క్వార్ట్‌జైట్‌ తవ్వకాలు వద్దే వద్దు

ABN , First Publish Date - 2022-08-19T06:15:40+05:30 IST

అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం దాలివలసలో క్వార్ట్‌జైట్‌ తవ్వకాలకు అనుమతులు రద్దు చేయాలని గ్రామస్థులు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు.

క్వార్ట్‌జైట్‌ తవ్వకాలు వద్దే వద్దు
దాలివలస ప్రజాభిప్రాయ సభలో అనుకూలురు, స్థానికుల మధ్య వాగ్వాదం

- క్వార్ట్‌జైట్‌ మైనింగ్‌ తవ్వకాలపై సర్వత్రా నిరసన

- దాలివలస, గవరపాలెంలో ప్రజాభిప్రాయ సేకరణ

- స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత 


అనకాపల్లి, కె.కోటపాడు, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం దాలివలసలో క్వార్ట్‌జైట్‌ తవ్వకాలకు అనుమతులు రద్దు చేయాలని గ్రామస్థులు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో గురువారం దాలివలసలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ, కాలుష్య నియంత్రణ మండలి అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో స్థానికులు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న మైనింగ్‌ తవ్వకాల గడువు ముగియడంతో ఆరు నెలల క్రితమే మైనింగ్‌ ఆగింది. మళ్లీ ఇక్కడ అనుమతులు ఇవ్వొదని స్థానికులు ఫిర్యాదు చేయగా, కొందరు బినామీ పేర్లతో మళ్లీ అనుమతులు పొందినట్టు తెలిసింది. దాలివలసలో గురువారం జరిగిన ప్రజాభిప్రాయ సభలో 40 మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒకరిద్దరు మాత్రమే అనుకూలంగా మాట్లాడగా, మిగతా వారు వ్యతిరేకించారు. దాలివలసలో ఎంఏఆర్‌ కుమారి పేరిట దాలివలస, మర్రివలస, పెండ్రింగి గ్రామాలకు సంబంధించి సర్వే నంబర్లలో 12.14 హెక్టార్లలో మైనింగ్‌ తవ్వకాల అనుమతులపై ప్రజా వ్యతిరేకత కనిపించింది. మైనింగ్‌ అనుమతులకు సంబంధించి నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణపై కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా సభ నిర్వహించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్‌ తవ్వకాలు చేపడితే జీడిమామిడి, మామిడి, పంట పొలాలు దెబ్బ తింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ మాడుగుల నియోజకవర్గం ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌ మాట్లాడుతూ స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నా మైనింగ్‌ కొనసాగించేందుకు ప్రభుత్వం మొండిగా ముందుకు వెళితే ప్రజలు, ప్రజా సంఘాలను కూడగట్టుకుని ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. పెండ్రింగ్‌ సర్పంచి జె.వెంకటరామలక్ష్మి మాట్లాడుతూ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్న విషయాన్ని కూడా తనకు తెలియజేయలేదని తెలిపారు. పలువురు సర్పంచ్‌లు కూడా మైనింగ్‌కు అనుమతులు ఇవ్వొద్దని, ఇప్పటికే ఇచ్చివుంటే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. గతంలో క్వార్ట్‌జైట్‌ మైనింగ్‌ తవ్వకాల వల్ల పంట పొలాలు దెబ్బతిన్నాయని, కొండలపై నుంచి వచ్చే నీటి ప్రవాహాలు కూడా కలుషితమయ్యాయని తెలిపారు. చెరువుల కింద ఉన్న ఆయకట్టుకు సాగునీరు అందని పరిస్థితి నెలకొందన్నారు. గత నష్టాలు చాలదన్నట్టు మళ్లీ క్వార్ట్‌జైట్‌ తవ్వకాల అనుమతులకు ప్రజాభిప్రాయాన్ని సేకరించడం సరికాదని ముక్తకంఠంతో అధికారులను నిలదీశారు. తవ్వకాలకు అనుకూలంగా వత్తాసు పలికిన జేటీ రామారావు అనే వ్యక్తిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను వేదికపై నుంచి కిందకు దించేశారు. ఈ క్రమంలో ప్రజాభిప్రాయ సేకరణ వేదిక వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఒకానొక దశలో తోపులాటలు చోటు చేసుకున్నాయి. ప్రజాభిప్రాయ వేదిక రసాభాసగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని రామారావును అక్కడ నుంచి పంపేయడంతో పరిస్థితి చక్కబడింది. రైతు సంఘం జిల్లా నాయకుడు పి.నాయనబాబు మాట్లాడుతూ దాదాపు ఆరు నెలల కిందట వరకు ఇక్కడ రూ.20 కోట్లు విలువైన అక్రమ మైనింగ్‌ జరిగిందని, అధికారులు ప్రభుత్వానికి నామమాత్రపు అపరాధ రుసుము కట్టించుకుని అక్రమార్కులను కాపాడారని ఆరోపించారు. గతంలో మైనింగ్‌ కారణంగా స్థానిక రైతుల పంటలు దెబ్బతిని నష్టపోయిన విషయం అధికారులకు తెలిసినా, మళ్లీ అదే ప్రాంతంలో మైనింగ్‌కు అనుమతులు ఇచ్చేందుకు సిద్ధం కావడం అన్యాయమన్నారు. తవ్వకాల ప్రాంతంలో పేదలకు ప్రభుత్వం కొన్ని సంవత్సరాల కిందట డీపట్టాలు అందజేసిందని గుర్తు చేశారు. తవ్వకాలు జరిగితే రైతులు, డీపట్టాదారులు, గొర్రెలు, మేకల పెంపకం దారులు తమ జీవనోపాధిని కోల్పోతారన్నారు. నష్టదాయకమైన మైనింగ్‌ అనుమతులను రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

గవరపాలెంలోనూ వ్యతిరేకత

గవరపాలెంలో మధ్యాహ్నం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో కూడా స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ సభలో 37 మంది మాట్లాడగా, 12 మంది మైనింగ్‌ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.  మిగిలిన వారంతా సానుకూలంగా ఉన్నారు. గవరపాలెంలో వి.విజయలక్ష్మి పేరుతో 16.19 హెక్టార్లలో క్వార్ట్‌జైట్‌ మైనింగ్‌కు గురువారం ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించగా పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా తవ్వకాలు చేపడితే అడ్డుకుంటామని హెచ్చరించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్న, కోటపాడు మండల నాయకుడు దేముడు, స్థానిక ప్రజలు మైనింగ్‌ను వ్యతిరేకించారు.


Updated Date - 2022-08-19T06:15:40+05:30 IST