పుతిన్‌.. ముందుకా? వెనక్కా?

ABN , First Publish Date - 2022-03-07T09:31:36+05:30 IST

పుతిన్‌.. ముందుకా? వెనక్కా?

పుతిన్‌.. ముందుకా? వెనక్కా?

ఉక్రెయిన్‌పై రష్యా దాడి తీవ్రతరమై ప్రపంచ యుద్ధంగా మారే ముప్పుందా?

యుద్ధం ముగిసే అవకాశాలపై రకరకాల విశ్లేషణలు చేస్తున్న పాశ్చాత్య దేశాలు


గదిలో బంధించి కొడితే పిల్లి కూడా ఎదురు తిరుగుతుందని మనకు తెలిసిన సామెత! పుతిన్‌ కూడా తన చిన్నప్పుడు జరిగిన ఇలాంటిదే ఒక సంఘటన గురించి చెప్పారు! లెనిన్‌గ్రాడ్‌లో (నేటి సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌) ఉన్నప్పుడు తాను ఒక గదిలో కనిపించిన ఎలుకను తరమడం మొదలుపెట్టానని.. అది తననుంచి పారిపోయే ప్రయత్నంలో ఒక మూలకు వెళ్లిపోయిందని.. అక్కణ్నుంచీ తప్పించుకునే దారిలేక తనమీదికే వచ్చిందని ఆయన వివరించారు. అదే కథను వర్తమానానికి వర్తింపజేస్తే.. ‘‘ఆ కథలో ఎలుకను నేనే. కాబట్టి ఆర్థిక ఆంక్షల పేరుతో నన్ను కార్నర్‌ చేయాలని చూశారో.. అణ్వాయుధ ప్రయోగానికి కూడా వెనుకాడను తస్మాత్‌ జాగ్రత్త’’ అన్న చందంగా పుతిన్‌ ఇటీవలే పరోక్ష హెచ్చరిక కూడా జారీ చేశారు. దీంతో.. మున్ముందు ఏం జరగనుంది? అసలు ఈ యుద్ధం ముగుస్తుందా? లేక అమెరికా, ఈయూ దేశాల జోక్యంతో ప్రపంచ యుద్ధంగా మారుతుందా? అణ్వస్త్ర ప్రయోగానికి వేదిక అవుతుందా? ఉక్రెయిన్‌ లొంగిపోతుందా? అఫ్ఘానిస్థాన్‌ తరహాలో దశాబ్దాల తరబడి ప్రతిఘటిస్తూనే ఉంటుందా? ఆంక్షల నేపథ్యంలో రష్యన్లు విప్లవానికి దిగే అవకాశమేమైనా ఉందా? ..ఇలా రకరకాల పరిస్థితులపై పశ్చిమ దేశాల రక్షణ నిపుణుల అంచనాల ప్రకారం..


ఇరకాటంలో రష్యా..

రష్యా ఆక్రమణను ఉక్రెయిన్‌ ఇప్పటిదాకా గట్టిగానే ఎదుర్కొంది. రాజధాని కీవ్‌ను ఆక్రమించేందుకు రష్యా చేసిన ప్రయత్నాలను విజయవంతంగా తిప్పికొట్టింది. దీంతో.. ‘వీలైనంత వేగంగా ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకుందాం’ అన్న పుతిన్‌ యోచన ఫలించలేదు సరికదా.. సైనికులకు తోడుగా ఉక్రెయిన్‌ ప్రజలు జాతీయభావంతో పెద్ద ఎత్తున పదాతిదళంలో చేరుతున్నారు. రష్యా సైనికులకు క్షేత్ర స్థాయిలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్థానిక వనరులను ఏ మాత్రం వినియోగించుకోకుండా యుద్ధం చేయాల్సి వస్తోంది. మరోపక్క పశ్చిమ దేశాల నిఘా వ్యవస్థలు, యాంటీ ట్యాంక్‌ క్షిపణులు, భూతలం నుంచి గగనతలానికి వేసే క్షిపణులు ఉక్రెయిన్‌కు కలిసివస్తున్నాయి. దాంతో రాజధాని కీవ్‌లో ఉక్రెయిన్‌ బలగాలు సైనిక ప్రతిష్ఠంభన వాతావరణం కల్పించగలిగాయి. మరోవైపు.. రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షల దెబ్బతో ఎక్కువకాలంపాటు యుద్ధం కొనసాగించలేక, అలాగని ఓటమిని ఒప్పుకోలేక రష్యా ఇరకాటంలో పడుతుందని అంచనా.


