పాలకుల మనుగడ కోసమే రాజద్రోహం కేసులు

ABN , First Publish Date - 2022-05-20T08:58:16+05:30 IST

‘‘స్వాతంత్య్ర పోరాటంలో భారతీయుల గొంతు నొక్కడానికి రాజద్రోహం చట్టాన్ని అమలు చేసిన బ్రిటిష్‌ వాళ్లే తమ దేశంలో ఈ చట్టాన్ని రద్దు చేశారు.

పాలకుల మనుగడ కోసమే రాజద్రోహం కేసులు

అప్పట్లోనే ఆ చట్టంపై పుచ్చలపల్లి సుందరయ్య పోరాటం

ఈ కేసులపై ‘సుప్రీం’ తీర్పు హర్షణీయం: ఆర్‌.నారాయణమూర్తి


విజయవాడ, మే 19 (ఆంధ్రజ్యోతి): ‘‘స్వాతంత్య్ర పోరాటంలో భారతీయుల గొంతు నొక్కడానికి రాజద్రోహం చట్టాన్ని అమలు చేసిన బ్రిటిష్‌ వాళ్లే తమ దేశంలో ఈ చట్టాన్ని రద్దు చేశారు. స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను సాధించి 75 ఏళ్లు అవుతున్న భారతదేశంలో ఇంకా ఈ చట్టాన్ని అమలు చేయడం దారుణం. హక్కులు, స్వేచ్ఛ కోసం పోరాడితే రాజద్రోహం అవుతుందా?’’ అని సినీనటుడు ఆర్‌.నారాయణమూర్తి ప్రశ్నించారు. రాజద్రోహం కేసులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. సీపీఎం నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి కార్యక్రమాన్ని బెజవాడ బార్‌ అసోసియేషన్‌ (బీబీఏ) ఆధ్వర్యంలో గురువారం విజయవాడలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణమూర్తి మాట్లాడుతూ కేవలం ప్రభుత్వాలు వాటి మనుగడ కోసమే  రాజద్రోహం చట్టాన్ని అమలు చేస్తున్నాయని విమర్శించారు. 


ఐపీసీలో 124(ఎ)ను దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని పేర్కొన్నారు. దేశంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం అన్ని వర్గాలు ఏకమై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రాజద్రోహం చట్టానికి వ్యతిరేకంగా పుచ్చలపల్లి సుందరయ్య ఆనాడే పోరాటం చేశారన్నారు. దక్షిణ భారతదేశంలో సీపీఎం విస్తరణ, ఎదుగుదలలో సుందరయ్య పాత్ర ఎనలేనిదని చెప్పారు. సుందరయ్య చివరి రోజుల వరకు ఆదర్శవంతంగా జీవించారని, భూస్వామి కుటుంబంలో పుట్టినా ఆ వర్గానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని తెలిపారు. వామపక్షాలన్నీ ఏకం కావాలని ఆయన చివరి రోజుల్లో ఆకాంక్షించేవారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తామని తిరుపతిలో మాట ఇచ్చిన ప్రధాని మోదీ దాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు అధికారం ఇచ్చింది మాట తప్పడానికి కాదని అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికి చురకలు వేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాటూరి రామయ్యతోపాటు బీబీఏ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T08:58:16+05:30 IST