లోపలి మనీషి… పీవీ

ABN , First Publish Date - 2022-06-28T14:27:12+05:30 IST

అంతకుముందే పీవీ నరసింహారావుగారు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ అది మా తరం వాళ్ళకు చాలావరకు

లోపలి మనీషి… పీవీ

అంతకుముందే పీవీ నరసింహారావుగారు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ అది మా తరం వాళ్ళకు చాలావరకు ఒక అజ్ఞాతదశ. ఆ తర్వాత కేంద్రంలో మంత్రిగా చూస్తూనే ఉన్నా, 1991లో ప్రధానమంత్రి అయ్యేవరకు ఆయన్ను పెద్దగా పట్టించుకోలేదు. సాహిత్యవేత్త, బహుభాషావేత్త అని మాత్రం తెలుసు. ప్రధానమంత్రి అయిన తర్వాతే ఆయన్ను గమనించడం మొదలుపెట్టాం. మన్మోహన్ సింగ్ ను ఆర్థికమంత్రిగా నియమించి ఆర్థికసరళీకరణవిధానాల్నిఎప్పుడైతే ప్రవేశపెట్టారో, ఇక అప్పుడు ఈయన మామూలువాడు కాదు, ఈయన బాస వేరనుకోవడం ప్రారంభించాం. సాధారణంగా మధ్యతరగతిలో దిగులు, గుబులు పెంచే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. అలాంటి ఒక అరుదైన సందర్భంలో పీవీగారు ప్రధానమంత్రి అయ్యారు.


దేశ ఆర్థికపరిస్థితి అప్పుడు ఆందోళనకరంగా ఉంది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సమస్యలు , ద్రవ్యలోటు, విదేశీమారకం నిల్వల తరిగిపోవడం రూపంలో 1985లోనే మొదలై, 1991 నాటికి విషమించి, దిగుమతులకు చెల్లించడానికి డబ్బు లేకపోవడంతో అంతర్జాతీయంగా భారత్ పరపతి తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో అంతర్జాతీయద్రవ్యనిధివద్ద భారత్ తన బంగారపు నిల్వల్ని తాకట్టు పెట్టాల్సివచ్చింది. ఆర్థికంగా ఎంతోకొంత భద్రస్థితిలో ఉండే మధ్యతరగతిలో ఇవి బతుకుభయాలను రేపే పరిణామాలే. 


సరే, ఆర్థికసంస్కరణలపై అనుకూల, వ్యతిరేక వాదాలు అప్పుడూ ఉన్నాయి, ఆ తర్వాతా ఉన్నాయి. ప్రత్యామ్నాయం కనిపించని స్థితిలో వ్యతిరేకవాదాలు మొదట్లో సన్నసన్నగా వినిపించినా ఆ తర్వాత క్రమంగా శ్రుతి పెంచుకున్నాయి. వాటినలా ఉంచితే, ఉలికిపడి ఒకసారి పీవీగారిని తేరిపార చూడాల్సిన అవసరాన్ని మాత్రం అవి నిస్సందేహంగా కలిగించాయి. ఆ తర్వాత ఆయన అయిదేళ్ళ పాలన, ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని చెప్పుకోదగిన ఒడుదుడుకులూ లేకుండా నడపడం వగైరాలు మరో అధ్యాయం. 


