Quad summit: క్వాడ్ దేశాధినేతలకు ఇదో గొప్ప అవకాశం: మోదీ

ABN , First Publish Date - 2022-05-23T00:47:23+05:30 IST

టోక్యో వేదకగా ఈనెల 23, 24 తేదీల్లో జరగనున్న క్వాడ్‌ సదస్సు నాలుగు దేశాల నేతలకు ఒక చక్కటి అవకాశమని ..

Quad summit: క్వాడ్ దేశాధినేతలకు ఇదో గొప్ప అవకాశం: మోదీ

న్యూఢిల్లీ: టోక్యో వేదికగా ఈనెల 23, 24 తేదీల్లో జరగనున్న క్వాడ్‌ సదస్సు నాలుగు దేశాల నేతలకు ఒక చక్కటి అవకాశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంత పరిణామలతో పాటు అంతర్జాతీయ సమస్యలు, క్వాడ్ దేశాల ఉమ్మడి అంశాలపై పరస్పరం అభిప్రాయాలు పంచుకునేందుకు, ప్రగతిని సమీక్షించేందుకు ఈ సదస్సు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆదివారంనాడు ఆయన జపాన్ పర్యటనకు బయలుదేరడానికి ముందు ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. తన పర్యటనలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కూడా ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటానని, ప్రాంతీయ అభివృద్ధి, సమకాలీన అంతర్జాతీయ సమస్యలపై తాము చర్చిస్తామని చెప్పారు.


జపాన్ ప్రధాని కిషిడా ఆహ్వానం మేరకు తాను టోక్యో వెళ్తున్నానని, గత మార్చిలో 14వ ఇండో-జపాన్ వార్షిక సదస్సుకు ఫుమియో కిషిదకు తాము ఆతిథ్యమిచ్చామని చెప్పారు. ఇండో-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని పటిష్టం చేసే లక్ష్యంతో ఉభయదేశాలు జరుపుతున్న చర్చలను తన టోక్యో పర్యటనలో మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఆసక్తితో ఉన్నట్టు చెప్పారు. క్వాడ్ సదస్సులో ఇంతకుముందు తీసుకున్న నిర్ణయాల ప్రగతిని సమీక్షిస్తామని చెప్పారు. ఇండో-పసిపిక్ ప్రాంతంలో పరిణామాలు, పరస్పర ప్రయోజనాలున్న అంతర్జాతీయ అంశాలపై నేతలంతా తమ అభిప్రాయలు పంచుకుంటారని అన్నారు. క్వాడ్ దేశాల్లో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఉన్నాయి. కొత్తగా ఎన్నికైన ఆస్ట్రేలియా ప్రధాని అంథోనీ అల్బాన్సే సైతం తొలిసారి క్వాడ్ నేతల సదస్సులో పాల్గొంటారని మోదీ చెప్పారు. ఆయనతో ద్వైపాక్షిక సమావేశం జరిపేందుకు తాను ఆసక్తితో ఉన్నానని తెలిపారు. కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ కింద ఇండియా, ఆస్ట్రేలియా మధ్య బహుముఖ సహకారంపైన,  పరస్పర ప్రయోజనాలు కలిగిన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైన చర్చిస్తామని చెప్పారు.


జపాన్-ఇండియా మధ్య ఆర్థిక సహకారం కీలకం

తమ పర్యటనలో జపాన్-ఇండియా మధ్య ఆర్థిక సహకారం అనేది చాలా కీలకాంశమని, జపాన్ నుంచి రాబోయే ఐదేళ్లలో జరిగే పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇన్వెస్టెమెంట్ అండ్ ఫైనాన్సింగ్‌ అంశంపై చర్చిస్తామని మోదీ చెప్పారు. ఇరుదేశాల మధ్య ఎకనామిక్ లింకేజ్‌ను మరింత పటిష్టం చేసేందుకు జపాన్ వాణిజ్యవేత్తలతోనూ సమావేశమవుతామని తెలిపారు. జపాన్లో 40,000 మందికి పైగా భారతీయ సంతతి ఉందని, జపాన్‌తో సంబంధాలకు అనుసంధానంగా నిలుస్తున్న వారందరికీ సమావేశం కావడానికి తాను ఆసక్తితో ఉన్నానని చెప్పారు.  రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ జపాన్‌లో పర్యటించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated Date - 2022-05-23T00:47:23+05:30 IST