మత్తు, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపండి

ABN , First Publish Date - 2022-06-26T06:10:13+05:30 IST

జిల్లాలో మత్తు, మాదకద్రవ్యాల విక్రయం, సరఫరాలపై ఉక్కుపాదం మోపాలని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) డైరెక్టర్‌ డీఐజీ ఆవుల రమేష్‌రెడ్డి పేర్కొన్నారు.

మత్తు, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపండి
సమావేశంలో పాల్గొన్న ఎస్‌ఈబీ డైరెక్టర్‌ రమేష్‌రెడ్డి, ఎస్పీ, ఏఎస్పీ

పోలీసులు, ఎస్‌ఈబీ కలిసికట్టుగా పనిచేయాలి

 సమీక్షా సమావేశంలో ఎస్‌ఈబీ డైరెక్టర్‌ రమేష్‌ రెడ్డి 


తిరుపతి (నేరవిభాగం), జూన్‌ 25: జిల్లాలో మత్తు, మాదకద్రవ్యాల విక్రయం, సరఫరాలపై ఉక్కుపాదం మోపాలని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) డైరెక్టర్‌ డీఐజీ ఆవుల రమేష్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం తిరుపతికి వచ్చిన ఆయన ఎస్పీ పరమేశ్వరరెడ్డితో కలిసి జిల్లా ఎస్‌ఈబీ, పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.  స్థానిక పోలీసు సమావేశ మందిరంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సారా తయారీ, అమ్మకం, పక్క రాష్ట్రాలనుంచి మద్యం అక్రమ రవాణా, గంజాయి సరఫరా, విక్రయాలు, తదితర నిషేధిత పొగాకు ఉత్పత్తుల రవాణా, అమ్మకాలు తదితర నేరాల నియంత్రణకు ఎస్‌ఈబీ, పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. ఎస్‌ఈబీ, పోలీసులు సమష్టిగా పనిచేస్తేనే ఫలితం ఉంటుందన్నారు. అయితే ప్రస్తుతం జిల్లాలో అటువంటి సమష్టి కృషి కనిపించడంలేదంటూ రెండు శాఖల అధికారుల పనితీరుపై పెదవి విరిచారు. ఇప్పటినుంచైనా రెండు శాఖలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. సారా తయారీ, విక్రయాలు, గంజాయి సరఫరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి విరివిగా దాడులు నిర్వహించాలన్నారు. ఎస్పీ పరమేశ్వరరెడ్డి మాట్లాడుతూ... వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట తదితర ప్రాంతాల్లో సారా తయారీ, విక్రయాలు తక్కువగా ఉన్నాయన్నారు. అందువల్ల ఈ ప్రాంతాల అధికారులు, సిబ్బంది కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల సిబ్బందితో కలిసి పనిచేసి సారా, ఇతర అక్రమ రవాణాలను అరికట్టేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిపాలనా విభాగం ఏఎస్పీ సుప్రజ, ఎక్సైజ్‌ ఏఎస్పీ స్వాతి, ఇతర డీఎస్పీలు, ఎస్‌ఈబీ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-26T06:10:13+05:30 IST