నేనప్పుడు ఆంధ్రప్రభ’ దినపత్రికలో ఉన్నాను. పీవీగారు అప్పటికి మాజీ ప్రధాని అయ్యారు. ఒకరోజున ఆయన ఆత్మకథాత్మక నవల ‘ది ఇన్ సైడర్’ లోంచి కొన్ని కత్తిరింపులను ‘టెలిగ్రాఫ్’ పత్రికలో కాబోలు చూశాను. చదువుతుంటే ఆసక్తి కలిగింది. ‘అరె, ఈ పుస్తకాన్ని తెలుగు చేస్తే బాగుంటుందే’ అనిపించింది. అప్పటికి చాలాకాలంగా ఇంగ్లీష్ వ్యాసాలు తర్జుమా చేయడానికి అలవాటుపడిన చేయి కావడం తప్ప అందుకు మరో కారణం లేదు. ఆ ఊహ ఎలా వచ్చిందో అలాగే పోయింది. ఎందుకంటే, ఆ పుస్తకాన్ని తెలుగులోకి తేవాలని రచయిత కానీ, పబ్లిషర్ కానీ అనుకుంటున్నారో లేదో నాకు తెలియదు. ఒకవేళ అనుకున్నానాలాంటి ఒక అనామకుణ్ణి అనువాదం చేయమని అడిగే అవకాశమే లేదు. ఒకవేళ అడిగినా నాకున్న పనిభారం రీత్యా నేను చేసే అవకాశం అంతకన్నా లేదు. 


కొన్ని రోజులు గడిచాక ఒకరోజున ఉన్నట్టుండి మా సంపాదకులు వి. వాసుదేవదీక్షితులుగారు నా క్యాబిన్ లోకి వచ్చి నా ఎదురుగా కూర్చున్నారు. “పీవీ నరసింహారావుగారి ‘ఇన్ సైడర్’ నవల గురించి విన్నారా?” అని అడిగారు. 


“వినడమే కాదు, అందులోంచి కొన్ని కత్తిరింపులు కూడా చదివాను” అన్నాను. 

“సొంతాలియా(మనోజ్ కుమార్ సొంతాలియా, ఆంధ్రప్రభ-ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు పత్రికల యజమాని) దానిని తెలుగులోకి అనువాదం చేయించి సీరియల్ గా వేస్తే బాగుంటుందంటున్నారు. పై స్థాయిలో మాటలు జరుగుతున్నాయి” అన్నారు. 


“అలాగా...బాగానే ఉంటుంది” అని నసిగాను. అనువాదం పని నా మీద పడుతుందేమోనని అప్పటికప్పుడు నా మనసు శంకించింది. 

“నిర్ణయం జరిగిపోయినట్టే. వెంటనే మనం మొదలు పెట్టాలి” అని దీక్షితులుగారు అన్నారు. 

“ఎవరిచేత అనువాదం చేయిద్దాం?” అని నేను అడిగాను. 

“ఎవరో కాదు, మీరే చేయాలి” అని ఆయన అన్నారు. 

నా గుండెల్లో నిశ్శబ్దంగా రాయి జారినట్లయింది. ఇప్పటికే ఉన్న పనిభారానికి తోడు అన్ని పేజీల పుస్తకం అనువాద బాధ్యతను నేను పెట్టుకోవడమా!? 

అదే మాట ఆయనతో అన్నాను. 

“తప్పదు బ్రదర్. మీరే చేయాలి. మీ పనిభారాన్ని నేను కొంత తీసుకుంటాను. మీరు ఇవాళనుంచే అనువాదం మీద ఉండండి” అని ఆయన అన్నారు. 

కొంత ధైర్యం కలిగి సరే నన్నాను. ఆరోజు సాయంత్రానికల్లా ‘ది ఇన్ సైడర్’ నా చేతికి అందింది. 


పూర్తి నిర్ణయం జరిగేలోపలే ఎందుకైనా మంచిదని అనువాదం ప్రారంభించి 14 అధ్యాయాలు పూర్తి చేశాను. నా కంగారు నాది. తీరా ధారావాహిక ప్రచురణ మొదలుపెట్టాక ఏ రోజూకారోజు మ్యాటర్ ఇవ్వడమంటే ఎంత ఒత్తిడి పడాల్సివస్తుంది! 

ఒకవేళ ఏ కారణం వల్లనైనా ఇవ్వలేకపోతే?! 


