ఓటు.. చేటు

ABN , First Publish Date - 2021-12-02T05:38:11+05:30 IST

దాచేపల్లి నగర పంచాయతీ ఎన్నికల్లో ఓటే వేయడమే వారి పాలిట శాపంలా మారింది. ఎన్నో ఏళ్లుగా రాయి కొట్టి బతికే వారి జీవనం పోగొట్టింది.

ఓటు.. చేటు
నారాయణపురం క్వారీలో ధర్నాచేస్తున్న వడ్డెర కార్మికులు

టీడీపీకి ఓటేశారని పొట్టగొట్టారు

ఉపాధి కోల్పోయిన వడ్డెర కార్మికులు

నారాయణపురం క్వారీల వద్ద ఆందోళన

పల్నాడులో పెచ్చుమీరిన వైసీపీ ఆగడాలు 


దాచేపల్లి, పిడుగురాళ్ల, డిసెంబరు 1: దాచేపల్లి నగర పంచాయతీ ఎన్నికల్లో ఓటే వేయడమే వారి పాలిట శాపంలా మారింది. ఎన్నో ఏళ్లుగా రాయి కొట్టి బతికే వారి జీవనం పోగొట్టింది. క్వారీలనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న వడ్డెర కార్మికుల బతుకు వైసీపీ నేతల దాష్టికానికి ఛిద్రమైపోయాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత క్వారీలను బలవంతంగా లాక్కున్న వైసీపీ నేతలు ప్రస్తుతం వడ్డెర కార్మికులపై పడ్డారు. కార్మికులు నివాసం ఉంటున్న కొన్ని వార్డుల్లో టీడీపీ విజయం, మరికొన్ని చోట్ల స్వల్ప మెజార్టీతో బయటపడింది. దీంతో క్వారీల యాజమాన్యం ఆగ్రహానికి కార్మికులు బలికావాల్సి వచ్చింది. పల్నాడులో పెచ్చుమీరిన వైసీపీ ఆగడాలకు క్వారీ కార్మికుల ఘటనో నిదర్శనం. ఇటీవల జరిగిన నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేశారన్న సాకుతో నారాయణపురం మైనింగ్‌ క్వారీలో పని చేస్తున్న 50 వడ్డెర కార్మికులను బుధవారం పనుల్లోకి రానివ్వకుండా వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. అంతేకాకుండా బకాయి నగదు చెల్లింపునకు కూడా యాజమాన్యం నిరాకరించింది. దీంతో క్వారీ మార్గంలో కార్మికులు ధర్నాకు దిగి ట్రాక్టర్లను అడ్డుకున్నారు. అధికార పార్టీ నేతల ఫిర్యాదుతో కార్మికులను ఎస్‌ఐ సుధీర్‌కుమార్‌ స్టేషన్‌కు తరలించారు. నగదు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో కార్మికులు ఆందోళన విరమించారు. 


ట్రాక్టర్‌ తొక్కిస్తామని బెదిరింపులు 

అనుమతి లేకుండా క్వారీలోకి వస్తే కేసులు పెడతామని, ట్రాక్టర్లతో తొక్కిస్తామని యాజమాన్యం బెదిరిస్తుందని కార్మికులు వాపోయారు. వడ్డెర కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ దేవళ్ళ రేవతి భర్త రఘు పనిలోకి రావడానికి వీల్లేదన్నారని ఆరోపించారు. రఘు, అయ్యన్న వివక్ష చూపుతున్నారన్నారు. పనిలోకి రావద్దనడంతో తమ కుటుంబాలు రోడ్డు పాలయ్యాయని బండారు వెంకటేశ్వరరావు, వేముల నరసింహారావు, వేముల ఏడుకొండలు, బండారు నాగరాజు, పల్లపు సాంబ, శ్రీను తదితరులు విలేకర్ల వద్ద వాపోయారు. వైసీపీ నాయకులు తమపట్ల సానుకూలంగా వ్యవహరించాలన్నారు. కార్మికులను మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఫోన్‌లో పరామర్శించారు. అండగా ఉంటామని, భయపడాల్సిన పనిలేదని, న్యాయం జరిగే వరకు పోరాడతామని ఆయన హామీ ఇచ్చారు. 


బకాయిలు చెల్లిస్తాం.. పనిలోకి తీసుకోము 

గతంలో పనిచేసిన డబ్బులు సుమారు రూ.15 లక్షలు కార్మికులకు రావాలి. కార్మికుల ఆందోళనతో దిగివచ్చిన యాజమాన్యం వీలైనంత త్వరలో బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వటంతో కార్మికులు శాంతించారు. అయితే క్వారీలో నిలిపివేసిన కార్మికులను తిరిగి పనిలోకి తీసుకునేందుకు మాత్రం యాజమాన్యం సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ నేపథ్యంలో గత ఏడాది క్వారీలో పనికి వెళ్లే విషయమై జరిగిన పంచాయితీలో వడ్డెర కార్మికుడు నీలకంఠబాబు హత్యతో భయపడిన కార్మికులు ప్రస్తుతం ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. 


 టీడీపీకి ఓటేశామని రావద్దన్నారు 

మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీకి ఓటేశామని  పనికి రావద్దన్నారు. రాయికొట్టుకొని జీవనం సాగించటం మినహా తమకు మరో పని తెలియదు. హఠాత్తుగా  పనిలో నుంచి తొలగించటంతో ఏమి చేయాలో పాలుపోవటం లేదు.

- పల్లపు సాంబశివరావు 


కేసుల పేరుతో బెదిరింపులు 

క్వారీలో రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేస్తే తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా పనికి కూడా రావద్దంటున్నారు. ఇదేమిటని అడిగితే పోలీసు కేసు పెడతామని బెదిరిస్తున్నారు.

- వేముల నరసింహారావు

 

Updated Date - 2021-12-02T05:38:11+05:30 IST