Advertisement

రూ.కోట్లు మింగిన కొండచిలువలు

Feb 25 2021 @ 23:51PM
ఓంశాంతినగర్‌లో భూగర్భ డ్రైనేజీ కోసం తవ్వి మట్టితో మాత్రమే పూడ్చడంతో సిమెంటు రోడ్డు దుస్థితి

బుగ్గవంక సుందరీకరణ.. భూగర్భ డ్రైనేజీ కడపవాసుల స్వప్నం

ఇప్పటికే కోట్లు ఖర్చు.. ఏళ్లు గడుస్తున్నా అసంపూర్తిగా పనులు

ప్రకటనలకే అమాత్యుల మాటలు

ఇబ్బంది పడుతున్న ప్రజలు


కడప నగరానికి రెండు అభివృద్ధి పనులు కొండచిలువల్లా మారాయి. ఒకటి బుగ్గవంక సుందరీకరణ, మరొకటి భూగర్భ డ్రైనేజీ. ఇప్పటికి కోట్లు ఖర్చు చేసినా పనులు మాత్రం పూర్తి కాలేదు. పనులు ఆలస్యం కావడంతో బుగ్గవంక పరీవాహక ప్రాంత ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది. భూగర్భ డ్రైనేజీ అంటారా.. పనులు పూర్తి కాకుండానే అది కోట్ల రూపాయలు తినేసింది. ఈ రెండు పనులు కడప నగర వాసులకు తీరని కలగా మారిపోయాయి.


కడప, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): బుగ్గవంక సుందరీకరణ, భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తి అయితే ఉమ్మడి రాష్ట్రంలోని హైదరాబాదు స్థాయిలో కడప నగరం ఉంటుందని నాటి సీఎం వైఎస్‌ఆర్‌ కలలు కన్నారు. ఆ మేరకు నిధులు కేటాయించారు. అయితే కోట్లు ఖర్చయ్యాయే తప్ప ఫలితం మాత్రం శూన్యం. అనంతరం జిల్లావాసి వైఎస్‌ జగనమోహనరెడ్డి సీఎం కావడంతో కడప నగరం అభివృద్ధిలో దూసుకెళ్లి రాష్ట్రంలోని విశాఖ, విజయవాడ తదితర ముఖ్య నగరాలతో పోటీ పడుతుందని అందరూ భావించారు. పెండింగు పనులన్నీ పూర్తయి కడప సిటీ ముఖచిత్రం మారుతుందని ఆశించారు. రెండేళ్లు గడిచినా ఆ దిశగా అడుగులు పడలేదు. అంతెందుకు దివంగత వైఎస్‌ హయాంలో మొదలుపెట్టిన పనులు కూడా పూర్తి కాలేదు. 


సుందరీకరణకు మోక్షమెప్పుడో

కడప కార్పొరేషన జనాభా సుమారు 4.10 లక్షలు ఉంది. అన్నిరకాల భవనాలు కలుపుకుని సుమారు 93వేల పైచిలుకు ఉంటాయి. కడప నగరం మధ్యలో బుగ్గవంక ఉంది. దీని సుందరీకరణకు దివంగత సీఎం వైఎస్‌ఆర్‌ 14 ఏళ్ల క్రితం రూ.70 కోట్లు కేటాయించారు. బుగ్గవంక రక్షణ గోడ, వాహన రాకపోకలకు రహదారి, అల్మా్‌సపేట నుంచి ఎర్రముక్కపల్లె సర్కిల్‌ ఇరువైపులా బఫర్‌ లైటింగ్‌ ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. వంకకు ఇరువైపులా 8 కి.మీ మేర రక్షణ గోడ, రహదారుల సుందరీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. 14 ఏళ్లు దాటినా 6.8 కి.మీ మాత్రమే పూర్తయింది. మరో 1200 మీటర్ల రక్షణ గోడ నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. రవీంద్రనగర్‌, నాగరాజుపేట, ఎర్రముక్కపల్లె, ద్వారకనగర్‌, పాతబస్టాండు ప్రాంతంలోని రవీంద్రనగర్‌లో సుమారు 130 ఇళ్లను తొలగిస్తే తప్ప మిగిలిన రక్షణ గోడ పూర్తి అయ్యే పరిస్థితి లేదు. అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతల స్థలాలు, వాణిజ్య సముదాయాలు ఉండడం కూడా బుగ్గవంక ర క్షణ గోడకు గ్రహణంగా మారిందని చెప్పవచ్చు. నిర్లక్ష్యానికి తప్పదు మూల్యం అన్నట్లుగా గత ఏడాది నవంబరు 26న బుగ్గవంకకు వరద నీరు పోటెత్తడంతో పరీవాహ ప్రాంతం నీట మునిగింది. 5,650 ఇళ్లల్లోకి నీరు చేరింది. వరద ధాటికి ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఒక కుటుంబం లక్ష నుంచి 5 లక్షల వరకు నష్టపోయింది. సకాలంలో రక్షణ గోడ పూర్తయి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. ఆక్రమణలు తొలగించి, రక్షణగోడ నిర్మాణంతో ఇళ్లు కోల్పోయేవారికి  పరిహారం ఇస్తే తప్ప సుందరీకరణ పూర్తి కాదు. ప్రస్తుతం బుగ్గవంక రక్షణ గోడ పూర్తయిన వరకు రహదారి పనులు చేపడుతున్నారు. 


రూ.72 కోట్లు మింగిన భూగర్భ డ్రైనేజీ

కడపలో అస్తవ్యస్తంగా ఉన్న మురుగునీటి వ్యవస్థను మెరుగుపరిచేందుకు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. కడప కార్పొరేషనను నాలుగు జోన్లుగా విభజించి 2008 ఏప్రిల్‌ 1న పనులు మొదలు పెట్టారు. 1, 2 జోన్లలో అక్కాయపల్లె, ఐటీఐ సర్కిల్‌, బుగ్గవంక పడమటి ప్రాంతాలుండగా 3, 4 జోన్లలో చిన్నచౌకు, ప్రకాశనగర్‌ తదితర ప్రాంతాలను చేర్చారు. 2012 లోపు పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే కేవలం 3, 4 జోన్లలో 225 కి.మీ మేర పైప్‌లైను నిర్మించారు. 20 ఎంఎల్‌డీ కెపాసిటీ గల ట్రీట్‌మెంట్‌ ప్లాంటును నిర్మించారు. అయితే చాలా ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వలేదు. దీంతో భూగర్భ డ్రైనేజీ పనులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు బయటికి కనిపించకుండా నేరుగా పైపుల ద్వారానే మురుగునీటి శుద్ధి కేంద్రానికి తరలించాలనేది ప్రధాన ఉద్ధేశ్యం. ఆ లక్ష్యం నెరవేరకుండానే రూ.72 కోట్లు ఖర్చు పెట్టారు. అసంపూర్తిగా పనులుండడంతో ఓంశాంతినగర్‌, బాలాజీనగర్‌, వివేకానందనగర్‌, ప్రకాశనగర్‌ల లో మ్యానహోల్‌ దెబ్బతిని మురుగునీరంతా రహ దారిపైనే పారుతోంది. పనులు పూర్తి చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారే తప్ప ఇంత వరకు కార్యరూపం దాల్చడం లేదు.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.