Advertisement

ఐటీకి బాటలు వేసిన పీవీ

Oct 22 2020 @ 00:21AM

ఐటీ రంగం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న సమయంలోనే,అది ఎలాంటి రూపు సంతరించుకుంటుందో పీవీకి స్పష్టత ఉంది. ఒకసారి ఆయన మాట్లాడుతూ ‘రేడియో, టీవీ, కంప్యూటర్, టెలీకమ్యూనికేషన్ కంటే ఐటీ విస్తృతమైంది. రేడియో, టీవీ, కంప్యూటర్, టెలిఫోన్ వేర్వేరు సాధనాలుగా కాకుండా ఒకే పరికరం రూపంలో అందుబాటులోకి వస్తాయి’ అన్నారు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీ చూస్తుంటే, పీవీ అలనాడు చెప్పిన మాట నిజమైందని అనిపిస్తోంది. టెక్నాలజీ రంగంలో రాబోయే అద్భుత మార్పులపై లోతయిన అవగాహన కలిగి ఉండేవారు ఆయన.


ఐటీరంగంలో భారత్ అగ్ర దేశాలతోనూ పోటీ పడుతూ దూసుకుపోతోంది. దేశ అవసరాలు తీర్చుకోవడంతో పాటు ఇతర దేశాలకు ఐటీ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయిలో ఈ రంగం అభివృద్ధి చెందింది. 1990లు భారత్‌లో ఐటీ రంగం పునాదులు వేసుకుంటున్న కాలం. 1991లో పీవీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సరళీకృత ఆర్థిక విధానాల్ని ప్రవేశపెట్టారు. సంస్కరణలు అన్ని రంగాల సమ్మిళిత అభివృద్ధికి దోహదపడాలని భావించారు. సమాచార సాంకేతిక రంగంలో భారత్ పురోగమించాలని ప్రణాళికలు వేశారు. ఆ రోజుల్లో పీవీ వివిధ సందర్భాల్లో చెప్పిన విషయాలు, పంచుకున్న అంశాలు వాస్తవ రూపం దాల్చాయి. ఈనాడు మనం ఉపయోగిస్తున్న పరిజ్ఞానంపై ఆనాడే స్పష్టత కలిగిన దార్శనికుడు పీవీ. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌’ కు బాటలు వేసిన ఘనత పీవీకే దక్కుతుంది.


దేశాల శక్తి సామర్థ్యాలను అంచనా వేసే కీలక ప్రామాణిక అంశంగా ఐటీ నిలుస్తోంది. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తరుణంలో ఎటు వెళ్లాలి, ఎలా వెళ్లాలన్నది తేల్చుకోవలసిన కూడలిలో దేశం నిల్చుంది. సంస్కరణల వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితుల్ని అవకాశాలుగా మలచుకునే తీరును బట్టి ఫలితాలుంటాయని పీవీ విశ్వసించారు. భారత పారిశ్రామిక సేవా రంగం కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో నెమ్మదిగా ఉండేది. నూతన నైపుణ్యాల్ని నేర్చుకుంటేనే పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోగలమని ఐటీ రంగ ప్రముఖులకు, నిపుణులకు పీవీ దిశానిర్దేశం చేస్తుండేవారు. విదేశీ సంస్థల పెట్టుబడులకు ఆటంకాలు తొలగినందున వ్యాపార సరళిలోనూ మార్పులు చోటు చేసుకోవాలని, ఇందుకు ఐటీ దోహదపడాలని చెప్పేవారు. 


సరళీకృత విధానాలకు తగినట్టు ప్రభుత్వం పని తీరు మార్చుకోవాల్సిన సందర్భమది. విదేశీ పెట్టుబడిదారులు భారత్ వైపు తిరిగి చూసేలా ఆర్థిక విధానముంది. కానీ పరిశ్రమల స్థాపన కోసం వచ్చే వారికి అనుమతులు వేగంగా ఇవ్వాల్సి ఉంటుంది. పారిశ్రామిక ప్రగతి సాధించే క్రమంలో అనుమతుల ప్రక్రియ సులభతరం చేయాలి. దస్త్రాలు సమర్పించడం, అనుమతుల స్వీకరణ ప్రక్రియలో సరళత్వం ఐటీతోనే సాధ్యమవుతుంది. అందుకే ‘‘పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వాళ్లు ఒక ఫారం సమర్పిస్తే... అన్ని అనుమతులు జారీ చేసే విధానం రావాలి’’ అని పీవీ గారు దిశానిర్దేశం చేసేవారు. ఇప్పుడు ప్రభుత్వాలు చెబుతున్న సింగిల్ విండో సిస్టమ్‌కు పీవీ ఆనాడు వేసిన మార్గమే దోహదపడుతోంది. ఉద్యోగాల్లో చేరేవాళ్లు రానున్న 25 ఏళ్లకు అవసరమయ్యే కొత్త విధానాల్ని అలవర్చుకునేందుకు సంసిద్ధంగా ఉండాలని చెప్పేవారు పీవీ. ‘‘ఏదైనా మార్పు సంభవించినప్పుడు, ఆ మార్పునకు బాధితులుగానో, బానిసలుగానో మారిపోకూడదు. మార్పును సరైన దిశలో ఉపయోగించుకోవాలి’’ అంటూ ఐటీని అడాప్ట్ చేసుకోవాలని చెప్పేవారు. 

