క్విట్ ఇండియా:విద్రోహాలు, విప్లవ స్ఫూర్తి

ABN , First Publish Date - 2022-08-07T06:33:10+05:30 IST

క్విట్ఇండియా ఉద్యమంలో కాంగ్రెస్, ఆరెస్సెస్, కమ్యూనిస్టుల పాత్ర గురించి కొన్ని వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరముంది. అప్పుడే ‘ఆజాది కా అమృతోత్సవ్’కి న్యాయం చేసినవారమవుతాము.

క్విట్ ఇండియా:విద్రోహాలు, విప్లవ స్ఫూర్తి

క్విట్ఇండియా ఉద్యమంలో కాంగ్రెస్, ఆరెస్సెస్, కమ్యూనిస్టుల పాత్ర గురించి కొన్ని వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరముంది. అప్పుడే ‘ఆజాది కా అమృతోత్సవ్’కి న్యాయం చేసినవారమవుతాము.


మొదట కాంగ్రెసు నాయకుల పాత్రని చూద్దాం. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో వలసపాలకులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ‘క్విట్ ఇండియా’ పిలుపునిచ్చింది. అప్పటికే జపాన్ సైన్యాలు బర్మాను ఆక్రమించి, ఇండియా సరిహద్దుల్లోకి చొచ్చుకువస్తున్నాయి. యుద్ధంలో తమకు సహకరిస్తే తర్వాత ఇండియాకు డొమినియన్ ప్రతిపత్తిని కల్పిస్తామని బ్రిటిష్ ప్రభుత్వం సర్ స్టాఫర్డ్ క్రిప్స్ ద్వారా పంపిన ప్రతిపాదనలను కాంగ్రెస్ తిరస్కరించింది. గాంధీ ఆ ప్రతిపాదనలను ‘పోస్ట్ డేటెడ్ చెక్’గా అభివర్ణించారు. యుద్ధంలో బ్రిటిష్ వారు గెలుస్తారన్న నమ్మకం గాంధీ మొదలైన కాంగ్రెస్ నాయకులకు లేదని దీనివల్ల అర్థమవుతుంది. యుధ్ధంలో ఎవరు గెలిస్తే వారితో అధికార బదిలీకి రాజీ బేరాలు సాగించుకోవటానికే క్విట్ ఇండియా పిలుపునిచ్చారు కానీ స్వాతంత్య్ర పోరాటాన్ని ముందుకు నడిపించే లక్ష్యంతో కాదని గాంధీ ప్రతిపాదించిన ఉద్యమ తీర్మానాన్ని, కాంగ్రెస్ కార్యాచరణను పరిశీలిస్తే స్పష్టమవుతుంది. జపాన్‌కు మరీ అనుకూలంగా ఉన్నట్లున్న గాంధీ ముసాయిదా తీర్మానాన్ని కాదని, నెహ్రూ ప్రతిపాదించిన మార్పులతో కూడిన తీర్మానాన్ని ఎఐసిసి ఆమోదించింది. నిజానికి క్విట్ ఇండియా నిర్ణయాన్ని నెహ్రూ మొదట గట్టిగా వ్యతిరేకించారు; రాజాజీ పూర్తిగా వ్యతిరేకించడమే కాకుండా కాంగ్రెస్ సభ్యత్వానికి సైతం రాజీనామా చేసారు.


అహింసావాది గాంధీ ‘డు ఆర్ డై’ అని ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఆనాటి పరిస్థితుల్లో ఇటువంటి పిలుపులు ప్రజల్లో, ప్రభుత్వంలో తీవ్ర ప్రతిస్పందన కలుగచేస్తాయన్న విషయం గాంధీ, ఇతర కాంగ్రెస్ పెద్దలు అంచనా వేయలేనిది కాదు. కనీసం తాము అరెస్టు కాకుండా, రహస్యంగా ఉండి నాయకత్వం అందించేందుకు కూడా కాంగ్రెస్ నేతలు ఎటువంటి ఏర్పాట్లూ చేసుకోలేదు. ‘కోర్టింగ్ అరెస్ట్’ వారికి అలవాటే కదా! ఉద్యమం ప్రారంభమయీ అవకముందే ఆసేతు హిమాచలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరినీ వలసపాలకులు అరెస్ట్ చేశారు. అలా వారు ఆ ఉద్యమం సాగిన మూడేళ్లూ జైళ్లలో కూర్చున్నారు. క్విట్ ఇండియా పిలుపులో కాంగ్రెసు నాయకుల ‘చేత’ అది, ‘చావు’ ప్రజలది. అయితే జపాన్ ఓటమి, బ్రిటన్ గెలుపు ఖాయమైనాయి. గాంధీ జైలు నుంచి వైస్రాయితో బేరసారాల ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. ‘తాము క్విట్ ఇండియా తీర్మానం చేసాము కానీ ఉద్యమాన్ని ప్రారంభించనే లేద’ని గాంధీ పేర్కొన్నారు. పోరాటంలో ఉన్న ప్రజల్ని విస్మరించి, క్విట్ ఇండియా తీర్మానాన్ని ఉపసంహరించుకుంటున్నామని ఆయన చివరకు ఏకపక్షంగా ప్రకటించారు! అంతకుముందు సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన ఉద్యమాలనూ గాంధీ ఇలాగే నిరంకుశంగా ఉపసంహరించారు. ఆ విధంగా క్విట్ ఇండియాలో గాంధీ, కాంగ్రెసుల పాత్ర కపటంతో కూడి ఉన్నదన్నది ఒక చేదు నిజం.