గెలిచినా సవాలే..

అత్యాధునిక ఆయుధాలు, తిరుగులేని వైమానిక శక్తి, విచక్షణ లేకుండా వినియోగిస్తున్న క్షిపణుల కారణంగా రష్యాదే పైచేయి అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ అలా జరిగి రష్యా గెలిస్తే.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడిని దింపేసి, సైన్యాన్ని లొంగదీసుకుంటే సరిపోదు. నాలుగు కోట్ల జనాభా ఉన్న దేశం మొత్తాన్నీ రష్యా నియంత్రణలోకి తెచ్చుకోవడం పుతిన్‌కు పెద్ద సవాలే. 


నాటో జోక్యంతో అణు ముప్పు

ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌ నుంచి విడిపోయిన దేశాల్లో నాలుగు.. ఇప్పటికే నాటో కూటమిలో చేరాయి.  నాటో కూటమిలో ఒక దేశం మీద దాడి చేస్తే అన్ని దేశాల మీద దాడి చేసినట్లే. ఈ నేపథ్యంలో పుతిన్‌ నాటో సభ్య దేశాల మీద దాడికి సాహసిస్తారని ఎవరూ అనుకోవడం లేదు. ఎందుకంటే అది అణు యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. అదే సమయంలో.. నాటో కూడా రష్యాపై ప్రత్యక్షంగా యుద్ధానికి దిగే అవకాశం లేదు. కానీ, పరోక్షంగా ఉక్రెయిన్‌కు ఆర్థిక, ఆయుధ సాయం చేయడాన్ని కొనసాగిస్తే మాత్రం అప్పుడు.. పుతిన్‌  రెచ్చగొట్టే చర్యలకు పాల్పడతారని అంచనా వేస్తున్నారు. 


ఎస్కలేట్‌ టు డీ ఎస్కలేట్‌..

