ఉన్నతాధికారులకు ప్రయాణికుల లగేజీ తరలింపు బాధ్యతలు.. కాంటాస్ ఎయిర్‌లైన్స్ నిర్ణయం

ABN , First Publish Date - 2022-08-09T05:19:15+05:30 IST

సిబ్బంది కొరతతో సతమతమవుతున్న ఆస్ట్రేలియాకు చెందిన కాంటాస్ ఎయిర్‌లైన్స్.. సంస్థలోని ఉన్నతాధికారులకు తాజాగా అదనపు బాధ్యతలు అప్పగించింది.

ఉన్నతాధికారులకు ప్రయాణికుల లగేజీ తరలింపు బాధ్యతలు.. కాంటాస్ ఎయిర్‌లైన్స్ నిర్ణయం

ఎన్నారై డెస్క్: సిబ్బంది కొరతతో సతమతమవుతున్న ఆస్ట్రేలియాకు చెందిన కాంటాస్ ఎయిర్‌లైన్స్(Qantas).. సంస్థలోని ఉన్నతాధికారులకు తాజాగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రయాణికుల లగేజీని తరలించే బ్యాగేజ్ హ్యాండ్లర్ బ్యాధలు కూడా తీసుకోవాలని వారిని కోరింది. రాబోయే మూడు నెలల పాటు సంస్థలోని 100 మంది సీనియర్ అధికారులకు ఈ బాధ్యతలను అప్పగించింది. సిడ్నీ, మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్టుల్లో సిబ్బందికి వీరు సాయపడాల్సి ఉంటుంది. సిబ్బంది కొరత కారణంగానే ఈ బాధ్యతలను ఉన్నతస్థాయి అధికారులకు అప్పగిస్తున్నట్టు ఉద్యోగులకు పంపించిన అంతర్గత లేఖలో సంస్థ యాజమాన్యం పేర్కొంది. మార్కెట్ అవసరాలకు సరిపడా కార్మికులు అందుబాటులోకి లేకపోవడానికి తోడు అనేక మంది కరోనా, ఇతర ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల బారిన పడ్డారని తెలిపింది. 


అంతేకాకుండా.. ఈ సవాలు స్వీకరించ దలిచిన వారు శారీరక దారుఢ్యం కలిగి ఉండాలని, ఒకేసారి 32 కేజీల బరువున్న బ్యాగులను పైకెత్తగల సామర్థ్యం ఉండాలని కూడా చెప్పింది.  గతంలో ఓ మారు ఈస్టర్ పండగ సందర్భంగా కాంటాస్ ఎయిర్‌లైన్స్.. ఉన్నతాధికారులను ఇటువంటి సాయం కోరింది. అప్పట్లో ఏకంగా 200 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన తమ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రయాణికుల రద్దీతో సతమతమవుతున్న గ్రౌండ్‌ క్రూకు అండగా నిలిచారు.

Updated Date - 2022-08-09T05:19:15+05:30 IST