నాణ్యమైన సేవలు అందాలి

ABN , First Publish Date - 2022-07-03T06:49:52+05:30 IST

వినియోగదారుడికి సంతృప్తికరమైన, నాణ్యతతో కూడిన సేవలు అందితేనే పురోభివృద్ధి సాధ్యమవుతుందని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.వి.రాధాకృష్ణ కృపాసాగర్‌ అన్నారు.

నాణ్యమైన సేవలు అందాలి
మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.వీ రాధాకృష్ణ కృపాసాగర్‌

జిల్లా ప్రధాన న్యాయమూర్తి

కర్నూలు(లీగల్‌), జూలై 2: వినియోగదారుడికి సంతృప్తికరమైన, నాణ్యతతో కూడిన సేవలు అందితేనే పురోభివృద్ధి సాధ్యమవుతుందని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.వి.రాధాకృష్ణ కృపాసాగర్‌ అన్నారు. స్థానిక మున్సిఫ్‌ కోర్టు ఆవరణలోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ ఆధునీకరించిన భవన సముదాయాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వినియోగదారుడు తనకు అన్యాయం జరిగిందని కమిషన్‌ను ఆశ్రయిస్తే సత్వర న్యాయాన్ని కమిషన్‌ అందిస్తుందని చెప్పారు. కర్నూలు జిల్లా వినియోగదారుల కమిషన్‌ అధ్యక్షుడు కరణం కిషోర్‌ కుమార్‌ మాట్లాడుతూ వినియోగదారులకు వ్యాపార, వాణిజ్య సంస్థలు మెరుగైన సేవలు అందించాలని కోరారు. కమిషన్‌ సభ్యుడు ఎన్‌.నారాయణ రెడ్డి మాట్లాడుతూ వినియోగదారుల హక్కులు కూడా మానవ హక్కులలో నిక్షిప్తమై ఉన్నాయని తెలిపారు. కమిషన్‌ మహిళా సభ్యురాలు ఎస్‌.నజీమాకౌసర్‌ మాట్లాడుతూ రూ.5 లక్షల లోపు కొనుగోలుకు సంబంధించిన వివాదాలను ఎటువంటి కోర్టు ఫీజు లేకుండా కమిషన్‌ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి, అదనపు జిల్లా జడ్జిలు శ్రీనివాస కుమార్‌, సునీత, భూపాల్‌ రెడ్డి, న్యాయమూర్తులు పాండురంగారెడ్డి, కేశవ్‌, శ్రీనివాసరావు, డీఎ్‌సవో ఎం.రాధారఘువీర్‌, కమిషన్‌ సూపరింటెండెంట్‌ నక్కా రాముడు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎంఆర్‌ కృష్ణ, ప్రధాన కార్యదర్శి కె.రంగడు పాల్గొన్నారు.



Updated Date - 2022-07-03T06:49:52+05:30 IST