
కీలక సమయంలో పాములపర్తి వెంకట నరసింహారావు ప్రధాని అయ్యారు. సరియైన సమయంలో సరియైన వ్యక్తి సరియైన బాధ్యతలు స్వీకరించిన సమయం అది. భారత రాజకీయాలలో పివి స్థానం ఎంతో ప్రత్యేకమైంది. కల్లోల కాలంలో సరియైన దిశలో భారతదేశాన్ని నడిపించిన ఘనత నరసింహారావుదేనని అన్ని రాజకీయ పక్షాలూ ఈ రోజు ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నాయి. స్వాతంత్ర్యానంతర భారతంలో పివి ప్రత్యేకతలు ఎన్నెన్నో!
1991 జూన్‌లో పివి ప్రధాని అయ్యారు. ఆయన ప్రమాణ స్వీకార ఘట్టాన్ని దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. కార్యక్రమ ఆహూతుల్లో అటల్ బిహారి వాజ్‌పేయి, లాల్‌కృష్ణ అద్వానీ, చంద్రశేఖర్, వంటి ప్రతిపక్ష ప్రముఖులు ఉన్నారు. నాడు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో మరాఠా నేత శరద్ పవార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ గ్రంథ రచయిత ఆనాడు ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థి. యూనివర్సిటీ హాస్టల్ టివి గదిలో చర్చోపచర్చల మధ్య దూరదర్శన్ కార్యక్రమాన్ని చూస్తున్నారు విద్యార్థులు. కార్యక్రమం ముగిసిన వెంటనే అందరూ వేసుకున్న అంచనా ఒక్కటే. అదేమిటంటే, ‘1992 జూలైలో రాష్ట్రపతిగా ఆర్.వెంకటరామన్ పదవీకాలం ముగిసిపోతుంది. అప్పుడు పివిని రాష్ట్రపతిని చేస్తారు. శరద్ పవార్ ప్రధానమంత్రి అవుతారు’. ఇదీ ఆనాటి సామూహిక వ్యాఖ్య, నిజమే. పరిస్థితులు అట్లాగే ఉన్నాయి. పివి ఏడుపదుల వయసులో ఉన్నారు. యాభై రెండు సంవత్సరాల శరద్ పవార్‌కు అప్పటికే రాజకీయ ఇంద్రజాలకుడనే గుర్తింపు ఉంది. సువిశాల మహారాష్ట్రకు నాటికే రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి! ప్రధాని పదవి కోసం పివితో చివరిదాకా పోటీపడి తృటిలో ఓడిన అభ్యర్థి. ఆనాటి ఎన్నికల్లో మహారాష్ట్ర నుండి గెలిచిన 38 మంది కాంగ్రెస్ సభ్యులతో పాటు అనూహ్యంగా మరెంతోమంది తోడ్పాటును తీసుకున్న చాకచక్యం పవార్ స్వంతం. వీలైతే వైరిపక్షాన్ని చీల్చగలడు కూడా. ఇన్ని అనుకూలతలున్న పవార్ భావి ప్రధాని కావడం ఖాయమని అంచనా వేయడంలో పొరపాటు ఉండదు. అయితే ఈ అంచనా పూర్తిగా తప్పని తేలిపోయింది. శరద్ పవార్ తనదైన దూకుడుతో వ్యవహరించకుండా పివి నిశ్శబ్ద వ్యూహాలు రచించారు. మంత్రిమండలిలోకి పవార్ ప్రత్యర్థి శంకర్రావు చవాన్‌ను తీసుకున్నారు. ఆయనకు అతిముఖ్యమైన హోంశాఖను అప్పగించారు. ఇట్లా కేంద్ర రాజకీయాల్లో మహారాష్ట్ర అధికార కేంద్రాలు రెండు (చవాన్, పవార్) అయ్యాయి. ఒక సరియైన సందర్భంలో పవార్‌ను తిరిగి మహారాష్ట్ర (1993) రాజకీయాలకు పరిమితం చేశారు. ఈ యావత్ వ్యూహపర్వం నిశ్శబ్దంగా కొనసాగింది! పార్టీలో తనకు ప్రత్యర్థులుగా నిలిచినవారిని అధికారానికి దూరం చేయడంలో పివి ఈ నిశ్శబ్ద వ్యూహాన్నే అనుసరించారు. నిత్య రాజకీయ కసరత్తులతో తన అధికార పీఠాన్ని నిలబెట్టుకున్నారు పివి. అర్జున్‌సింగ్, ఫోతేదార్, ఎన్డి తివారి, చిదంబరం, రంగరాజన్ కుమార మంగళం, రాజేష్ పైలట్, మాధవరావు సింధియా ఇట్లా స్వపక్షంలోని ఎంతోమంది ఏదో ఒక సందర్భంలో ధిక్కార స్వరాన్ని వినిపించినా వాటిని మౌనంగానే తుత్తునియలు చేశారు పివి.
