Qatar లోని వలసదారులకు ఇదే ఆఖరి ఛాన్స్.. గడువులోపు అలా చేయకపోతే చట్టపరమైన చర్యలు!

ABN , First Publish Date - 2021-10-09T13:27:38+05:30 IST

వీసా నిబంధనలు ఉల్లంఘించి, చట్టవిరుద్దంగా దేశంలో ఉంటున్న వలసదారులకు ఖతార్‌ అంతర్గత మంత్రిత్వ శాఖ ఓ అవకాశం ఇచ్చింది.

Qatar లోని వలసదారులకు ఇదే ఆఖరి ఛాన్స్.. గడువులోపు అలా చేయకపోతే చట్టపరమైన చర్యలు!

దోహా: వీసా నిబంధనలు ఉల్లంఘించి, చట్టవిరుద్దంగా దేశంలో ఉంటున్న వలసదారులకు ఖతార్‌ అంతర్గత మంత్రిత్వ శాఖ ఓ అవకాశం ఇచ్చింది. వారంతా తమ లీగల్ స్టేటస్‌ను సరిచేసుకునేందుకు వీలు కల్పించింది. ఇందుకు సంబంధించి గ్రేస్ పీరియడ్‌ను అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 31 వరకు అవకాశం ఇచ్చింది. ఈ గడువులోపు అక్రమంగా దేశంలో ఉంటున్న ప్రవాసులు తమ లీగల్ స్టేటస్‌ను సరిచేసుకోవాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. 2015లో ప్రవాసుల ఎంట్రీ, ఎగ్జిట్, నివాసాలను నియంత్రించడం కోసం తీసుకొచ్చిన చట్టం నెం. 21ను ఉల్లంఘించిన వారు(ఉద్యోగులు, వర్కర్స్, రెసిడెంట్స్) తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటించింది. కాగా, ప్రవాసులు తమ లీగల్ స్టేటస్‌ను సరిచేసుకునేందుకు అంతర్గత వ్యవహరాల శాఖ కార్యాలయాల్లో సంప్రదించవచ్చు. 


ప్రత్యేకంగా సర్వీస్ కేంద్రాల ఏర్పాటు..

అదే విధంగా మంత్రిత్వశాఖ అధికారులు ప్రత్యేకంగా కొన్ని సర్వీస్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఉమ్ సలాల్, ఉమ్ సునాయిమ్(పారిశ్రామి ప్రాంతం), మిసామియర్, అల్ వక్ర, అల్ రయ్యన్‌లో ఈ సర్వీస్ కేంద్రాలను తెరిచారు. లీగల్ స్టేటస్ సరిచేసుకునే అభ్యర్థులు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కేంద్రాల్లో సంప్రదించవచ్చు. ఇక ఖతార్‌లో వేర్వేరు దేశాల వలసదారులు ఉన్నందున వారికి అర్థమయ్యే విధంగా వివిధ భాషల్లో సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌పై దీనికి సంబంధించిన సమాచారాన్ని మంత్రిత్వ శాఖ షేర్ చేయడం జరిగింది. అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, మలయాళం, హిందీ, సింహళ, తమిళ్, తగలోగ్, బంగ్లా, నేపాలీ భాషల్లో ఈ సమాచారాన్ని ప్రభుత్వం సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. 

Updated Date - 2021-10-09T13:27:38+05:30 IST