సినిమా రివ్యూ: పుష్పక విమానం

Nov 12 2021 @ 15:48PM

సినిమా రివ్యూ: పుష్పక విమానం

విడుదల తేది: 12, నవంబర్‌ 2021

నటీనటులు: ఆనంద్‌ దేవరకొండ, గీత్‌ షైని, శాన్వి మేఘన, నరేశ్‌, హర్షవర్థన్‌, గిరి,  కిరీటి దామరాజు తదితరులు. 

కెమెరా: హెస్టిన్‌ జోస్‌ జోసెఫ్‌

ఆర్ట్‌: నీల్‌ సెబాస్టియన్‌ 

ఎడిటింగ్‌: రవితేజ 

సంగీతం: రామ్‌ మిరియాల

సమర్పణ: విజయ్‌ దేవరకొండ 

నిర్మాతలు: గోవర్థన్‌ రావు దేవరకొండ, విజయ్‌ మట్టపల్లి, ప్రదీప్‌ ఎర్రబెల్లి

దర్శకత్వం: దామోదర


‘దొరసాని’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు ఆనంద్‌ దేవరకొండ. మలి ప్రయత్నంగా ‘మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్’తో ఆకట్టుకున్నారు. తాజాగా ‘పుష్పక విమానం’తో ఈ శుక్రవారం ప్రేక్షకుల్ని పలకరించారు. కథ మీద ఉన్న నమ్మకంతో ప్రముఖ హీరో, ఆనంద్‌ అన్నయ్య విజయ్‌ దేవరకొండ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రమోషన్‌లోనూ భాగమయ్యారు విజయ్‌. భారీ ప్రమోషన్ల‌తో నేడు థియేటర్‌లోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంది. విజయ్‌ దేవరకొండ నమ్మకం, జడ్జిమెంట్‌ కరెక్టేనా అన్నది రివ్యూలో తెలుసుకుందాం.  


కథ:

చిట్టిలంక సుందర్‌(ఆనంద్‌ దేవరకొండ) ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టారు. మీనాక్షి (గీత్‌ షైౖనీ)తో  పెద్దలు కుదిర్చిన పెళ్లి జరుగుతుంది. ఉద్యోగరీత్యా వేరే ఊరులో మకాం పెడతాడు సుందర్‌. పెళ్లైన ఎనిమిది రోజులకే మనస్పర్థలతో మీనాక్షి ఇంటిని వదిలి తనకు నచ్చిన వ్యక్తి దగ్గరకి వెళ్లిపోతుంది. తన భార్య తనతో లేదని తెలిస్తే సమాజంలో పరువు పోతుందని సుందర్‌ భావిస్తాడు. ఆమె తనతో ఉన్నట్లే అందరినీ నమ్మిస్తాడు. కొన్ని తప్పని సరి పరిస్థితుల్లో.. హీరోయిన్‌ కావాలని వచ్చి షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటించే రేఖ (శాన్వి మేఘన)ని తన భార్యగా నటించమని ఇంటికి తీసుకొస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు మీనాక్షి ఏమైంది? ఆమె మిస్సింగ్‌ కేసు కోసం ఎస్సై రంగం (సునీల్‌) ఇన్వెస్టిగేషన్‌లో దిగాక బయటపడ్డ విషయాలేంటి..? అన్నది మిగతా కథ. 

విశ్లేషణ:

ఓ  అమాయక యువకుడు పెళ్లి, అతని జీవితం, ఓ మర్డర్‌ మిస్టరీ చుట్టూ తిరిగే చిన్న కథ ఇది. సుందర్‌, మీనాక్షి పెళ్లితోనే సినిమా మొదలవుతుంది. పెళ్లైన కొద్దిరోజులకే భార్య వెళ్లిపోవడం, ఆమె ఇంట్లో లేకపోయినా ఉందని నమ్మించేందుకు సుందర్‌ చేసిన పనులు, పడ్డ ఇబ్బందులు హాస్యాన్ని పండించాయి. ఫస్టాఫ్‌లోని స్కూల్‌ సన్నివేశాలు, సుందర్‌ ఇంటికి స్టాఫ్‌ రావడం లాంటి సన్నివేశాలు చూస్తున్న ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తాయి. మీనాక్షి మర్డర్‌ వార్త బయటికి రావడంతో ఇంటర్వెల్‌కు ముందు కథ మలుపు తిరిగింది. దర్యాప్తు పేరుతో ఎస్సైగా సునీల్‌ రంగంలోకి దిగిన తర్వాత సినిమా అనేక మలుపులు తిరుగుతుంది. కొత్తగా పెళ్లైన భార్యభర్తల మధ్య చిన్నచిన్న సమస్యలు సహజం. మనసు అర్థం చేసుకుని సర్దుబాటు చేసుకునే విషయంలో దర్శకుడు లోతుగా ఆలోచన చేయకుండా సింపుల్‌గా తేల్చేశారని అనిపిస్తుంది. గత చిత్రాలతో పోలిస్తే ఆనంద్‌ నటన కొత్తగా ఉంది. భార్య మర్డర్‌ మిస్టరీని ఛేదించే క్రమంలో అతని నటన ఆకట్టుకుంది. హీరోయిన్లు గీత్‌షైనీ నటన పర్వాలేదనిపించింది. శాన్వి మేఘన అల్లరి, మాటలు ఆకట్టుకుంటాయి. ఎస్సై రంగంగా సునీల్‌ నటన, మేనరిజం బాగున్నాయి. నరేశ్‌, గిరి, తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. కెమెరా వర్క్‌ బాగుంది. నేపథ్య సంగీతం తేలిపోయినట్లుంది. ఎమోషనల్ సన్నివేశాలు తెరకెక్కించడంలో దర్శకుడు దామోదర సక్సెస్‌ అయ్యారు కానీ.. సెకండాఫ్‌లో కొన్ని సాగదీత సీన్లపై మరింతగా దృష్టిపెట్టి ఉండాల్సింది. నిర్మాణ విలువలు బావున్నాయి. ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు, ఇంటర్వెల్‌ ట్విస్ట్‌, కామెడీ ఈ సినిమాకు ప్లస్‌గా చెప్పుకోవచ్చు. కొన్ని సాగదీత సన్నివేశాలు, స్ర్కీన్‌ప్లే, సంగీతం సినిమాకు కొంత మైనస్‌. ఓవరాల్‌గా ‘పుష్పక విమానం’  థియేటర్‌లోని ప్రేక్షకులని బాగానే ఎంటర్‌టైన్ చేస్తుంది.


ట్యాగ్‌లైన్‌: కుదిరితే ప్రయాణం చేయవచ్చు


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.