‘గంగాతీరం స్వతంత్ర భారత రాజకీయాలను శాసిస్తుంది’ - ఇది పివి ప్రధాని అయ్యేవరకు ఉన్న నానుడి. చరిత్రను తరచి చూసినపుడు ఇది నిజమని అర్థమవుతుంది. ప్రథమ ప్రధాని పండిట్ నెహ్రూ తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ ఇద్దరూ గంగాతీరంలో జన్మించిన వారే. పండిట్ నెహ్రూ స్వస్థలం అలహాబాద్ అయితే రాజేన్‌బాబు పాట్నా నగరానికి చెందినవారు. రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిది కూడా అలహాబాద్ నగరమే. ఇది గంగాతీరంలోనిదే. మూడవ ప్రధాని ఇందిరా గాంధీ తండ్రితాతలు అలహాబాదీయులు. మొరార్జీ మాత్రం గుజరాత్ రాష్ట్రంలో జన్మించినవారు. ఆయన తరువాత ప్రధాని అయిన చరణ్‌సింగ్ పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతీయులు. ఇంచుమించు ఇది కూడా గంగాతీరమే. రాజీవ్ గాంధీ కూడా గంగాతీర సమీపంలోనివారే. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్‌లు అలహాబాద్‌లో చదువుకున్నారు. వారూ గంగాతీర నేతలే. ఇట్లా ఉత్తర భారతమే స్వాతంత్ర్యానంతర భారత రాజకీయాలను దాదాపు శాసించింది. ఎక్కువమంది ప్రధానులు అక్కడి వారు కావడం అందుకు దోహదం చేసింది. వాస్తవానికి ప్రాచీన, మధ్యయుగ భారత చరిత్రలోనూ ఉత్తరాది వారిదే అధికారం. సుదూర గతంలో ఏనాడో ప్రాచీన చోళులు, శాతవాహనులు పాటలీపుత్రం దాకా వెళ్లి పరిపాలన చేసినట్టు చెబుతారు. తిరిగి, పదిహేను వందల సంవత్సరాల తరువాత మరొక దక్షిణ భారతీయుడు ఢిల్లీలో అధికారంలోకి వచ్చాడు.
నిజానికి పివి ప్రధాని అయిన తరువాత దేశంలోని సగటు ప్రజానీకం ఆయన పాలన నుండి అద్భుతాలు ఏవీ అంచనా వేయలేదు. ఇందుకు గట్టి కారణాలే ఉన్నాయి. యావద్భారతదేశం ఉత్సాహ రహితంగా ఎంతో స్తబ్దతతో ఉన్న కాలమది. చైతన్యం నిద్రించిన స్థితి అది. అంతకు ఒకటి రెండు మాసాల ముందే గొప్ప భవిష్యత్తు ఉన్న నాయకుడు రాజీవ్‌గాంధీ దారుణ హత్యకు లోనయ్యారు. 1990 చివరలో అయోధ్య వివాదం దేశంలో భారీస్థాయిలో ఉద్రిక్తతలకు దారితీసింది. హైదరాబాద్ వంటి నగరాల్లో రోజులకు రోజులే కర్ఫ్యూను విధించవలసిన పరిస్థితి వచ్చింది. భిన్న మతానుయాయుల నడుమ వైరివైఖరి బలపడింది. మండల్ కమిషన్ సిఫార్సుల అమలు ప్రకటనతో దేశంలోని కొన్ని సామాజిక వర్గాలు అసంతృప్తికి లోనైన కాలం అది. కొందరు యువకులు ఆవేశంతో తమ దేహాలను కాల్చుకున్న భయంకర దృశ్యాలు దేశ రాజధానిలో కనిపించాయి. ఇట్లా సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. వీటికి తోడు కేంద్రంలో రాజకీయ అస్థిరత. విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్ సర్కారు 1990 నవంబర్ తొలివారంలో పతనమైంది. అటు తరువాత అనూహ్యంగా ప్రధాని అయిన చంద్రశేఖర్ కూడా ఆరునెలల లోపే రాజీనామాను సమర్పించారు. వీటికి తోడు 1991 జనవరిలో ప్రారంభమైన గల్ఫ్ యుద్ధం, విదేశీ రుణం చెల్లింపు సమస్య, బంగారాన్ని తాకట్టు పెట్టవలసిన దుస్థితి. ఈ సందిగ్ధ సందర్భంలో ప్రజానీకంలో నిర్లిప్తత గూడుకట్టుకోవడం ఎంతో సహజం. ఇన్ని సమస్యలతో పాటు కశ్మీర్, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదం చెలరేగిపోవడం. మైనారిటీ సర్కారును నడిపే పివి వీటన్నింటినీ పరిష్కరించగలరా? దేశాన్ని వికాస పథంలో నడిపించగలరా? అసాధ్యమే అని చాలా మంది అంచనా.