ప్రొటోకాల్ పట్టింపుల్లేవు

దీక్షితులుగారు చెప్పారు...ఎవరు అనువాదం చేస్తున్నారని పీవీగారు అడిగారట! నా పేరు చెప్పారట! (నేను ఆయనకు తెలిసే అవకాశమే లేదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు) అయితే మొదట రెండు అధ్యాయాలు అనువదించి పంపించమన్నారట! రెండేం ఖర్మ, పద్నాలుగు సిద్ధంగా ఉన్నాయనుకుని మొదటి రెండు అధ్యాయాలూ కంపోజ్ చేయించి కంటైనర్ సర్వీస్ ద్వారా మా ఢిల్లీ కార్యాలయానికి పంపించాం. 1998-99నాటికి కంప్యూటర్ ద్వారా నేరుగా తెలుగు టెక్స్ట్ పంపించే సదుపాయం రాలేదు. ఢిల్లీలో ఆంధ్రప్రభ ప్రతినిధిగా ఉన్న మిత్రులు సి. హెచ్. వి. ఎం. కృష్ణారావు దానిని పీవీగారికి అందించే ఏర్పాటు చేశారు. అప్పటినుంచి దాదాపు చివరివరకు ఆయనకు అదో అదనపు బాధ్యత అయింది. 


రెండు అధ్యాయాలూ పంపిన తర్వాత ఏ నిర్ణయం జరిగినా అది ఆంధ్రప్రభ సంపాదకులు, పీవీగారితో టచ్ లో ఉన్న ఇండియన్ ఎక్స్ ప్రెస్ రెసిడెంట్ ఎడిటర్ పి. ఎస్. సుందరం, పీవీగార్ల స్థాయిలో జరుగుతుంది తప్ప న్యూస్ ఎడిటర్ ర్యాంక్ లో ఉన్న నాకు అందులో ఎలాంటి పాత్రా ఉండదనుకుని నేను నిశ్చింతగా నా పని చేసుకుంటూ పోయాను. అలాంటిది ఒకరోజున ఢిల్లీ నుంచి నాకు ఒక పెద్దసైజు కంటైనర్ కవర్ అందింది. దాని మీద పైన నా పేరు, కింద ఫ్రమ్ అడ్రస్ దగ్గర పీవీగారి పేరు ఉన్నాయి. ఆశ్చర్యంతో నేను తెరిచి చూసేసరికి లోపల మేము పంపిన రెండు అధ్యాయాలూ, వాటికి జతపరచి ఇంగ్లీష్ లో రాసిన ఒక లేఖ ఉన్నాయి. ఆ లేఖ నేరుగా నన్నే అడ్రస్ చేసింది. మొత్తం మీద అనువాదం బాగుందనీ, అవసరమైతే తన తోడ్పాటు ఉంటుందనీ, అనువాదాన్ని కొనసాగించమనీ దాని సారాంశం. ఇంకో ఆశ్చర్యం ఏమిటంటే, ఆ రెండు అధ్యాయాలలో అక్కడక్కడ అక్షరదోషాలను సరిచేసి అక్షరాలా ఆయన ప్రూఫ్ రీడర్ పాత్ర కూడా నిర్వహించారు. 

అప్పుడే ఆయన వ్యక్తిత్వంలోని ఒక కోణం నాకు అర్థమైంది. ఆయనకు ప్రొటోకాల్ పట్టింపుల్లాంటివి ఏవీ ఉండవు. క్షేత్రస్థాయిలో పని చేసేవాడితో నేరుగా సంభాషించడానికి, వ్యవహరించడానికి ఆయనకు ఎలాంటి అభ్యంతరమూ లేదు! 


