ప్రశ్నార్థకమైన ఖరీఫ్‌ సాగు!

ABN , First Publish Date - 2021-10-18T04:46:31+05:30 IST

గులాబ్‌ తుఫాన్‌ కారణంగా మంగళాపురం ఆయకట్టు ఛానల్‌కు చేపట్టిన పనులు ఈ ఏడాది సెప్టెంబరు 29న మళ్లీ కొట్టుకుపోయాయి. గత ఏడాది నివార్‌ తుఫాన్‌ కారణంగా కురిసిన భారీ వర్షాలకు ఛానల్‌ కొట్టుకుపోవడంతో 2,500 ఎకరాల్లో పంటలను రైతులు కోల్పోయారు. దీంతో గత రబీ సాగుకి స్వస్తి పలికారు.

ప్రశ్నార్థకమైన ఖరీఫ్‌ సాగు!
గులాబ్‌ తుఫాన్‌కి దెబ్బతిన్న మంగళాపురం ఆయకట్టు చెరువు

 గులాబ్‌ తుఫాన్‌కు కొట్టుకుపోయిన మంగళాపురం ఛానల్‌

2500 ఎకరాలకు అందని సాగునీరు  

ఆందోళనలో ఐదు గ్రామాల రైతులు 


బుచ్చెయ్యపేట, అక్టోబరు 17: గులాబ్‌ తుఫాన్‌ కారణంగా మంగళాపురం ఆయకట్టు ఛానల్‌కు చేపట్టిన పనులు ఈ ఏడాది సెప్టెంబరు 29న మళ్లీ కొట్టుకుపోయాయి. గత ఏడాది నివార్‌ తుఫాన్‌ కారణంగా కురిసిన భారీ వర్షాలకు ఛానల్‌ కొట్టుకుపోవడంతో  2,500 ఎకరాల్లో పంటలను రైతులు కోల్పోయారు. దీంతో  గత రబీ సాగుకి స్వస్తి పలికారు. కొట్టుకుపోయిన ఛానల్‌ను పునరుద్ధరించాలని పలు పర్యాయాలు  ఇరిగేషన్‌, ఇంజనీరింగ్‌ అధికారులకు మొరపెట్టుకున్నారు. నిధులు లేమి కారణంగా పనులు చేపట్టలేమని అధికారులు చేతెలెత్తేయడంతో  విశాఖ డెయిరీ రూ. 2 లక్షలు, ఐదు గ్రామాలకు చెందిన 3500 మంది ఆయకట్టు రైతులు రూ.4 లక్షలు మొత్తం రూ.6 లక్షలతో ఈ ఏడాది జూలైలో ఛానల్‌ను పునర్నిర్మించుకున్నారు.  దీంతో ఊపిరిపీల్చుకున్న బుచ్చెయ్యపేట మండలం మంగళాపురం, కుముందాంపేట, విజయరామరాజుపేట, చీడికాడ మండలం దండి సురవరం, దిబ్బపాలెం, చోడవరం మండలం లక్ష్మీపురం గ్రామాల రైతులు ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు చేపట్టారు. అయితే గులాబ్‌ తుఫాన్‌ కారణంగా కురిసిన భారీ వర్షాలకు పునర్నిర్మించుకున్న ఆయకట్టు ఛానల్‌ కొట్టుకుపోయింది. దీంతో కుడి, ఎడుమ కాలువ ద్వారా ప్రవహిస్తున్న కోనాం రిజర్వాయర్‌ నీరు వృథాగా కిందకు పోతోంది. ఖరీఫ్‌ సగం కాకముందే గ్రోయిన్‌ దెబ్బతినడంతో  2500 ఎకరాల్లో సాగు పూర్తిగా దెబ్బతిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  దీంతో పెట్టిన పెట్టుబడులు నష్టపోయామని గగ్గోలు పెడుతున్నారు. గత నివార్‌ దెబ్బకు నష్టాల్లో చిక్కుకున్న ఐదు గ్రామాల రైతులు ఈ ఏడాది అధిక వడ్డీలకు అప్పు చేసి  సాగు చేపట్టారు. ఛానల్‌ కొట్టుకుపోవడంతో ఈ సారీ పంట దక్కక అప్పులు పెరిగాయని వాపోతున్నారు.   

Updated Date - 2021-10-18T04:46:31+05:30 IST