సింధు మణికట్టు మాయ జరిగేనా..?

ABN , First Publish Date - 2021-07-30T17:39:42+05:30 IST

పీవీ సింధు యావత్ భారత దేశానికి సుపరిచితమైన పేరు. రియో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో...

సింధు మణికట్టు మాయ జరిగేనా..?

టోక్యో: పీవీ సింధు యావత్ భారత దేశానికి సుపరిచితమైన పేరు. రియో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో రజితం సాధించిన తొలి తెలుగు మహిళగా రికార్డు సృష్టించింది. పెద్ద తెర ఏర్పాటు చేసుకుని రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్ చాలా మంది చూశారు. అలాంటి ఉత్కంఠభరిత సన్నివేశం మళ్లీ చూడబోతున్నామా? ఏమో మళ్లీ మణికట్టు మాయ జరిగితే చూడొచ్చేమో..!


టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు జోరు కొనసాగిస్తోంది. డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్ట్‌ను 21-15, 21-13 తేడాతో ఓడించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ధాటిగా ఆడిన సింధు ఈ మ్యాచ్‌ను 41 నిమిషాల్లోనే ముగించింది. తొలి గేమ్‌లో కాస్త తడబడి ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇచ్చింది. కానీ లోపాలను సరిదిద్దుకుంటూ రెండో గేమ్‌ ఆరంభంలోనే 5-0తో దూసుకెళ్లింది. అదే జోరును కొనసాగిస్తూ మ్యాచ్‌ను ముగించింది. వరుస విజయాలతో దూసుకువెళుతున్న సింధు  భారత్‌కు మరో పతకాన్ని అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.


ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో హైవోల్టేజ్‌ పోరుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం జరిగే మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ఐదో ర్యాంకర్‌ అకానె యమగూచి (జపాన్‌)తో 7వ ర్యాంకర్‌ పీవీ సింధు తలపడనుంది. గతంలో వీరిద్దరూ 18 సార్లు పోటీపడగా 11-7తో సింధుదే పైచేయి. సింధు, అకానెలిద్దరూ కసిగా తలపడేవారు కావడంతో.. నరాలు తెగే ఉత్కంఠ నెలకొనడం ఖాయం. కోర్టులో వేగంగా కదలడం యమగూచి ప్లస్‌ పాయింట్‌. కానీ, వెన్ను గాయం తర్వాత మునుపటి వేగం తన ఆటలో లోపించిందని స్వయంగా ఆమే చెబుతోంది. మరోవైపు పొడగరి అయిన సింధు.. కచ్చితమైన క్రాస్‌ కోర్టు షాట్‌లు, అటాకింగ్‌ గేమ్‌తో ప్రత్యర్థులపై ఆధిపత్యాన్ని చెలా యిస్తుంటుంది. కానీ, డిఫెన్స్‌లో భారత షట్లర్‌ బలహీనత బహిర్గతమవుతుంది. అయితే, తీవ్ర సాధన, సరికొత్త టెక్నిక్‌లతో లోపాలను సరిదిద్దుకున్నానని చెబుతున్న సింధు.. విజయంపై ధీమా గా ఉంది. ఏదిఏమైనా ఈ మ్యాచ్‌ ఫ్యాన్స్‌కు మంచి మజాను పంచే అవకాశముంది.

Updated Date - 2021-07-30T17:39:42+05:30 IST