‘దేశభక్తి’లో తమను మించినవారు లేరని నమ్మించజూస్తున్న పాలక బీజేపీ మార్గదర్శక సంస్థ ఆరెస్సెస్, హిందూ మహాసభ క్విట్ ఇండియాని వ్యతిరేకించాయి. ప్రజల పోరాటాలకు మద్దతు ఇవ్వకుండా బ్రిటిష్ ప్రభుత్వానికి సహకరించాయి. ఉద్యమంలో పాల్గొనవద్దని, అసెంబ్లీలు, మున్సిపాలిటీలు వగైరా పదవుల్లో ఉన్న వారు వాటికే అంటిపెట్టుకు ఉండాలని హిందూ మహాసభ అధ్యక్షుడు వి.డి. సావర్కార్ ఆదేశించారు. ముస్లిం లీగ్‌తో జట్టుకట్టి బెంగాల్, పంజాబ్, సింధు ప్రావిన్స్‌లలో హిందూ మహాసభ సంకీర్ణ ప్రభుత్వాలు నడిపింది. ఈ ప్రభుత్వాలన్నీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని అణచివేశాయి. స్వాతంత్ర్య పోరాటంలో ఏనాడూ పాల్గొనని ఆరెస్సెస్ క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొనలేదు. ఈ ఉద్యమానికి దూరంగా ఉండాలని ఆరెస్సెస్ పెద్దలు తమ సభ్యులను ఆదేశించారు. దీన్ని బ్రిటిషు ప్రభుత్వం అభినందించింది. ఆ విధంగా నాటి ‘హిందుత్వ’ శక్తులు వలసపాలకులకు సహకరించి, స్వాతంత్ర్య పోరాటానికి 


ద్రోహం చేయడం మరో చేదు నిజం.

ఆనాటి భారత కమ్యూనిస్టు పార్టీ కూడా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనలేదు. అంతర్జాతీయ కర్తవ్యాలను, బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయ పోరాట కర్తవ్యాలను కలగాపులగం చేయటంవల్ల ఈ తప్పిదానికి పాల్పడింది. అయితే కాంగ్రెస్, ఆరెస్సెస్ వారివలె బ్రిటిషువారితో లాలూచీ పడలేదు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పి తీరాలి. ఆ యుద్ధ కాలంలో, నాటి భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ వర్గ సంకర విధానాలకు భిన్నంగా, తెలంగాణలో విప్లవధోరణి కల దేవులపల్లి వెంకటేశ్వర రావు నేతృత్వంలో, ప్రజా విప్లవ పోరాటం కొనసాగించారు. ఇతర చోట్లా అనేక మంది కమ్యూనిస్టులు అజ్ఞాతంలో ఉండి పార్టీ నిర్ణయాన్ని కాదని ఉద్యమంలో పాల్గొన్నారు. తమ విద్రోహాలను కప్పిపుచ్చి కాంగ్రెస్, బీజేపీ ఇప్పుడు నాటి కమ్యూనిస్టు పార్టీ చేసిన తప్పుగూర్చి అతిగా ప్రచారం చేస్తున్నాయి.


క్విట్ ఇండియా పిలుపునందుకున్న కోట్లాది ప్రజలు – ముఖ్యంగా రైతులు, కార్మికులు, మేధావులు, విద్యార్థులు, మహిళలు – విప్లవకరంగా ఉద్యమించారు. వలస పాలకుల అణచివేత చర్యలను, పోలీసు, మిలటరీ బలగాలను ఎదుర్కొని పోరాడారు. 50 వేలమంది ఈ పోరాటంలో ప్రాణాలర్పించారని జస్టిస్ రాజేంద్ర సచార్ రాసారు. ఉత్తరప్రదేశ్ బలియా వద్ద 130 మంది ఉద్యమకారుల్ని ప్రభుత్వం ఒకేసారి ఉరితీసిందంటే ప్రజల విప్లవకర పాత్ర, దానిపై బ్రిటిషు అణచివేత ఎలాంటివో అర్థమవుతుంది. దేశంలో అనేక చోట్ల ‘ప్రతి సర్కార్’ పేరుతో స్థానిక స్వతంత్ర ప్రభుత్వాల్ని ఏర్పాటుచేశారు. భారత ప్రజల సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయ ప్రజాతంత్ర విప్లవోద్యమాన్ని తుదికంటా ముందుకు తీసుకుని వెళ్ళడానికి అవసరమైన విప్లవ పరిస్థితులు పరిపక్వమైనాయనడానికి ఈ పరిణామం ఒక స్పష్టమైన ఉదాహరణ అని దేవులపల్లి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో విప్లవకరంగా పోరాడిన భారత ప్రజలకు జోహార్లు అర్పించడం మన విధ్యుక్తధర్మం. సామ్రాజ్యవాదం నేటికీ అనేక రూపాల్లో కరాళనృత్యం చేస్తోంది. క్విట్ ఇండియా లక్ష్యాలు సంపూర్ణంగా నెరవేరలేదు. జెండాలు, ఉత్సవాలూ ఉన్నాయి కానీ ‘అమృతం’ ప్రజలకు దక్కడం లేదు. ప్రజలు వాస్తవాలు తెలుసుకుని మరో ‘క్విట్ ఇండియా’ ఉద్యమానికి పూనుకోవాలి. అదే ఆ అమర వీరులకు నిజమైన నివాళి!


 సిహెచ్.ఎస్.ఎన్.మూర్తి

ప్రధాన కార్యదర్శి, ఎఫ్.ఐ.టి.యు.

(ఆగస్టు 8 ‘క్విట్ ఇండియా’ 80వ వార్షికోత్సవం

Updated Date - 2022-08-07T06:33:10+05:30 IST