పివి ప్రధానమంత్రి పదవి చేపట్టిన 1991 నాటికి భారత సమాజం సంప్రదాయ ధోరణుల నుండి ఆధునికత వైపు పయనిస్తున్నది. ఆ సమయంలో జాతి యువతకు అవసరమైన నవ్యత సర్కారు ద్వారా అందగలగాలి. నూతన ప్రసార రంగ అవకాశాలు, కమ్యూనికేషన్ సాధనాలు, నాణ్యమైన వస్తువులు ఇవన్నీ కావాలి. అందుకోసం నిర్బంధాలు లేని వాణిజ్య విధానాలు కావాలి. పివి తన ఆర్థిక విధానాల ద్వారా యువత కోరుకునే ఈ పరిస్థితుల్ని కల్పించారు. విదేశీ వస్తు సామగ్రి అందుబాటులోకి వచ్చింది. క్రమేపీ భారత వస్తువుల నాణ్యత పెరిగింది. అవి మెల్లగా విశ్వవిపణిలో పోటీనీ తట్టుకునే స్థాయికి వచ్చాయి. నిర్బంధ విధానాలే ఉంటే ఇది సాధ్యమయ్యేదా? అనిపిస్తుంది. ‘పేదరికాన్ని ప్రేమించకు’ అన్న సందేశం పివి సర్కారు ఆర్థిక విధానాలలో సుస్పష్టంగా కనబడుతుంది. ఆనాటికి అది ఎంతో అవసరమైంది. దాదాపు వందకోట్ల జనాభా, కావలసినన్ని సహజవనరులు, అపారమైన సాంస్కృతిక వారసత్వం, దృఢతరమైన ప్రజాస్వామ్య వ్యవస్థ, ఇన్ని సుగుణాలతో కూడిన భారత్ ఇంకా పేదరికాన్ని ఎందుకు ఇష్టపడాలి? ఇది పోయేందుకు దేశప్రజల్లో వినూత్న ఆలోచనలు ఎదిగేందుకు ఆర్థిక విధానాలలో మార్పులే శరణ్యమని పివి గుర్తించారు. ఇది నిజమని గత పాతిక సంవత్సరాల అనుభవాలు చెబుతున్నాయి. మార్కెట్ విస్తరించింది. దీనితో ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయి. ప్రైవేట్ రంగం విశ్వరూపాన్ని సంతరించుకున్నది. లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. కొనుగోలు శక్తి అంతకంతకూ ఎదిగింది. సరళీకృత విధానాలతో రుణ సౌకర్యాలు ఎదిగాయి. దిగువ మధ్య తరగతికి సైతం స్వంత ఇల్లు సాధ్యమైంది. స్వంత వాహనాలూ వచ్చాయి. అయితే నూతన ఆర్థిక విధానాల ద్వారా ఎంతోమంది జీవితాలు అంధకారమయమయ్యాయన్న విమర్శలూ ఉన్నాయి. ఏ విధానం అమలు చేసినపుడైనా ప్రయోజనం పొందిన వారితో పాటు ఇబ్బందులు ఎదుర్కొనే వర్గాలూ ఉంటాయి. ఇక్కడా అదే జరిగింది.
డాక్టర్ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి
(బాలశ్రీనివాసమూర్తి రచించిన నరసింహారావు జీవితచరిత్ర
‘విలక్షణ పి.వి.’లోని కొన్ని భాగాలివి. ఇటీవల విడుదలయిన ఈ పుస్తకాన్ని
నీల్ కమల్ పబ్లికేషన్స్ వారు ప్రచురించారు)