వసతి గృహాలను పరిశీలించిన ఆర్‌.కృష్ణయ్య

ABN , First Publish Date - 2021-03-01T04:08:31+05:30 IST

జడ్చర్లలోని బీసీ బాలికల వసతి గృహం, ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌ను ఆదివారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య సందర్శించారు

వసతి గృహాలను పరిశీలించిన ఆర్‌.కృష్ణయ్య
బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థులతో మాట్లాడుతున్న ఆర్‌.కృష్ణయ్య

జడ్చర్ల, ఫిబ్రవరి 28: జడ్చర్లలోని బీసీ బాలికల వసతి గృహం, ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌ను ఆదివారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య సందర్శించారు. వసతిగృహంలో నెలకొన్న సమస్యలను విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు. ఇంటిగ్రేటెడ్‌ హస్టల్‌లో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులతో ఇంటర్‌, డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఉండడమేంటని ప్రశ్నించారు. ప్రైవేట్‌ భవనంలో కొనసాగిన కళాశాలల బీసీ మేనేజ్‌మెంట్‌ హాస్టల్‌ను ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌లోకి మార్చారంటూ విద్యార్థులు ఆర్‌.కృష్ణయ్య దృష్టికి తీసుకెళ్లారు. మేనేజ్‌మెంట్‌ హాస్టల్‌కు పక్కా భవనం నిర్మించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటూ వినతి పత్రం అందజేశారు. అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వసతి గృహాలలో ఉంటూ చదువుకునే అవకాశాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆర్‌.కృష్ణయ్య అన్నారు. ఇంటర్‌, డిగ్రీ కళాశాలల విద్యార్థుల వసతి గృహం పక్కా భవనం అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-01T04:08:31+05:30 IST