ఆఖరి అవకాశం

ABN , First Publish Date - 2022-05-27T09:47:05+05:30 IST

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లకు ఇదే ఆఖరి అవకాశం.

ఆఖరి అవకాశం

నేడే క్వాలిఫయర్‌-2

బెంగళూరు  X రాజస్థాన్‌ పోరు

గెలిచిన జట్టు ఫైనల్‌కు

రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..


అహ్మదాబాద్‌: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లకు ఇదే ఆఖరి అవకాశం. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగే ఫైనల్లో తలపడాలంటే  క్వాలిఫయర్‌2 మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరుకు తెర లేవనుంది. రాజస్థాన్‌ జట్టు తొలి సీజన్‌లోనే చాంపియన్‌గా నిలిచినప్పటికీ ఆ తర్వాత ప్రస్థానం అంత సవ్యంగా ఏమీ సాగలేదు. క్వాలిఫయర్‌-1లో ఎదురైన ఓటమిని మరిచి ప్రత్యర్థిపై గెలవాలంటే స్థాయికి మించిన ప్రదర్శన చేయాల్సిందే. మరోవైపు స్టార్లతో కూడిన బెంగళూరుకు టైటిల్‌ విషయంలో ఇప్పటిదాకా నిరాశే ఎదురైంది.


ఒక్కసారి మాత్రమే ఫైనల్‌కు వచ్చి రన్నర్‌పతో సరిపెట్టుకుంది. ఎలిమినేటర్‌లో లఖ్‌నవూను చిత్తు చేసిన జోష్‌లో ఉన్న ఆర్‌సీబీ అదే జోరుతో ఆర్‌ఆర్‌ను కూడా ఓడించేందుకు ఎదురుచూస్తోంది. తద్వారా తుదిపోరుకు చేరి తమ టైటిల్‌ కలను నెరవేర్చాలనుకుంటోంది. మరోవైపు అత్యధిక వికెట్ల జాబితాలో టాప్‌-2లో ఉన్న స్పిన్నర్లు చాహల్‌ (26), హసరంగ (25) మధ్య ఎవరిది పైచేయో ఈ మ్యాచ్‌లో తేలిపోనుంది.


ఆత్మవిశ్వాసమే బలంగా..

డుప్లెసీ, కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌ నిరాశపరిచినా రజత్‌ పటీదార్‌ అజేయ శతకంతో రాణించిన తీరు ఆర్‌సీబీలో ఉత్సాహాన్ని నింపింది. వేలంలో ఎవరూ పట్టించుకోని ఈ ఆటగాడిని బెంగళూరు రీప్లే్‌సమెంట్‌ ద్వారా తీసుకుంది. అప్పటినుంచి జట్టుకు కీలకంగా మారాడు. బాదుడే లక్ష్యంగా జట్టు స్కోరును 200 దాటించాడు. దినేశ్‌ కార్తీక్‌ సూపర్‌ ఫినిషర్‌గా ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో స్టార్‌ త్రయం కూడా చెలరేగితే రాజస్థాన్‌కు తిప్పలు తప్పవు. ఇక బౌలింగ్‌లో హర్షల్‌ పటేల్‌, హాజెల్‌వుడ్‌ డెత్‌ ఓవర్లలో పరుగులను కట్టడి చేసి ఒత్తిడి పెంచుతున్నారు. హసరంగ స్పిన్‌ను ఎదుర్కోవడం ప్రత్యర్థికి సవాలే.


బౌలింగ్‌ మెరుగైతేనే..

రాజస్థాన్‌ బ్యాటింగ్‌ ఎక్కువగా ఓపెనర్‌ బట్లర్‌, కెప్టెన్‌ శాంసన్‌పైనే ఆధారపడి ఉంది. గుజరాత్‌పై ఇద్దరూ మెరుగ్గానే ఆడినా విజయానికది సరిపోలేదు. శాంసన్‌ తన 30, 40 పరుగుల్ని భారీస్కోర్లుగా మలచాల్సి ఉంది. క్వాలిఫయర్‌-1లో జైశ్వాల్‌ విఫలమవడం దెబ్బతీసింది. ఇక బౌలింగ్‌లో టైటాన్స్‌పై స్పిన్నర్‌ అశ్విన్‌, పేసర్‌ ప్రసిద్ధ్‌ దారుణంగా నిరాశపరిచారు. ఆఖరి ఓవర్‌లో మిల్లర్‌కు లెంగ్త్‌ బంతులు విసిరిన ప్రసిద్ధ్‌ మ్యాచ్‌ చేజారడానికి కారణమయ్యాడు. బౌల్ట్‌, చాహల్‌ మాత్రమే ఆకట్టుకుంటున్నారు. దీంతో నేటి మ్యాచ్‌లో ఈ జట్టు అన్ని విభాగాల్లోనూ అదరగొడితేనే ఆర్‌సీబీని దెబ్బతీసే అవకాశం ఉంటుంది.


జట్లు (అంచనా)

 బెంగళూరు:

డుప్లెసీ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, రజత్‌ పటీదార్‌, మ్యాక్స్‌వెల్‌, మహిపాల్‌ లొమ్రోర్‌, షాబాజ్‌ అహ్మద్‌, దినేశ్‌ కార్తీక్‌, హసరంగ, హర్షల్‌ పటేల్‌, హాజెల్‌వుడ్‌, సిరాజ్‌.


రాజస్థాన్‌:

జోస్‌ బట్లర్‌, యశస్వీ జైశ్వాల్‌, సంజూ శాంసన్‌ (కెప్టెన్‌), దేవ్‌దత్‌ పడిక్కళ్‌, హెట్‌మయెర్‌, రియాన్‌ పరాగ్‌, అశ్విన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, యజ్వేంద్ర చాహల్‌, మెకాయ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ.  

Updated Date - 2022-05-27T09:47:05+05:30 IST