అలా ఉండగా ఒకరోజున ద్రోణంరాజు సత్యనారాయణగారు మా ఆఫీసుకు వచ్చారు. పీవీగారు హైదరాబాద్ వచ్చి రాజ్ భవన్ పక్కన ఉన్న గెస్ట్ హౌస్ లో ఉన్నారు. సంపాదకుల్ని, నన్ను తీసుకురమ్మని పంపించారట. కారులో కూర్చున్న తర్వాత, “నువ్వు అదృష్టవంతుడివయ్యా, ఇన్ సైడర్ అనువాదం చేసే అవకాశం నీకు వచ్చింది” అని ద్రోణంరాజుగారు అంటూ ఒక ముచ్చటకు శ్రుతి చేశారు. పీవీగారితో బాగా పరిచయం ఉన్న ఒక పెద్దాయన, ఇన్ సైడర్ ను తెలుగులోకి తేబోతున్నట్టు తెలిసి, రచయితలుగా అప్పటికే బాగా ప్రసిద్ధులైన ఒకరిద్దరి పేర్లు చెప్పి వాళ్ళలో ఒకరికి అప్పగిద్దామన్నారట. అప్పుడు పీవీగారు, “ఆ అవసరం లేదు. అతని అనువాదం నాకు నచ్చింది, అతనే చేస్తా”డని నిక్కచ్చిగా చెప్పారట. ఆయన వ్యక్తిత్వంలో నాకు ఇంతకుముందు అర్థమైన కోణానికి ఈ ముచ్చట మరింత బలం కలిగించింది.


అక్కడా వన్ టు వన్నే

రాజ్ భవన్ పక్కనున్న గెస్ట్ హౌస్ కు చేరుకున్నాం. ఒక మాజీ ప్రధానిని కలుసుకోబోతున్నందుకు సహజంగానే ఉండే ఒక బెరుకు. మేము వెళ్ళేటప్పటికే అక్కడ రాష్ట్రానికి చెందిన కొంతమంది పెద్ద, చిన్న కాంగ్రెస్ నాయకులున్నారు. మేము వచ్చినట్టు తెలియగానే, మా కోసమే ఎదురుచూస్తున్నట్టు పీవీగారు హాల్లోకి వచ్చారు. పలకరింపులు అయిన తర్వాత ఆయన నేరుగా విషయంలోకి వస్తూ, “ఇక నన్నూ, భాస్కరంగారిని వదిలేయండి. మేమిద్దరం అనువాదం గురించి మాట్లాడుకుంటాం” అంటూ నన్ను దగ్గరికి పిలిచి నాతో మాట్లాడడం ప్రారంభించారు. అనువాదం గురించి తన అభిప్రాయాలను, విశ్వనాథ సత్యనారాయణగారి ‘వేయిపడగలు’ అనువాదకుడిగా తన అనుభవాలను చెప్పుకుంటూ వచ్చారు. హిందీ అనువాదం ప్రచురణకర్త ‘వేయిపడగలు’ పుస్తకం మరీ పెద్దదిగా ఉంది, తగ్గించాలని అన్నాడట. తను సత్యనారాయణగారితో అంటే ఆయన ససేమిరా తగ్గించడానికి వీల్లేదు అన్నారట. తను ఎలాగో ఒప్పించారట. 

ఆపాటికి ఆయనలో ఒక మాజీ ప్రధానికి బదులు, రకరకాల చాదస్తాలతో సహా ఒక రచయిత మాత్రమే కనిపించి నాలో కూడా బెరుకు పోయి మాట కలపడం ప్రారంభించాను. పదిమంది మధ్యలో ఆ వన్ టు వన్ సంభాషణ సాగుతుండగానే, అప్పటికి హిమాచల్ ప్రదేశ్ కు కాబోలు, గవర్నర్ గా ఉన్న వి.ఎస్. రమాదేవిగారు వచ్చారు. వస్తూనే, “ఏమిటి అలా అయిపోయారు, సుగర్ ఎలా ఉంది, ఎక్సర్ సైజులు చేస్తున్నారా లేదా” అంటూ ప్రశ్నమీద ప్రశ్న గుప్పిస్తూ పోతే పీవీగారి ముఖంలో ఇబ్బంది కొట్టొచ్చినట్టు కనిపించింది. పీవీగారి ఆరోగ్యం గురించే కాక, తన వియ్యంకుడి ఆరోగ్యం గురించి కూడా ఆమె గలగలా మాట్లాడుతుంటే పీవీగారు “ఆ...ఊ...ఉహు...”అంటూ ఉండిపోయారు. 


