త్యాగధనుల ఖిల్లా ప్రకాశం

ABN , First Publish Date - 2022-08-14T05:50:51+05:30 IST

ఎటుచూసినా త్రివర్ణమే. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశమంతా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి.

త్యాగధనుల ఖిల్లా ప్రకాశం

తుపాకీ గుండుకు గుండెను చూపిన ఆంధ్రకేసరి

తొలి విప్లవవీరుడు ఉయ్యాలవాడ

మహిళలల్లో సైతం సమరోత్సాహం

ఎటుచూసినా త్రివర్ణమే. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశమంతా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మకమైన వేళ స్వాతంత్య్ర సమరమోధుల పోరాటస్ఫూర్తిని, త్యాగనిరతిని గుర్తుచేసుకోవడం మనందరి కర్తవ్యం. అటువంటి వారిలో ముందుగా చెప్పుకోదగిన మహనీయులు టంగుటూరి ప్రకాశం పంతులు. బ్రిటిష్‌ వారి తుపాకీ గుండుకు తన గుండెను చూపించి ‘ఆంధ్రకేసరి’గా చరిత్రలో నిలిచారు. ఆయన పేరు మీదే అనంతర కాలంలో మన జిల్లా ఏర్పడింది. ఇక తొలి విప్లవవీరునిగా ఘనత సాధించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, దర్శి చెంచయ్య, వీరనారిగా పేరొందిన కొడాలి కమలమ్మ, ధీర వనితగా చరిత్రకెక్కిన రావూరి అలివేలు మంగమ్మ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది త్యాగధనులు, పోరాట వీరులకు మన జిల్లా పెట్టింది పేరు.

ఒంగోలు (కల్చరల్‌), ఆగస్టు 13 : ఒకనాటి బ్రిటిష్‌ పాలకుల దాస్యశృంఖలాల మధ్య నలిగిపోతున్న భరతమాతకు విముక్తిని కలిగించి, దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవటానికి ఎందరో వీరుల పోరాటపటిమ, త్యాగనిరతి, మహనీయుల కృషి కారణమయ్యాయి. నాడు సత్యాగ్రహ సంగ్రామంతో తెల్లదొరలను ఎదుర్కొన్న మహాత్ముని పిలుపునందుకుని ఎంతోమంది జిల్లా యువకులు స్వాతంత్య్ర ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ పోరాటంలో లాఠీదెబ్బలు తిన్నవారు, జైళ్లలో మగ్గినవారు, చావుకు సైతం వెనుదీయని దేశభక్తిపరాయణులు ఎందరో ఉన్నారు.  ఆ సమయంలో ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలు సైతం చోటుచేసుకున్నాయి. జాతీయోద్యమ మహాయజ్ఞంలో ఎందరో సమిధలైనప్పటికీ, ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ’ అంటూ తమ జన్మభూమి విముక్తి కోసం అకుంఠిత దీక్షతో పోరాడిన యోధులలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వారు సైతం ఎంతోమంది ఉండటం మనకు గర్వకారణం.


ధీరోదాత్తుడు టంగుటూరి ప్రకాశం

పులులను సైతం అదుపులో పెట్టగల సింహంలాంటి వ్యక్తి ప్రకాశం పంతులు అంటూ రాజాజీ సైతం మెచ్చుకున్నారంటే ఆయన ధీరోదాత్తత ఎంతటిదో అర్థమవుతుంది. అకుంఠిత దేశభక్తి, నిస్వార్థ ప్రజాసేవ, లక్షల ఆస్తిని దేశం కోసం అర్పించిన త్యాగశీలి టంగుటూరి ప్రకాశం పంతులు. కటిక దారిద్య్రం నుంచి స్వశక్తితో, స్వయంకృషితో బారిష్టర్‌ చదివి అగ్రనాయకునిగా ఎదిగిన ప్రకాశం పంతులు ఒంగోలు తాలూకాలోని వినోదరాయునిపాలెంలో 1872 ఆగస్టు 23న జన్మించారు. 1857 సిపాయిల తిరుగుబాటు చరిత్ర, స్వామి వివేకానంద రచనలు, బిపిన్‌ చంద్రపాల్‌ ఉపన్యాసాలు ఆయనలో చైతన్యం రగిలించాయి. తను స్థాపించిన స్వరాజ్య ఆంగ్ల దినపత్రిక ద్వారా బ్రిటిష్‌ పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. 1928లో జరిగిన సైమన్‌ గో బ్యాక్‌ ఉద్యమంలో పాల్గొని మీలో ఎవరికైనా దమ్ముంటే నా గుండెలపై కాల్చండిరా అంటూ బ్రిటిష్‌ సైనికుల తుపాకులకు తన ఛాతీని చూపించారు. మహాత్మాగాంధీ పిలుపు మేరకు 1930లో దేవరంపాడు వద్ద జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్ట్‌ అయ్యారు. 1940లో జరిగిన సత్యాగ్రహం, 1942లో జరిగిన క్విట్‌ఇండియా ఉద్యమాల్లో సైతం పాల్గొని జైలు కెళ్లారు. ఒక వ్యక్తి కాదు సమ్మోహన శక్తి అనేంతగా తన గంభీరమైన వ్యక్తిత్వం, సింహగర్జన వంటి ప్రసంగాలతో ప్రజలు ఆయన వెంట నడిచారు. 1896లో రాజకీయాల్లో ప్రవేశించిన ప్రకాశం పంతులు 1937లో మద్రాసు రాష్ట్రంలో రాజాజీ మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా, 1953 అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఏర్పడిన ఆంధ్ర రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు.


