అన్నవరం,
జనవరి 19: రాష్ట్రంలో పురోహితులు అభ్యసించే స్మార్తవిద్యకు సంబంధించి
ప్రభుత్వం ద్వారా ధ్రువీకరణపత్రం అందించే విధంగా కృషి చేస్తానని రాష్ట్ర
శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి చెప్పారు. అన్నవరంలోని ఓ ప్రైవేట్ కల్యాణ
మండపంలో ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన
తెలుగు బ్రాహ్మణ పురోహితుల స్మార్త పురోహిత పరీక్షలకు ఆయన ముఖ్య అతిథిగా
హాజరై ప్రసంగించారు. ఈ పరీక్షలకు సుమారు వెయ్యి మంది దరఖాస్తు చేసుకోగా
తొలిరోజున 10 కేంద్రాల ద్వారా 350 మందికి పరీక్షలు నిర్వహించి ధ్రువీకరణ
పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర గౌరవాధ్యక్షుడు
యామిజాల నరసింహమూర్తి మాట్లాడుతూ పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా
గుర్తించాలని కోరారు. మరో అతిథి శాసనసభ్యుడు మల్లాది విష్ణు మాట్లాడుతూ
హిందూధర్మాన్ని కాపాడడానికి బ్రాహ్మణులు ఉన్నట్టే బ్రాహ్మణులను అన్నివిధాలా
ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. త్వరలో బ్రాహ్మణులకు
రాష్ట్రవ్యాప్తంగా రెండేసి జిల్లాల చొప్పున సమావేశాలు ఏర్పాటు చేసి సంఘటితం
చేయాలన్నారు. దేవదాయశాఖ ద్వారా స్మార్తవిద్య పరీక్షలు నిర్వహించేందుకు
దేవదాయమంత్రి, కమిషనర్‌తో కలసి చర్చిస్తామన్నారు. అనంతరం బ్రాహ్మణ సమాఖ్య
నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేయించారు. సుమారు 40మంది పరీక్షాధికారులు
పాల్గొనగా అన్నవరం నుంచి చెళ్లపిల్ల ప్రసాదశర్మ, కొంపెల్ల నారాయణమూర్తి
పురోహితుల విద్వత్తును పరీక్షించారు. కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం వ్రత
పురోహిత సంఘం అధ్యక్షుడు నాగాభట్ల రవిశర్మ, ప్రముఖ పండితులు విశ్వనాఽథ
గోపాలకృష్ణ, చిర్రావూరి శ్రీరామశర్మ, నాగాభట్ల కామేశ్వరశర్మ, కపిలవాయి
రామశాస్త్రి, యామని వెంకట రామచంద్ర సోమయాజ ఘనాపాఠి పాల్గొన్నారు.