ఆ క్షణంలో- ఇన్ సైడర్ అనువాదం గురించి, లేదా సాహిత్యం గురించి తప్ప ఇంక ఏ విషయం మీదా మాట్లాడే ఆసక్తి ఆయనకు లేదని నాకు అర్థమైంది. ఆ తర్వాత ఆయనను అనేకసార్లు కలసుకున్నప్పుడు కూడా తన శేషజీవితంలో సాహిత్యాన్ని, తన రచనలను పట్టించుకున్నంతగా మరి దేనినీ పట్టించుకోదలచుకోలేదని కూడా నాకు అనిపిస్తూవచ్చింది . 

త్వరలోనే ‘లోపలి మనిషి’ సీరియల్ ప్రచురణ ప్రారంభమైంది. కొంతమంది పీవీగారే స్వయంగా తెలుగులో రాస్తున్నారనుకున్నారు. అలా అనుకోవాలనే కాబోలు, అనువాదకుడిగా నా పేరు వేయలేదు. కొంతమంది మాత్రం అనువాదకుడి పేరు వేయండని ఉత్తరాలు రాశారు. చివరికి ఆ ధారావాహిక ముగిసే సమయానికి ఆంధ్రప్రభ సంపాదకులుగా ఉన్న జి. శ్రీరామమూర్తిగారు ముగింపు భాగంలో అనువాదకుడిగా నా పేరు వేశారు. 

ఆలోచన...ఆలోచన...ఆలోచన... 

ఇంకోసారి ఆయనను కలసుకోడానికి రాజ్ భవన్ గెస్ట్ హౌస్ కు వెళ్లినప్పుడు అప్పుడే ఆయన బయటినుంచి లోపలికి వెడుతూ కనిపించారు. నమస్కారం చేసి ఆయనతోపాటు అడుగులు వేస్తూ ఉంటే, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడుగారి ప్రస్తావన తెచ్చి, “’గాందోళి గాడల్లే అతగాడు ఏవేవో చేస్తున్నాడనుకుంటున్నారేమో, అతనికి కొన్ని ఐడియాస్ ఉన్నాయి” అన్నారు. కాసేపు మౌనంగా ఉండి, “గ్రౌండ్ రియాలిటీస్ తో వాటిని ఎలా సమన్వయం చేస్తాడన్నదే నాకు అర్థం కావడంలేదు” అన్నారు. ఆ ప్రస్తావన అక్కడితో ఆపేసి, అనువాదం గురించిన విషయాలు, ఇతర విషయాల్లోకి వెళ్లారు. కాసేపటి తర్వాత నేను సెలవు తీసుకుని వచ్చేశాను. 


మరో ఇరవై రోజుల తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు కబురు చేశారు, వెళ్ళాను. నన్ను చూస్తూనే మళ్ళీ చంద్రబాబునాయుడిగారి ప్రస్తావన తెచ్చి, “చంద్రబాబునాయుడికి ఫోన్ చేశాను. నీ ఐడియాస్ బాగున్నాయి కానీ గ్రౌండ్ రియాలిటీస్ తో ఎలా ముడిపెడతావో తెలియడం లేదన్నాను. నాకు కొన్ని సందేహాలున్నాయి, మీ ఆఫీసర్లను ఎవరినైనా పంపమని అడిగాను. ఇంతవరకు పంపలేదు” అంటూ నిట్టూర్చారు. నేను ఆశ్చర్యం పట్టలేకపోయాను. ఆయన మెదడు పనిచేసే తీరు నాకు అర్థమైంది. అది కంప్యూటర్ కన్నా ఏమాత్రం తక్కువది కాదు. ఆ ఇరవై రోజుల్లో ఆయనను చాలామందే కలిసి ఉంటారు.


