ఆర్‌ఏ పురంపై ‘స్టే’కు సుప్రీం నిరాకరణ

ABN , First Publish Date - 2022-05-11T13:55:41+05:30 IST

స్థానిక రాజా అన్నామలైపురం (ఆర్‌ఏ పురం) గోవిందసామినగర్‌లో బకింగ్‌హామ్‌ కాలువపై ఆక్రమణ నివాసాల తొలగింపుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆక్రమణల

ఆర్‌ఏ పురంపై ‘స్టే’కు సుప్రీం నిరాకరణ

- ఆక్రమణదారులపై సీఎం స్పందన భేష్‌

- ప్రత్యామ్నాయ ఇళ్లు కేటాయిస్తామన్నారు కదా 

- సుప్రీంకోర్టు అభినందన


చెన్నై: స్థానిక రాజా అన్నామలైపురం (ఆర్‌ఏ పురం) గోవిందసామినగర్‌లో బకింగ్‌హామ్‌ కాలువపై ఆక్రమణ నివాసాల తొలగింపుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆక్రమణల తొలగింపును నిలిపివేస్తూ ఉత్తర్వులివ్వాలంటూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఏఎం కాన్విల్కర్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం ఉదయం ఈ పిటిషన్లు ధర్మాసనం ఎదుట విచారణకు రాగా ఆర్‌ఏ పురం ఆక్రమణల తొలగింపును నిరసిస్తూ ఓ వ్యక్తి ఆత్మాహుతి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని, నిర్వాసితులకు ముఖ్యమంత్రి ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయిస్తామని ప్రకటించినా అవి ప్రస్తుతం నివాసమున్న ప్రాంతానికి చాలా దూరమని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కాలిన్‌ కోన్‌సాల్వే్‌స వివరించారు. ప్రభుత్వం నిర్వాసితులకు ప్రత్యామ్నాయ సదుపాయాలు కల్పించలేదని కూడా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ... బకింగ్‌హామ్‌ కాలువ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన ఇళ్ళను తొలగించాలని మద్రాస్‌ హైకోర్టు 2011లో ఉత్తర్వులిచ్చిందని, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది. న్యాయస్థానం ఉత్తర్వుల మేరకే ప్రభుత్వం ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు చేపట్టిందని ఈ వ్యహారంలో తాము జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని, ఆక్రమణల తొలగింపు నిలుపుదల చేసేలా ఉత్తర్వులివ్వమని స్పష్టం చేసింది. ఆక్రమణదారుల ఇళ్ళను ఖాళీ చేయించడానికి ప్రభుత్వం తగిన గడువిచ్చి ఉంటుందనే తాము భావిస్తున్నామని, నిర్వాసితులకు ప్రత్యామ్నాయ స్థలాల్లో ఇళ్లను కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని తాము అభినందిస్తున్నామని పేర్కొంది. అయితే నిర్వాసితులకు ఇప్పటి వరకూ ప్రత్యామ్నాయ స్థలాను కేటాయించలేదని, అలాంటప్పుడు వారిని హఠాత్తుగా ఖాళీ చేయించడం అన్యాయమని పిటిషనర్‌ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ తొలుత ఆక్రమణల తొలగింపునకు సంబంధించిన నోటీసులను నిర్వాసితులు తీసుకోవాలని, అవసరమైతే తాత్కాలిక ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించేలా ప్రభుత్వానికి సూచించగలమని వ్యాఖ్యానించింది. అయితే ఆక్రమణల తొలగింపు న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను సక్రమంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. నిర్వాసితులకు ప్రత్యామ్నాయ స్థలాల్లో ఇళ్లను కేటాయించనున్నట్లు శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటించడం సాధారణమైన విషయం కాదని, నిర్వాసితులకు ఇంతకు మించిన భరోసా ఏముంటుందని ప్రశ్నించింది. ఇప్పటికే కొన్ని కుటుంబాలు ఇళ్లను ఖాళీచేశాయని, అలాంటప్పుడు తక్కిన కుటుంబాలు కూడా న్యాయస్థానం ఆదేశాలను పాటించి ఖాళీ చేయడమే సమంజసమని సూచించింది. ఈ వ్యవహారాన్ని శాసనసభలో ప్రస్తావించినప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆక్రమణల తొలగింపుపై ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. 2011లో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం తగిన భద్రతా ఏర్పాట్లతో ఆక్రమణలను తొలగించాలని, అదే సమయంలో ఇళ్లు కోల్పోయినవారిని కన్నగినగర్‌, సెమ్మంజేరి, పెరుంబాక్కంలో ఉన్న గృహనిర్మాణ సంస్థ భవనసముదాయాలకు తరలించాలని సూచించింది. వారికి కనీస సదుపాయాలన్నింటిని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదిలా ఉండగా ఆర్‌ఏ పురం ఆక్రమిత కట్టడాలను సకాలంలో తొలగించకుండా న్యాయస్థానం ఉత్తర్వులు ఉల్లంఘించారంటూ దాఖలైన పిటిషన్లపై విచారణను జూలై 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఈలోగా ఆక్రమణల తొలగింపుపై, నిర్వాసితులకు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై సమగ్రమైన నివేదికలను సమర్పించాలని ఆదేశించింది.


హైకోర్టుకు తొమ్మిది మంది న్యాయమూర్తులు

- సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం

  మద్రాస్‌ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పని చేస్తున్న తొమ్మిదిమందిని శాశ్వత న్యాయమూర్తులుగా ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం మంగళవారం ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా గోవిందరాజులు చంద్రశేఖరన్‌, వీరాస్వామి శివజ్ఞానం, గణేశన్‌ ఇళంగోవన్‌, ఆనంది సుబ్రమణ్యన్‌, కన్నమ్మాళ్‌ షణ్ముగ సుందరం, సాధి కుమార్‌ సుకుమార కరుప్‌, మురళీ శంకర్‌ కుప్పురాజు, మంజులా రామరాజు నల్లయ్య, తమిళ్‌సెల్వి టి.వాలయపాళయంలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని కొలీజియం ప్రకటించింది. అయితే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్‌ ఏఏ నక్కీరన్‌కు మాత్రం ఈ ఏడాది డిసెంబరు 3వ తేదీ వరకు అదే పదవీ కాలాన్ని పొడిగించింది. 

Read more