కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్య

ABN , First Publish Date - 2022-08-19T05:15:42+05:30 IST

సీఎం కేసీఆర్‌ సారథ్యం రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న మహనీయుల గురించి భావితరాలకు తెలిసేలా వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నామని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు.

కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్య
క్రీడాపోటీల్లో పాల్గొన్న విద్యార్థులతో మంత్రి సత్యవతి రాథోడ్‌

జేఈఈలో 467 మంది గిరిజన విద్యార్థులకు సీట్లు

మహనీయుల గురించి భావితరాలకు తెలిసేలా వజ్రోత్సవాలు

రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌


 జిన్నారం/ సంగారెడ్డిఅర్బన్‌, ఆగస్టు 18: సీఎం కేసీఆర్‌ సారథ్యం రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న మహనీయుల గురించి భావితరాలకు తెలిసేలా వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నామని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. గురువారం జిన్నారం మండల కేంద్రంలోని ఎస్టీ గురుకుల పాఠశాలలో వజ్రోత్సవాల్లో బాగంగా నిర్వహిస్తున్న ఫ్రీడం కప్‌ క్రీడా పోటీలను మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో ఉన్న 260 గురుకుల పాఠశాల సంఖ్యను సీఎం కేసీఆర్‌ సారథ్యంలో వెయ్యికి చేరిందన్నారు. ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తుందన్నారు. ఇటీవల నిర్వహించిన జేఈఈ పరీక్షల్లో గిరిజన పాఠశాలలకు చెందిన 542 మంది విద్యార్థులు హజరు కాగా 467 మందికి సీట్లు దక్కాయన్నారు. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో తెలంగాణ పోరాటం చేపట్టి రాష్ట్ర సాధన చేసినట్లు ఆమె తెలిపారు.  ఉత్సవాల్లో భాగంగా పలు క్రీడాపోటీలను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా క్రికెట్‌, బాస్కెట్‌బాల్‌, కబడ్డి పోటీలను ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటారు. విద్యా, పాఠశాల సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. 


రాజకీయ లబ్ధి కోసమే 

రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయని, రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. మత విద్వేషంతో రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. వారికి అధికారం ఇస్తే తిరిగి 200 పింఛన్లు, విద్యుత్‌ మీటార్లు ఏర్పాటు చేస్తారని ఎద్దేవా చేశారు.  కార్యక్రమంలో ట్రైకా చైర్మన్‌ రాంచందర్‌నాయక్‌, అడిషనల్‌ కార్యదర్శి సర్వేశ్వర్‌రెడ్డి, ఆర్డీవో నగేష్‌, తహసీల్దార్‌ దశరథ, పాఠశాల ప్రిన్సిపాల్‌ సాంబ్యానాయక్‌, తదితరులు పాల్గొన్నారు. 


   ఓటమి విజయానికి తొలిమెట్టు

 ఓటమి విజయానికి తొలిమెట్టు అని కలెక్టర్‌ శరత్‌ పేర్కొన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని సంగారెడ్డిలోని అంబేడ్కర్‌ స్టేడియంలో గురువారం యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో ఫ్రీడం కప్‌ పేరిట ఆటలపోటీలు నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా హాజరైన కలెక్టర్‌ శరత్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమేనన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని వారు పేర్కొన్నారు. అనంతరం వాలీబాల్‌ ఆడి వారు క్రీడలను ప్రారంభించారు. అంతకుముందు శుభ సూచకంగా పావురాలను ఎగురవేసి, క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కాగా ఆయా క్రీడాంశాల్లో గెలుపొందిన జట్లకు ఫ్రీడం కప్‌ అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ రాజర్షిషా, డీవైఎ్‌సవో రాంచందర్‌రావు, డీఆర్‌డీవో శ్రీనివాసరావు, ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలే్‌షరెడ్డి, ఆర్డీవో నగేశ్‌, టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు సుశీల్‌ బాబు, కేంద్ర సంఘం కార్యదర్శి రవి, డీవైఎ్‌సవో సూపరింటెండెంట్‌ జావిద్‌ అలీ, ప్రభుత్వ ఉద్యోగులు, క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-19T05:15:42+05:30 IST