కరోనా పరీక్షలకు క్యూ

ABN , First Publish Date - 2021-02-28T06:28:48+05:30 IST

కరోనా పరీక్షలు చేయించుకునేందుకు వస్తున్న వారి సంఖ్య మళ్లీ పెరుగుతోంది. దేశంలో కొద్దిరోజులుగా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడం, రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌ వుంటుందని కేంద్రం హెచ్చరికలు చేయడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు.

కరోనా పరీక్షలకు క్యూ


జిల్లాలో రెండు రోజుల కిందటి వరకు  రెండు వేల మందికి పరీక్షలు

ప్రస్తుతం మూడు వేల మందికి...

ప్రస్తుతానికైతే కేసుల సంఖ్యలో ఎటువంటి మార్పు లేదని అధికారుల ప్రకటన

మరో రెండు నెలలు

అప్రమత్తంగా ఉండాలని సూచన

అనుమానిత లక్షణాలుంటే

పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్న వైద్యులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కరోనా పరీక్షలు చేయించుకునేందుకు వస్తున్న వారి సంఖ్య మళ్లీ పెరుగుతోంది. దేశంలో కొద్దిరోజులుగా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడం,  రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌ వుంటుందని కేంద్రం హెచ్చరికలు చేయడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. కొద్దిరోజుల కిందటి వరకు వైరస్‌ లక్షణాలు వున్నప్పటికీ పట్టించుకోని వారంతా...ఇప్పుడు పరీక్షలు చేయించుకునేందుకు పరుగులు తీస్తున్నారు. గురువారం వరకు జిల్లాలో ప్రతిరోజూ రెండు వేల మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుంటే...శుక్రవారం నుంచి ఆ సంఖ్యను మూడు వేలకు పెంచారు. అయితే కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు పెంచినప్పటికీ...ప్రస్తుతానికైతే కేసుల్లో పెరుగుదల లేదని అధికారులు చెబుతున్నారు. గతంలో మాదిరిగానే పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ, మరో రెండు నెలలపాటు అప్రమత్తంగా వుండాలని సూచిస్తున్నారు. 

కొవిడ్‌ టెస్ట్‌ తప్పనిసరి.. 

దేశంలో కొద్దిరోజులుగా కేసులు పెరగడం, సెకండ్‌ వేవ్‌తో అప్రమత్తంగా వుండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన నేపథ్యంలో ఫ్లూ వంటి లక్షణాలతో వచ్చే రోగులను కరోనా పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో, అటువంటివారంతా తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు ఖాళీగా కనిపించిన కొవిడ్‌ పరీక్షా కేంద్రాల వద్ద ఇప్పుడు పదుల సంఖ్యలో జనం బారులుతీరి కనిపిస్తున్నారు.


కేసులు తక్కువే.. 

కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు పెంచినప్పటికీ... పాజిటివ్‌ కేసులు మాత్రం ఆ స్థాయిలో పెరగలేదని అధికారులు చెబుతున్నారు. గత రెండు, మూడు వారాల నుంచి 20 కంటే తక్కువగానే కేసులు నమోదవుతున్నాయని, సెకండ్‌ వేవ్‌పై ఆందోళన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే, అప్రమత్తంగా వుండడం తప్పనిసరి అని పేర్కొంటున్నారు. గత ఆరు రోజుల్లో జిల్లాలో 13 వేల మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, 52 మంది (0.04 శాతం)కి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. శుక్రవారం జిల్లాలో మూడు వేల మందికి పరీక్షలు నిర్వహించగా, 14 మంది (0.46 శాతం)కి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ గణాంకాలను బట్టి జిల్లాలో ఇంకా సెకండ్‌ వేవ్‌ ప్రారంభం కాలేదని చెప్పవచ్చునని, అయితే అప్రమత్తంగా వుండాలని మాత్రం అధికారులు సూచిస్తున్నారు.


కొత్తగా 14 కేసులు

విశాఖపట్నం, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శుక్రవారం కొత్తగా 14 కరోనా పాజిటివ్‌ కేసులు నమోద య్యాయి. వీటితో మొత్తం కేసులు 60,534కు చేరాయి. ఇందులో 59,961 మంది కోలుకోగా, మరో 34 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందు తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 539 మంది కొవిడ్‌ బారినపడి మృతిచెందారు.

Updated Date - 2021-02-28T06:28:48+05:30 IST