నెల్లూరు అడవుల్లో ‘పుష్ప’ సీన్‌

ABN , First Publish Date - 2022-01-24T09:01:07+05:30 IST

నెల్లూరు జిల్లా రాపూరు అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు ‘పుష్ప’ సినిమా సీన్‌ను తలపించేలా పోలీసులపై రెచ్చిపోయారు. తమను అడ్డుకోబోయిన పోలీసులపై రాళ్లు, గొడ్డళ్లు..

నెల్లూరు అడవుల్లో ‘పుష్ప’ సీన్‌

ఎర్రచందనం నరికేందుకు 55 మంది కూలీలు

పట్టుకోబోయిన పోలీసులపైకి రాళ్లు, గొడ్డళ్లు

చాకచక్యంగా  అడ్డుకున్న పోలీసులు

ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు


నెల్లూరు(క్రైం), జనవరి 23: నెల్లూరు జిల్లా రాపూరు అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు ‘పుష్ప’ సినిమా సీన్‌ను తలపించేలా పోలీసులపై రెచ్చిపోయారు. తమను అడ్డుకోబోయిన పోలీసులపై రాళ్లు, గొడ్డళ్లు విసరడంతోపాటు వాహనాలను దూకించి తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు  చాకచక్యంగా వ్యవహరించి ముగ్గురు స్మగ్లర్లు సహా 55 మంది కూలీలను అరెస్టుచేశారు. దీనికి సంబంధించి ఎస్పీ విజయరావు తెలిపిన వివరాలు.. చిత్తూరు జిల్లా వీబీపురం మండలం ఆరె గ్రామానికి చెందిన వలూ ్లరు దాము, గతంలో ఇతని వద్ద పనిచేసిన కుప్పన్న సుబ్రహ్మణ్యంకు పుదుచ్చేరికి చెందిన పెరుమాళ్లు వేలుమలైతో పరిచయం అయింది. వేలుమలై అతని బావమరిది రాధాకృష్ణన్‌ పళనిని దాముకు పరిచయం చేశాడు. ఈ నెల 20న కూలీలతో వారంతా నెల్లూరు జిల్లా గూడూరుకు చేరుకున్నారు. అక్కడ వేలుమలైకు తెలిసిన కడపజిల్లా రైల్వేకోడూరుకి చెం దిన చంద్రశేఖర్‌ని కలిశారు. అతని సహకారంతో రాపూరు అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికి 21వ తేదీ రాత్రి దుంగలను లారీలో వేసుకొని తిరుగు ప్రయాణమయ్యారు.


సమాచారం అందుకున్న పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. శనివారం మధ్యాహ్నం రెండు వాహనాల్లో చెన్నై జాతీయ రహదారిలో ఎర్రచందనం దుంగలతో  కూలీలు, మాఫియా సభ్యులు ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. వీరిని చిల్లకూరు మండలం బూదనం గ్రామం వద్ద నిలిపేందుకు ప్రయత్నించగా, స్మగ్లర్లు తమ వాహనాలను పోలీసులపైకి ఎక్కించేందుకు ప్రయత్నించడంతోపాటు గొడ్డళ్లను విసి రారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆ వాహనాలను జీపులతో చుట్టిముట్టి నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 45 ఎర్రచందనం దుంగలు, 24 గొడ్డళ్లు, 31 సెల్‌ఫోన్లు, 3 బరిసెలు, ఓ లారీ, టయోటో కారు, రూ.75,230 నగదును స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2022-01-24T09:01:07+05:30 IST