ఆర్‌ అండ్‌ బీ వెనకడుగు

ABN , First Publish Date - 2021-07-25T06:00:09+05:30 IST

జిల్లాలో ఆర్‌ అండ్‌ బీ రోడ్ల పనులు చేపట్టడానికి కాంట్రాక ్టర్లు ఎవరూ ముందుకు రావటం లేదు.

ఆర్‌ అండ్‌ బీ వెనకడుగు

రహదారుల పనులు చేపట్టడానికి ముందుకు రాని కాంట్రాక్టర్లు

నివర్‌ తుఫాన్‌ పనుల టెండర్లకు దూరం

డబ్ల్యూబీఎం పనులపైనా నిరాసక్తత

మెయింటినెన్స్‌ పనులపై అరకొరగా ఆసక్తి 

ప్రభుత్వం బిల్లులు చెల్లించదన్న భయంతోనే..

జిల్లాలో ఆర్‌ అండ్‌ బీ రోడ్లు అస్తవ్యస్తం 


జిల్లాలో ఆర్‌ అండ్‌ బీ రోడ్ల పనులు చేపట్టడానికి కాంట్రాక ్టర్లు ఎవరూ ముందుకు రావటం లేదు. టెండర్లు పిలిచినా సింగిల్‌ టెండర్‌ కూడా పడటం లేదు. ఫలితంగా రూ.250 కోట్ల పనులు అసలు మొదలే కాలేదు. ఈ రోడ్ల పనులు ఏడాదిగా ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉన్నాయి. కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడమే ఇందుకు కారణం. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాలో ఆర్‌ అండ్‌ బీ రోడ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు ప్రస్తుత ప్రభుత్వం చుక్కలు చూపించింది. బకాయిలను రాబట్టుకోవడానికి ఆర్‌ అండ్‌ బీ కాంట్రాక్టర్లు చేయని ప్రయత్నం లేదు. ఈ అనుభవాలకు తోడు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉండటంతో పనులు చేసినా బిల్లులు చేతికందవన్న అభిప్రాయంతో కాంట్రాక్టర్లు ఉన్నారు. గత ఏడాది నివర్‌ తుఫాన్‌ కారణంగా జిల్లాలో అర్‌ అండ్‌ బీ రోడ్లకు భారీగా డ్యామేజీ ఏర్పడింది. విజయవాడ, మైలవరం, నూజివీడు సర్కిల్స్‌ పరిధిలో దెబ్బతిన్న రోడ్లను అంచనా వేసిన ఆర్‌ అండ్‌ బీ రూ.50 కోట్ల సాయానికి ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనిపై ప్రభుత్వం కొంతకాలం తర్వాత అనుమతులిచ్చింది. అయితే నిధులను కేటాయించలేదు. అనుమతులు వస్తే నిధులను కేటాయించినట్టేనని ఆర్‌ అండ్‌ బీ అధికారులు అంటున్నారు. అయితే నిధులు కేటాయించకపోతే తమకు బిల్లులు చెల్లిస్తారన్న నమ్మకం లేదంటున్నారు కాంట్రాక్టర్లు. 


నో టెండర్‌

నివర్‌ తుఫాన్‌కు దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ కోసం జిల్లా ఆర్‌ అండ్‌ బీ సర్కిల్‌ పరిధిలో టెండర్లు పిలిచినా సింగిల్‌ టెండర్‌ కూడా పడలేదు. దీంతో ఆర్‌అండ్‌బీ సర్కిల్‌ అధికారులు నిర్ఘాంతపోయారు. కాంట్రాక్టర్లతో సంప్రదింపులు జరపగా ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందన్న గ్యారంటీ తమకు లేదని స్పష్టం చేశారు. గతంలో చేసిన పనులకు సంబంధించి బకాయిల విషయంలో తాము ఎన్నో ఇబ్బందుల కోర్చామని ఉన్నతాధికారులకు నివేదించారు. జనవరి, మార్చి నాటి బిల్లులు కూడా చెల్లించని విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. 


భారీ బడ్జెట్‌ పనులకూ దూరమే

జిల్లాలో డబ్ల్యూబీఎం లేయర్‌కు సంబంధించిన పనులను రూ.200 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచారు. ఈ పనుల్లో కూడా ఒక్క కాంట్రాక్టరూ పాలుపంచుకోలేదు. గతంలో తాము చేసిన అప్పులకు చక్రవడ్డీలు కట్టాల్సి వచ్చిందని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి ఏదో విధంగా బయటపడిన తర్వాత మళ్లీ అలాంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకోలేమన్నది కాంట్రాక్టర్ల మాట. ప్రతి ఏటా ఆర్‌ అండ్‌ బీ జిల్లా సర్కిల్‌ పరిధిలో ప్యాచ్‌ వర్క్‌లకు టెండర్లు పిలుస్తుంటారు. ఈ ఏడాది కూడా జిల్లాలో 4,500 కిలోమీటర్ల మేర ఆర్‌ అండ్‌ బీ రోడ్ల ప్యాచ్‌ వర్క్‌లకు టెండర్లు పిలిచారు. సాధారణంగా ప్యాచ్‌ వర్క్‌లకు వెంటనే ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. ఈసారి జిల్లాలో ప్రతిపాదించిన ప్యాచ్‌ వర్క్‌లకు ప్రభుత్వం సగం గ్రాంట్‌ను మాత్రమే ఇచ్చింది. మిగిలిన సగం తర్వాత ఇస్తామని చెప్పింది. దీంతో కాంట్రాక్టర్లు వెనకడుగు వేశారు. ప్రభుత్వం నుంచి తప్పకుండా మిగిలిన పేమెంట్‌ వస్తుందని ఆర్‌ అండ్‌ బీ జిల్లా సర్కిల్‌ ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో కొద్దిమంది ఆసక్తి చూపించారు. ఈ  పనులు కూడా ఒక్క విజయవాడ డివిజన్‌ పరిధిలోనే పూర్తి స్థాయిలో జరిగాయి. ఇతర డివిజన్లలో కాంట్రాక్టర్ల అనాసక్తత కారణంగా అంతగా పురోగతి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కాంట్రాక్టర్లకు భరోసా కల్పించి పెండింగ్‌ బిల్లులతో పాటు ఆన్‌ గోయింగ్‌ వర్క్స్‌కు కూడా సకాలంలో బిల్లులు చెల్లిస్తేనే కాంట్రాక్టర్లు ముందుకొస్తారు.. ఆర్‌ అండ్‌ బీ రోడ్లు బాగుపడతాయి.

Updated Date - 2021-07-25T06:00:09+05:30 IST