వరదపై ప్రధానిని ప్రశ్నించరా?

ABN , First Publish Date - 2022-07-28T08:53:42+05:30 IST

వరద సాయంపై ప్రధాని మోదీని సీఎం కేసీఆర్‌ ఎందుకు ప్రశ్నించడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి నిలదీశారు.

వరదపై ప్రధానిని ప్రశ్నించరా?

స్వార్థ ప్రయోజనాల కోసమే కేసీఆర్‌ తాపత్రయం

రాజగోపాల్‌పై అధిష్ఠానానిదే తుది నిర్ణయం: రేవంత్‌


న్యూఢిల్లీ, జూలై 27 (ఆంధ్రజ్యోతి): వరద సాయంపై ప్రధాని మోదీని సీఎం కేసీఆర్‌ ఎందుకు ప్రశ్నించడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి నిలదీశారు. వరదల వల్ల నష్టపోయిన తెలంగాణ ప్రజలను ఆదుకోడానికి ప్రధానిపై సీఎం కేసీఆర్‌ పోరాట కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అది ప్రకటించిన తర్వాతే ఢిల్లీ నుంచి రాష్ట్రానికి బయలుదేరి రావాలని సూచించారు. అవినీతిని ప్రధాని ఎక్కడ ప్రశ్నిస్తారోనని కేసీఆర్‌ భయపడుతునట్లున్నారని ఆరోపించారు. ఇద్దరూ కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీలో బుధవారం రేవంత్‌ విలేకరులతో మాట్లాడారు. వర్షాలు, వరదల వల్ల రూ.1400 కోట్ల మేర నష్టం జరిగిందంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నివేదిక పంపించిందని, కానీ.. వాస్తవానికి రూ. 3వేల కోట్ల పంట నష్టం జరిగిందని వెల్లడించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో తినడానికి తిండి దొరక్క, ప్రభు త్వ సాయం అందక లక్షలాది మంది అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లి నిధులు ఇవ్వాలని కేసీఆర్‌ ఒత్తిడి చేయాల్సిందన్నారు. సొంత పార్టీ ఎంపీలతో చర్చించే తీరిక కూడా ఆయనకు లేదని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు ఢిల్లీలో కనిపించడం లేదని, కేసీఆర్‌ది వ్యక్తిగత పర్యటనగా మారిందని దుయ్యబట్టారు. ఆయా శాఖల రాష్ట్ర అధికారులను ఢిల్లీకి పిలిపించిన కేసీఆర్‌.. బ్యాంకుల నుంచి రావాల్సిన రుణాల గురించి చర్చిస్తున్నట్లు తనకు సమాచారం అందిందని పేర్కొన్నారు. రుణాలు వస్తే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి కమీషన్లు మెక్కాలన్నదే కేసీఆర్‌ విధానమని ధ్వజమెత్తారు. 


గుజరాత్‌కే నిధులు ఇస్తారా?

‘‘ప్రధాని మోదీకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఇష్టం లేకపోవచ్చు. కానీ మా ఓట్లతో మీరు ప్రధాని అయ్యారు. మీకు నలుగురు ఎంపీలను గెలిపించారు. మీకు బాధ్యత లేదా? గుజరాత్‌లో వరదలు వస్తే ఆఘమేఘాల మీద వందల కోట్లు ఇస్తారు. మీరు గుజరాత్‌కే ప్రధాన మంత్రా..? తెలంగాణకు కాదా..? తెలంగాణ ప్రజలు చచ్చిపోతుంటే మీకు బాధ్యత లేదా..? తెలంగాణకు ఎందుకు నిధులు విడుదల చేయడం లేదు..?’’ అని రేవంత్‌ ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, రాష్ట్రానికి చెందిన ముగ్గురు బీజేపీ ఎంపీలు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ప్రజల కష్టాలను ప్రఽధాని దృష్టికి తీసుకెళ్లకుండా బీజేపీ నేతలు ద్రోహులుగా మిగిలిపోయారని మండిపడ్డారు.  చిత్తశుద్ధి ఉంటే రూ. 1400 కోట్లను రాబట్టడానికి కేంద్రంపై పోరాట కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కాగా, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై పార్టీలో అంతర్గతంగా చర్చించుకుంటామని ఓ ప్రశ్నకు సమాధానంగా రేవంత్‌ చెప్పారు. దీనికి సంబంధించిన తుది నిర్ణయాన్ని అధిష్ఠానమే తీసుకుంటుందని వెల్లడించారు. 

Updated Date - 2022-07-28T08:53:42+05:30 IST