస్కోలో డ్రాగన్ లాంటి కుర్రాడు పుట్టాడు. వాడే బ్రూస్ లీ. బ్రూస్ అనే పేరు అక్కడి నర్స్ పెట్టింది. పేరెంట్స్ ఇద్దరూ ఓపెరా సింగర్స్. ఆ తర్వాత వారిద్దరూ హాంకాంగ్ వెళ్లిపోయారు. 13 ఏళ్ల వయసులో బ్రూస్ లీ 20 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. హిప్‌మాన్ అనే గురువు దగ్గర కుంగ్ ఫూ నేర్చుకున్నాడు. ఇంటర్ స్కూల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ కొట్టాడు. ఎవరికీ తెలియని విషయమేమింటే అతడు అద్భుతమైన డ్యాన్సర్. సినిమా ఫీల్డ్‌ను పేరెంట్స్ వద్దన్నారని 100 డాలర్లు పట్టుకుని అమెరికా షిప్ ఎక్కేశాడు. సియాటెల్‌లో కుంగ్ ఫూ నేర్పిస్తూ సంపాదించిన డబ్బుతో ఫిలాసఫీ చదువుకున్నాడు. చైనీస్ కానివారికి కుంగ్ ఫూ నేర్పిస్తున్నాడనే కారణంతో కొందరు చైనీయులు బ్రూస్ లీని కొట్టడానికి వచ్చారు. `మీ చేతుల్లో ఓడిపోతే మళ్లీ నేను కుంగ్ ఫూ చేయన`ని ఛాలెంజ్ చేసి వారందరినీ మట్టి కరిపించాడు. ఆ తర్వాత తన సొంత ఫిలాసఫీతో సొంతంగా ఓ మార్షల్ ఆర్ట్‌ని కనిపెట్టాడు. దాని పేరు `జీత్క్వోండో`. ఆ తర్వాత `వన్ ఇంచ్ పంచ్‌`ని కనిపెట్టాడు. ఫిలాసఫీ టీచర్‌గా పనిచేస్తూ లిండా అనే స్టూడెంట్‌ను పెళ్లి చేసుకున్నాడు. వారికి బ్రాండెన్ లీ అనే కొడుకు పుట్టాడు. కుటుంబ కష్టాలు తట్టుకోలేక చిన్న చిన్న టీవీ సీరియల్స్‌లో, సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత కొడుకు, భార్యతో కలిసి హాంకాంగ్ వెళ్లిపోయాడు. అక్కడ ఓ నిర్మాతను కలిసి అతని ద్వారా గోల్డెన్ హార్వెస్ట్ కంపెనీ కోసం ఓ సినిమా తీశాడు. అదే `ది బిగ్‌బాస్`. అప్పట్లో అది బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ బద్దలుగొట్టింది. ఆ తర్వాత వార్నర్ బ్రదర్స్‌తో కలిసి `గేమ్ ఆఫ్ డెత్` సినిమా తీశాడు. ఈ సినిమాతో హాంకాంగ్ సినీ ఇండస్ట్రీ చరిత్ర మారిపోయింది. అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత `ఎంటర్ ది డ్రాగన్`. సినిమా పూర్తయింది. కానీ, ఒక రోజు తలనొప్పి వచ్చిందని పెయిన్ కిల్లర్ వేసుకోవడంతో కోమాలోకి వెళ్లిపోయి చనిపోయాడు. `ఎంటర్ ది డ్రాగన్` ఫస్ట్ కాపీ అతను చూడలేదు. అతని మరణం మిస్టరీగా మిగిలిపోయింది. బ్రూస్ లీ చెప్పిన ఒక కోట్ అంటే నాకిష్టం. `దేవుడిని ఎప్పుడూ సులభమైన జీవితం ఇమ్మని కోరుకోవద్దు. వాడు పెట్టే కష్టాలన్నింటినీ తట్టుకునే శక్తిని ఇమ్మని కోరుకో`అని చెప్పాడు. బ్రూస్ లీ కంటే గొప్ప ఫైటర్స్ చాలా మంది ఉండొచ్చు. కానీ, అతని ఫిలాసఫీకి అందరూ ఫ్లాట్ అయిపోతారు. కొట్టే పంచ్ వెనుక థియరీ చెబుతాడు. అతి చిన్న వయసులో 32 ఏళ్లకే చనిపోయాడు. జీవితంలో అతను చేసిన వర్క్ చాలా తక్కువ. అయినా ప్రపంచంలోని ఎన్నో కోట్ల మందికి బ్రూస్ లీ పేరు తెలుసు. అదే బ్రూస్ లీ వేసిన ప్రభావమ`ని పూరీ పేర్కొన్నారు. 

 
Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.