అలాంటిది నన్ను చూడగానే ఇరవై రోజుల వెనకటి సంభాషణ ఆయన కంప్యూటర్ మెదడులో క్లిక్కు మన్నదన్నమాట. అంతేకాదు, సరిగ్గా అప్పుడు ఆగిపోయిన చోటునుంచే ఆయన సంభాషణను తిరిగి ఎత్తుకున్నారు. తన మెదడులోని ఒక అరలో చంద్రబాబుగారి ఐడియాల గురించిన ఆలోచన ఉంచుకుని సీరియల్ పద్ధతిలో దాని గురించి ఆలోచన చేస్తునే ఉన్నారని, అనేక విషయాల్లో ఇలా ఆయనలో ఆలోచనాచక్రం తిరుగుతూనే ఉంటుందని అర్థమైంది. 

ఇది ఇక్కడితో అవలేదు. ఈసారి నెల రోజుల తర్వాత ఆయనను కలసుకునే అవకాశం కలిగింది. నేను వెళ్ళేటప్పటికి ‘హిందుస్తాన్ టైమ్స్’ రిపోర్టర్ ఒకాయన ఆయనను ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఇప్పుడు పేరు గుర్తులేదు కానీ, ఒక కాంగ్రెస్ నాయకుడు ఆ ఇంటర్వ్యూకి పీవీగారిని ఒప్పించినట్టున్నాడు, ఆయనా; ఇంకా మరికొందరు సందర్శకులు అక్కడ ఉన్నారు. ఆ కాంగ్రెస్ నాయకుడికీ, యాంత్రికంగా ప్రశ్న మీద ప్రశ్న సంధిస్తున్న రిపోర్టర్ కూ ముచ్చెమటలు పోస్తున్నాయి.


పీవీగారు ప్రతి ఒక్క ప్రశ్న బాణాన్నీ రెండుచేతులతో అందుకుని దాని పదునైన భాగాన్ని విరిచేసి తిరిగి రిపోర్టర్ మీదే ప్రయోగిస్తున్నారు. ‘సోనియాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పనితీరు మీద మీ అభిప్రాయం ఏమిటి?” అన్న ప్రశ్నకు, “నా అభిప్రాయం ఏమైనా ఉంటే మీ కెందుకు చెబుతాను, పార్టీ వేదిక మీదే చెబుతా” నని ఆయన సమాధానం. “మీకూ, సోనియాగాంధీకి మధ్య మనస్పర్థల గురించి వస్తున్న వార్తలకు మీరు ఎలా స్పందిస్తారు?” అన్న ప్రశ్నకు “నేను కాంగ్రెస్ లో సుశిక్షితుడైన కార్యకర్తను. సోనియాగాంధీ మా నాయకురాలు. ఇంతకన్నా నేను స్పందించేదేమీ లేదు” అని ఆయన జవాబు. 


అంతలో, రాంగ్ టైమ్ లో వచ్చినట్టున్నాననుకుని కాస్త ఇబ్బందిగా మొహం పెట్టిన నావైపు పీవీగారు చూసి, పలకరించి కూర్చోమని చెప్పారు. కొద్దిపాటి సంచలనమైనా కలిగించే శీర్షిక గానీ, లీడ్ పేరా కానీ అందించకుండానే ఆ ఇంటర్వ్యూను పీవీగారు ముగించారు. నిరాశతో రిపోర్టరూ, కాంగ్రెస్ నాయకుడూ నిష్క్రమించారు. 


