
భారత మువ్వన్నెల జెండాను ప్రపంచ వేదికలపై రెపరెపలాడించిన ఘనత పీవీ.సింధుది. ప్రపంచ స్థాయి టోర్నమెంట్లట్లో ఎన్నో పతకాలు గెలుచుకుని ఇండియాకు గర్వకారణంగా నిలిచింది. ఈ ఏడాది జరిగిన ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకుంది. కొన్ని రోజుల క్రితం దీపికా పదుకొణెతో కలిసి ఆమె బ్యాడ్మింటన్ ఆడింది. ఆ ఫొటోలను దీపికా ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. హార్పర్ బజార్ ఇండియా మ్యాగజైన్‌కు తాజాగా పీవీ. సింధు ఫోజులు ఇచ్చింది. ఆ ఫొటోషూట్ సందర్భంగా దీపికా, రణ్‌వీర్‌సింగ్ గురించి అడిగిన ప్రశ్నలకు ఆమె ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది.
‘‘ మా ఇద్దరికి బ్యాడ్మింటన్ అంటే ఇష్టం. మా మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీపికా బ్యాడ్మింటన్ చాలా బాగా ఆడుతుంది. బ్యాడ్మింటన్ అనేది ఆమెకు పుట్టుకతోనే అలవడింది. ఆమె తండ్రి ప్రకాశ్ పదుకొణె ఒక లెజెండ్ ’’ అని పీవీ.సింధు తెలపింది. దీపికా పదుకొణె తండ్రి ప్రకాశ్ పదుకొణె జాతీయస్థాయిలో బ్యాడ్మింటన్ ఆడారు. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ గెలిచిన తొలి భారతీయుడాయన. పీవీ. సింధు, దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ కలిసి సెప్టెంబరులో డిన్నర్‌కు వెళ్లారు. ఆ డిన్నర్‌ను గుర్తు చేసుకుంటూ.. ‘‘ వీరితో కలిసి సమయాన్ని గడపడం అద్భుతంగా ఉంటుంది. వారిద్దరూ చాలా మంచివారు ’’ అని తెలిపింది.