త్వరితగతిన మ్యూజియం నిర్మాణం

ABN , First Publish Date - 2022-06-28T05:44:57+05:30 IST

లంబసింగిలో గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని జాతీయస్థాయి కమిటీ సభ్యుడు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ కల్యాణ్‌ కుమార్‌ చక్రవర్తి సూచించారు.

త్వరితగతిన మ్యూజియం నిర్మాణం
మ్యూజియం నిర్మాణాల ప్రణాళికను వివరిస్తున్న టీడబ్ల్యూ ఎస్‌ఈ శ్రీనివాస్‌రావు

గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల శిల్పాలు, చరిత్రను పొందుపరచండి

జాతీయ స్థాయి కమిటీ సభ్యుడు డాక్టర్‌ కల్యాణ్‌ కుమార్‌ చక్రవర్తి


చింతపల్లి, జూన్‌ 27: లంబసింగిలో గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని జాతీయస్థాయి కమిటీ సభ్యుడు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ కల్యాణ్‌ కుమార్‌ చక్రవర్తి సూచించారు. సోమవారం ఆయన ఐజీఆర్‌ఎంఎస్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ కమల్‌ కుమార్‌ మిశ్రా, పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రోణంగి గోపాలకృష్ణతో కలిసి లంబసింగి, తాజంగి పంచాయతీలో పర్యటించారు. గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మిస్తున్న స్థలాన్ని వారు పరిశీలించారు. తొలుత స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణాల ప్లానింగ్‌ మ్యాప్‌ను గిరిజన సంక్షేమశాఖ ఎస్‌ఈ శ్రీనివాస్‌ వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కల్యాణ్‌ కుమార్‌ చక్రవర్తి మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రధానంగా ప్రవేశ ద్వారం, రెస్టారెంట్‌, యాంఫీ థియేటర్‌, కోర్‌ మ్యాజియాన్ని ప్రత్యేకంగా సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. మ్యూజియంలో గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల శిల్పాలు, చరిత్రను పొందుపరచాలని, ప్రధానంగా మ్యూజియంలో గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా తీర్చిదిద్దాలని సూచించారు. సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు స్వాతంత్య్ర సమరయోధుల చరిత్ర, ఆదివాసీల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు సులభంగా అర్థంచేసుకునే విధంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంస్కృతి పరిశోధన, శిక్షణ సంస్థ డైరెక్టర్‌ ఈశ రవీంద్రబాబు, గిరిజన సంక్షేమశాఖ ఈఈ డీవీఆర్‌ఎం రాజు, డీఈఈ చాణిక్యరావు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-28T05:44:57+05:30 IST