ధీరవనిత అలివేలు మంగమ్మ

మహాత్మాగాంధీ జాతీయోద్యమంలో రాజకీయ కారణాలతో యావత్‌ భారతదేశంలోనే జైలుకెళ్లిన తొలి ఖైదీ చీరాలకు చెందిన రావూరి అలివేలు మంగమ్మ. చేనేత వృత్తి చేసుకుంటూ జీవించే ఆమె.. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నేతృత్వంలో జరిగిన పన్నుల నిరాకరణోద్యమంలో చురుగ్గా పాల్గొని జైలుకెళ్లారు. ఆమెతోపాటు జైలుకెళ్లిన 12మంది దేశభక్తులను మహాత్మాగాంధీ పూలమాలలతో సత్కరించారు. ఆమె త్యాగనిరతి, దేశభక్తి అపారమైనవి. మహిళాలోకానికి ఆదర్శనీయమైనవి. 


జాతీయోద్యమ ధీరుడు గౌస్‌బేగ్‌

ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ముఖ్య అనుచరునిగా, టంగుటూరి ప్రకాశం పంతులుకు కుడిభుజంగా ఉంటూ జాతీయోద్యమంలో పాల్గొని అనేకసార్లు జైలు పాలైన ధీరుడు జనాబ్‌ గౌస్‌బేగ్‌ సాహెబ్‌. ఆయనది చీరాల మండలం గంటాయపాలెం అయినప్పటికీ ఒంగోలులో తన మేనమామ ఇంటిలో 1885 సెప్టెంబర్‌ 15న జన్మించారు. ఒంగోలులోనే విద్యాభ్యాసం చేసి 1920లో కలకత్తాలో భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలకు హాజరయ్యారు. అక్కడ మహాత్మాగాంధీ ఉపన్యాసాలకు ప్రభావితుడై చీరాల పేరాల ఉద్యమంలో దుగ్గిరాలతో కలిసి చురుగ్గా పాల్గొని జైలుకు వెళ్లారు. 1922లో పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం, దేవరంపాడు ఉప్పుకొఠార్లపై దాడి, శాసనోల్లంఘణ తదితర అనేక ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారు. ఆయన స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని గుర్తించిన కేంద్రప్రభుత్వం 1972 స్వాతంత్ర దినోత్సవం రోజున తామ్ర పత్రంతో గౌరవించింది. 


ఉప్పురాజుగా పేరొందిన విజయరామరాజు

ఒంగోలు రూరల్‌ మండలం దేవరంపాడు గ్రామానికి చెందిన సాగి విజయరామరాజు ఉప్పు సత్యాగ్రహంలో ఉధృతంగా పాల్గొని ‘ఉప్పురాజు’గా పేరొందారు. 1906లో జన్మించిన ఆయన, జిల్లాలోని సముద్రతీర ప్రాంతం మొత్తం తిరిగి ఉప్పు సత్యాగ్రహం గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో 1931లో ఆయనను అరెస్ట్‌ చేసి 6 నెలలు జైలుశిక్ష విధించారు. 1932లో మరోసారి ఆయన జైలుశిక్షకు గురయ్యారు. అయినా ఏమాత్రం వెనకడుగు వేయని విజయరామరాజు క్విట్‌ఇండియా ఉద్యమంలో భాగంగా కనుపర్తిలోని ఉప్పుకొఠారులపై జరిగిన దాడికి నాయకత్వం వహించారు. ఫలితంగా రెండేళ్ల జైలుశిక్షను అనుభవించారు. 1952లో ఆయన ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు ఎన్నికయ్యారు. 


అనేకమంది త్యాగధనులు

మన జిల్లాకు చెందిన ధీరోదాత్తులు, త్యాగధనుల గురించి చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు. చీమకుర్తికి చెందిన సుంకర వెంకటసుబ్బారెడ్డి, ఒంగోలుకు చెందిన వల్లూరి నారాయణరావు, షేక్‌ రహంతుల్లా, దారా గోపాలశాస్ర్తి, పొట్లపాడుకు చెందిన దొడ్డవరపు కామేశ్వరరావు, యర్రగొండపాలెంకు చెందిన యక్కలి రామయ్య, కందుకూరు సమీపంలోని నలదలపురానికి చెందిన బత్తిన పెరుమాళ్లు, టంగుటూరుకు చెందిన పోతుల బుచ్చప్పనాయుడు, ముక్తినూతలపాడుకు చెందిన ముక్తినూతలపాటి వెంకటనారాయణ శర్మ, మద్దిపాడు మండలం గాజులపాలెంకు చెందిన గుండ్లపల్లి ఆదినారాయణ, మార్కాపురానికి చెందిన కందుల ఓబులరెడ్డి, రాచర్ల మండలం అనుమలవీడుకు చెందిన పిడతల రంగారెడ్డి, చీమకుర్తికి చెందిన చీమకుర్తి శేషగిరిరావు ఇలా.. మన జిల్లాకు చెందిన వందలాదిమంది మహనీయుల త్యాగఫలమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా జీవితం.    


Updated Date - 2022-08-14T05:50:51+05:30 IST