ఐటీ రంగం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న సమయంలోనే, అది ఎలాంటి రూపు సంతరించుకుంటుందో పీవీకి స్పష్టత ఉంది. ఒకసారి ఆయన మాట్లాడుతూ ‘‘రేడియో, టీవీ, కంప్యూటర్, టెలీ కమ్యూనికేషన్ కంటే ఐటీ విస్తృతమైంది. రేడియో, టీవీ, కంప్యూటర్, టెలిఫోన్ వేర్వేరు సాధనాలుగా కాకుండా ఒకే పరికరం రూపంలో అందుబాటులోకి వస్తాయి’’ అన్నారు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీ చూస్తుంటే, పీవీ అలనాడు చెప్పిన మాట నిజమైందని అనిపిస్తోంది. టెక్నాలజీ రంగంలో రాబోయే అద్భుత మార్పులపై లోతయిన అవగాహన కలిగి ఉండేవారు ఆయన. డిజిటల్ టెక్నాలజీలో పెను మార్పులతో సంప్రదాయ మీడియా ఎన్నో రెట్లు అభివృద్ధి చెందుతుందని తెలిపారు.


ఆధునిక కంప్యూటర్లు, మల్టీ మీడియా టెక్నాలజీ వినియోగానికి సంసిద్ధంగా ఉండాలని చెప్పేవారు. ‘‘కంప్యూటర్ల వినియోగంతో సమాచారం వెల్లువలా వచ్చి పడుతుంది. ఏ సమాచారం తీసుకోవాలి, ఏది విస్మరించాలో అంతుపట్టనంత డాటా అందుబాటులో ఉంటుంది’’ అని చెప్పేవారు. ‘టెక్నాలజీ నుంచి ఎవరూ తప్పించుకోవడం కుదరదు. ఏది అవసరమో, ఏది కాదో గుర్తించే క్రమంలో సంకట స్థితి ఎదురు కాకుండా ఉండాలంటే టెక్నాలజీలో సుశిక్షితులు కావాల్సిందే’ అని చెప్పేవారు. నేర్చుకునే క్రమంలో కొన్ని పొరపాట్లు కూడా దొర్లుతుంటాయి. కానీ తదేకదృష్టి పెడితే అద్భుత ఫలితాలు సాధించవచ్చంటూ స్వయంగా కంప్యూటర్‌లో సుశిక్షితుడైన పీవీ వివరించేవారు. 


విదేశాల్లో అందుబాటులోకి వచ్చిన సాంకేతికత భారత్‌లోకి ప్రవేశించాలంటే 1970లలో పదేళ్లు పట్టేది. కానీ పీవీ ప్రధానిగా అనేక ప్రోత్సాహకాలు అందించి, ఏదైనా పరిజ్ఞానం విదేశాల్లో అందుబాటులోకి రాగానే నెలలు, రోజుల వ్యవధిలోనే భారత్‌లోకి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. భారత హార్డ్‌వేర్ ఇంజినీర్ల డిజైన్ సామర్థ్యం ప్రపంచంలోని చాలా దేశాల ఇంజినీర్ల కంటే పురోగతిలో ఉండేది. భారత ఉత్పత్తులు తమ ప్రత్యేకతను చాటుతుండేవి. కంప్యూటర్ తయారీ రంగంలో చాలా మంది స్వతంత్ర ప్రయోగాలు, ప్రయత్నాలు సాగించేందుకు పీవీ ప్రోత్సహించారు. అంతర్గత పోటీ వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని విశ్వసించారు. ‘కంప్యూటర్ల తయారీతో పాటు సాఫ్ట్‌వేర్ తయారీ సామర్థ్యం సొంతం చేసుకుంటే భారత్ ఎగుమతులు చేసే స్థాయికి ఎదుగుతుంది. ఈ దిశగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో కృషి జరగాల్సిన అవసరముంది’’ అని చెప్పేవారు పీవీ. 


ఐటీ అభివృద్ధి దిశగా దేశం అడుగులు వేస్తున్న తొలినాళ్లలో 1993 సెప్టెంబర్ 16న ఢిల్లీలో ఏర్పాటు చేసిన ‘ఐటీ ఆసియా ఎగ్జిబిషన్‌’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పీవీ ప్రసంగించారు. ‘‘ఐటీ రంగానికి కావాల్సిన విధాన రూపకల్పనలో, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది. దేశంలో ఐటీ అభివృద్ధి లక్ష్యంగా రెండేళ్లుగా పలు రకాల ప్రోత్సాహకాలు అందించాం. మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. హైస్పీడ్ ఇంటర్నేషనల్ డాటా లింక్స్ సదుపాయం దిశగానూ కృషి జరుగుతోంది. గతంలో ఈ సదుపాయం లేకపోవడం ఐటీ రంగానికి ఆటంకంగా నిలిచింది. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, టెలీ కమ్యూనికేషన్ అనుసంధానంతో యూజర్‌కు మెరుగైన సేవలు అందించిన రోజు ఐటీ రంగంలో భారత్ అగ్రగామిగా నిలుస్తుంది. ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించిన పరికరాలను చూస్తుంటే ఆ రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది’’ అని విశ్వాసం వ్యక్తం చేశారు పీవీ. ఐటీ అభివృద్ధికి ఆయన రచించిన ప్రణాళికలు, ఊహించిన టెక్నాలజీ, ఆశించిన ఫలితాలు నేడు అనుభవంలోకి వచ్చాయి. 


పి.వి. ప్రభాకర రావు

(వ్యాసకర్త పీవీ నరసింహారావు తనయుడు)

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.