
- 31న ప్రతి ఇంటిముందు కాంగ్రెస్ నిరసన
- ఏఈ, డీఈ కార్యాలయాల ఎదుట ఆందోళన
- విద్యుత్తు చార్జీలు, గ్యాస్, పెట్రోలు, డీజిల్
- ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన కార్యాచరణ
- 4న మోదీ, కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం
- 5న కలెక్టరేట్లు, 7న విద్యుత్ సౌధ ముట్టడి
- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వెల్లడి
హైదరాబాద్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): దేశంలో పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు, రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 31న మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటి ముందు గ్యాస్ సిలిండర్‌కు దండ వేసి.. డప్పు వాయించనున్నారు. అదే రోజు మండల, నియోజకవర్గ స్థాయిల్లోని ఏఈ, డీఈ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలపనున్నారు. ఏప్రిల్ 4న మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయనున్నారు. 5న పార్టీ శ్రేణులు కలెక్టరేట్లను ముట్టడించనున్నాయి. 7న రాష్ట్ర స్థాయిలో విద్యుత్ సౌధ, పౌరసరఫరాల శాఖ కమిషనరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శనివారం గాంధీభవన్‌లో ఈ వివరాలు వెల్లడించారు.
ఏఐసీసీ సూచన మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దోపిడీని అడ్డుకునేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. ఏప్రిల్ 7న విద్యుత్ సౌధ, పౌరసరఫరాల శాఖ కమిషనరేట్ ముట్టడి కార్యక్రమాల్లో తాను, పార్టీ ముఖ్యనేతలు పాల్గొంటారని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి ప్రధాన కారణం ప్రభుత్వమేనని రేవంత్ ఆరోపించారు. వ్యవసాయానికి, లిఫ్టు సేద్యానికి, వివిధ వ్యాపారాలు, సంక్షేమ కార్యక్రమాలకు ఉచిత విద్యుత్‌ను ప్రకటించిన ప్రభుత్వం.. ఆ బకాయిలను విద్యుత్ సంస్థలకు చెల్లించకపోవడం వల్లే ఈ సంక్షోభం ఏర్పడిందన్నారు. కొందరు ప్రభుత్వ పెద్దలు విద్యుత్ బిల్లులు ఎగవేయడం వల్ల మరో రూ.6 వేల కోట్ల మేరకు డిస్కమ్‌లకు లోటు ఏర్పడిందని తెలిపారు. విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను చెల్లిస్తే పేదలపై భారం వేయాల్సిన అవసరమే ఉండదన్నారు. మరోవైపు ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ జరిగినన్ని రోజులూ గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను పెంచని మోదీ ప్రభుత్వం.. ఎన్నికలు అయిపోగానే పెంచుతోందని విమర్శించారు. ధరలు, చార్జీలు పెంచిన బీజేపీ, టీఆర్ఎస్.. దోపిడీని కప్పిపుచ్చుకునేందుకు ధర్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
కేసీఆర్ దీక్ష చేస్తే మేం కాపాడుకుంటాం..
రైతులపై సీఎం కేసీఆర్‌కు నిజంగా ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించాలన్న డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆమరణ దీక్ష చేపట్టాలని రేవంత్‌రెడ్డి అన్నారు. కంచె వేసి ఆయనను తాము కాపాడుకుంటామని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను ఎందుకు కలవడంలేదని ప్రశ్నించారు. తమకు రూ.10 వేల కోట్లు ఇస్తే ధాన్యం చివరి గింజవరకూ కొంటామన్నారు కాగా, గజ్వేలు నియోజకవర్గానికి చెందిన పలువురు టీఆర్ఎస్ నేతలు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో ఆయన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పాల్గొన్నారు.