పీవీగారు లోపలికి వెడుతూ నన్ను కూడా రమ్మన్నారు. అంతవరకూ పత్రికల యాజమానుల మీద ఉగ్గబట్టుకున్న కోపాన్ని నా ముందు కుమ్మరించారు. “వీళ్ళ గురించి నాకు తెలియదా?! వంగమంటే పాకే రకం(They were asked to bend, but they began to crawl) అన్నారు. ఆ తర్వాత క్షణకాలం మౌనంగా ఉండిపోయి, “తెలుగు పత్రికలు కూడా నన్ను కరప్టు అన్నాయి” అన్నారు. ఆ మాట అనడంలో కోపం కన్నా ఆయనలో బరువు, బాధ, ఆవేదన వ్యక్తమయ్యాయి. 


అంతలోనే మామూలు స్థితికి వచ్చేసి, మళ్ళీ చంద్రబాబునాయుడిగారి విషయం ఎత్తుకున్నారు. “ఎట్టకేలకు చంద్రబాబునాయుడు ఇద్దరు ఆఫీసర్లను నా దగ్గరికి పంపించాడు. వాళ్ళను కొన్ని ప్రశ్నలు వేశాను. వాళ్ళు తెల్లమొహం వేశారు. స్టడీ చేసి మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళిపోయారు. ఇంతవరకు మళ్ళీ రాలేదు” అన్నారు. కాసేపు విరామం తర్వాత, “నా దగ్గర కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. కానీ నన్ను అడిగేవాడెవడు?” అన్నారు విరక్తిగా. 

ఆయనలో చంద్రబాబు నాయుడి ఐడియాల గురించిన ఆలోచనల చక్రం అలా ఎన్ని చుట్లు తిరిగి, చివరికి ఎక్కడ ఆగిందో నాకు గుర్తులేదు. 


ఇలా చెప్పుకుంటూ వెడితే అదో చిన్న పుస్తకం అవుతుంది. ఎవరి రాజకీయజీవితమైనా వెలుగు, చీకట్ల మిశ్రమంగానే ఉంటుంది. పీవీగారు ఇందుకు మినహాయింపు కావాలనుకోవడం అత్యాశ. కాలం కరుకైనది. ఆయన హోమ్ మంత్రిగా ఉన్నప్పుడు వందలమందిని బలిగొన్న భోపాల్ విషవాయుదుర్ఘటన దరిమిలా దేశంనుంచి యూనియన్ కార్బైడ్ అధినేత వారెన్ యాండర్సన్ పలాయనం చిత్తగించడం; వేల సంఖ్యలో సిక్కుల ఊచకోత; ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బాబ్రీమసీదు కూల్చివేత వంటి ఘటనలలో ఆయన వైఫల్యాలు, లోపాలోపాలపై కాలం తప్పకుండా తీర్పు చెబుతుంది. ఆయనతో నాకు కలిగిన స్వల్పపరిచయంలో ఆయనలో ఒక రాజకీయనాయకునే కాక; నేను తేలిగ్గా కనెక్టు కాగలిగిన ఒక సాహిత్యవేత్తను, ఒక రచయితను కూడా చూశాను. మామూలుగా చూడడం కాదు; కవి, రచయితలు అందరిలోనూ ఉండే చాదస్తాలతో సహా చూశాను. 

అధికారంలో ఉన్నప్పుడు తనముందు తన వెనుక తనకు ఇరువైపులా అసంఖ్యాక జనం వేల్లాడుతున్నా అంతమంది మధ్యా మౌనముద్రాంకితులుగా పేరుపడిన పీవీ, అధికారాంతజీవితంలో తన చుట్టూ మనుషులు పలచబడిన స్థితిలో మాట్లాడాలని తపించడమూ చూశాను. 

(పీవీ జయంతి సందర్భంగా)

కల్లూరి భాస్కరం 

(రచయిత, విమర్శకులు, సీనియర్ పాత్రికేయులు) 

9703445985


Updated Date - 2022-06-28T14:27:12+05:30 IST