అమెరికా, రష్యా మధ్య గతంలో.. డీ కాన్‌ఫ్లిక్షన్‌ లైన్‌ పేరుతో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటైంది. ఇరు దేశాల మధ్య ఏ మాత్రం అపోహలు తలెత్తినా మిలిటరీ సమాచారాన్ని పరస్పరం మార్చుకోడం ద్వారా తీర్చుకుంటారు. సిరియా అంతర్యుద్ధంలో అమెరికా, రష్యా చెరోవైపు రంగంలోకి దిగాయి. ఈ సమాచార మార్పిడి ద్వారా అమెరికా, రష్యా మధ్య అణుయుద్ధం తలెత్తే అవకాశమే లేకుండా జాగ్రత్త పడ్డారు. ఈ డీకాన్‌ఫ్లిక్షన్‌ లైన్‌ కారణంగా అణయుద్ధ భయం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు యుద్ధాలు జరిగాయి. కానీ, ఉక్రెయిన్‌ విషయంలో రష్యా భిన్నంగా వ్యవహరిస్తోంది. తన అణ్వాయుధాలను సిద్ధం చేయడం ద్వారా అమెరికా, ఈయూ దేశాలకు హెచ్చరిక పంపింది. ఆంక్షల బెడద మరీ ఎక్కువైతే.. పుతిన్‌ అణ్వస్త్రాలను బయటకు తీసే అవకాశం ఉంది. అప్పుడు కూడా తొలుత.. తక్కువ నష్టాన్ని కలిగించే ‘టాక్టికల్‌ అణ్వాయుధాల’ను మాత్రమే ఉక్రెయిన్‌పై పరిమితంగా ప్రయోగిస్తారని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో పాశ్చాత్య దేశాలు వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే.. రష్యా టాక్టికల్‌ అణ్వస్త్రాలు ప్రయోగించింది కదా అని ఉక్రెయిన్‌ తరఫున నాటో రంగంలోకి దిగితే అది పెద్ద ఎత్తున విధ్వంసం, జనహననానికి కారణమయ్యే ‘స్ట్రాటెజిక్‌ అణ్వాయుధాల’ వినియోగానికి దారి తీస్తుంది. 1945 యుద్ధంలో జపాన్‌ లొంగిపోయినట్టుగా ఇప్పుడు ఉక్రెయిన్‌ లొంగిపోతుందనే అంచనాతో పుతిన్‌ ఈ వ్యూహాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. ఈ వ్యూహాన్ని ‘ఎస్కలేట్‌-టు-డీఎస్కలేట్‌’గా వ్యవహరిస్తారు. మరీ అణ్వాయుధ ప్రయోగం ఎందుకని పుతిన్‌ అనుకుని ఈ యుద్ధాన్ని ఇలాగే కొనసాగిస్తే ఉక్రెయిన్‌లో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడి ఆ దేశం మరో అఫ్ఘానిస్థాన్‌లా రగిలే ప్రమాదం ఉంది.


రష్యన్ల విప్లవం?

ఉక్రెయిన్‌పై దాడికి వ్యతిరేకంగా రష్యాలో పెరుగుతున్న అసమ్మతిపై కూడా పుతిన్‌ ఒక కన్నేసి ఉంచారు. మీడియాపై ఉక్కుపాదం మోపారు. దాంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా యుద్ధ వార్తలు తెలుసుకొనే అవకాశమే లేకుండా పోయింది. రష్యా ప్రభుత్వ విధేయ మీడియా పట్టు పెరిగిపోయింది. అయినా కూడా.. యుద్ధాన్ని నిరసిస్తూ మాస్కో, సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ వంటి నగరాల్లో రష్యన్లు ర్యాలీలు నిర్వహిస్తూ తమ వ్యతిరేకతను స్పష్టంగా తెలియజేస్తున్నారు. వారిలో దాదాపు 10,000 మందిని పుతిన్‌ సర్కారు అరెస్టు చేసింది. చివరికి ప్రజాగ్రహానికి పుతిన్‌ సర్కారు పతనం కావడమూ జరగొచ్చని అంచనా వేస్తున్నారు. కానీ.. పొరుగునే ఉన్న బెలార్‌స తరహాలో రష్యాలో కూడా ప్రజావిప్లవాలను అణగదొక్కే అవకాశమూ లేకపోలేదు.       - సెంట్రల్‌ డెస్క్‌


చైనా వెనక్కి తగ్గితే?

ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ప్రస్తుతం చైనా పరోక్షంగా మద్దతిస్తోంది. అయితే.. మారుతున్న పరిస్థితుల్లో రష్యా ప్రాభవాన్ని కోల్పోతోందని చైనా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దేశం ఎప్పటికైనా తమకు గుదిబండగా మారే అవకాశం ఉందని చైనా భావిస్తే.. ఇప్పుడు ఇస్తున్న మద్దతు ఇవ్వకపోవచ్చు. రష్యా ‘టాక్టికల్‌ అణ్వస్త్రాల’ను ప్రయోగిస్తానంటే ఒప్పుకోకపోవచ్చు. అదే జరిగితే పుతిన్‌ వెనక్కి తగ్గడానికి అవకాశం ఉంది.

Updated Date - 2022-03-07T09:31:36+05:30 IST