అమ్మానాన్న ఉన్నా అనాథలయ్యారు!

ABN , First Publish Date - 2022-05-18T09:04:28+05:30 IST

భార్యాభర్తల మధ్య గొడవలు ముగ్గురు బిడ్డల్ని అనాథలను చేశాయి. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్యను ఎన్నిసార్లు మందలించినా..

అమ్మానాన్న ఉన్నా అనాథలయ్యారు!

ముగ్గురు చిన్నారులను వదిలి వెళ్లిన తండ్రి

ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లినట్లు వెల్లడి

భార్య వివాహేతర బంధంతో విసిగిపోయానని ఆవేదన

పోలీసులు న్యాయం చేయలేదని కన్నీటి పర్యంతం


పుట్టపర్తి, మే 17: భార్యాభర్తల మధ్య గొడవలు ముగ్గురు బిడ్డల్ని అనాథలను చేశాయి. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్యను ఎన్నిసార్లు మందలించినా పద్ధతి మార్చుకోకపోవడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన తండ్రి తన ముగ్గురు పిల్లలను ఊరుగాని ఊరులో వదిలేసి వెళ్లిపోయాడు. అయితే బిడ్డల పోషణ భారమై వదిలేసి వెళ్లాడంటూ ప్రచారం సాగడంతో మీడియా ముందుకొచ్చి తన ఆవేదన వెల్లడించాడు. తాను బిడ్డలను పోషించలేక వదిలి వెళ్లలేదని, తన భార్య వివాహేతర సంబంధంతో విసిగిపోయాననీ, పోలీసులు కూడా న్యాయం చేయకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్తూ.. పిల్లలను వదిలేశానని కన్నీటి పర్యంతమయ్యాడు. బాధితుడు హిందూపురం మండలం మలుగూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు తెలిపిన వివరాలివీ. కొత్తచెరువుకు చెందిన లావణ్యను శ్రీనివాసులు పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి కులాలు వేరు. శ్రీనివాసులు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుండేవాడు. వీరికి ఆరాధ్య (6), ప్రత్యుసాయి (3), నితిన్‌ (2) పిల్లలు కలిగారు. కొంతకాలంగా లావణ్య.. తన సామాజిక వర్గానికే చెందిన శ్రీనివా్‌సరెడ్డితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. వారిని శ్రీనివాసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవ జరగ్గా.. పెద్ద మనుషులు  రాజీ చేశారు. ఈ నేపథ్యంలో నెలన్నర క్రితం లావణ్య ఎక్కడికో వెళ్లిపోయింది. తనకు న్యాయం చేయాలంటూ శ్రీనివాసులు.. పోలీసులను ఆశ్రయించాడు. పలుమార్లు స్టేషన్ల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో ఈనెల 16న జిల్లా ఎస్పీని కలిసేందుకు పిల్లలను తీసుకుని, పుట్టపర్తికి వచ్చాడు. తనకు న్యాయం జరగదని భావించి ఇక ఆత్మహత్యే శరణ్యమని భావించాడు. అయితే పిల్లలను చంపుకోవడం ఇష్టంలేక ఎవరైనా పెంచుకుంటారనే ఉద్దేశంతో పుట్టపర్తిలోని ఎయిర్‌పోర్టు సమీపాన వదిలేసి వెళ్లి.. ధర్మవరం వద్ద రైలు పట్టాలపై పడుకున్నాడు. కానీ.. పిల్లలు గుర్తొచ్చి అక్కడి నుంచి వచ్చేశాడు. ఈలోగా ఎయిర్‌పోర్టు సమీపాన ఏడుస్తూ కనిపించిన పిల్లలను గుర్తించిన స్థానికులు పుట్టపర్తి అర్బన్‌ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి.. పిల్లలను స్టేషన్‌కు తీసుకొచ్చి, ఐసీడీఎస్‌ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి పిల్లలను హ్యాపీ హోమ్‌కు తరలించారు. అక్కడి నుంచి అనంతపురం తరలించనున్నారు. పిల్లలు తెలిపిన వివరాల మేరకు పోలీసులు.. శ్రీనివాసులు కోసం గాలిస్తుండగా అతడు మీడియా ముందుకొచ్చాడు. తాను పిల్లలు భారమై, వదిలి వెళ్లలేదనీ, ఆత్మహత్య చేసుకునేందుకే అలా చేశానంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.

Updated Date - 2022-05-18T09:04:28+05:30 IST