శెట్టిపల్లె గ్రామసభలో రభస

ABN , First Publish Date - 2022-07-02T06:39:40+05:30 IST

తిరుపతి కార్పొరేషన్‌లో శెట్టిపల్లె పంచాయతీని విలీనం చేసే ప్రక్రియలో భాగంగా శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో పెద్దఎత్తున రభస చోటుచేసుకుంది.

శెట్టిపల్లె గ్రామసభలో రభస
గ్రామసభలో వాగ్వాదానికి దిగిన రైతులు, గ్రామస్తులు

నా సంతకం ఫోర్జరీ చేశారన్న సర్పంచ్‌

తిరుపతి కార్పొరేషన్‌లో విలీనంపై రైతుల అభ్యంతరం

గ్రామస్తుల్లో భిన్నాభిప్రాయాలు


తిరుపతి (రవాణా), జూలై 1: తిరుపతి  కార్పొరేషన్‌లో శెట్టిపల్లె పంచాయతీని విలీనం చేసే ప్రక్రియలో భాగంగా శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో పెద్దఎత్తున రభస చోటుచేసుకుంది. పంచాయతీ విలీన తీర్మానంపై తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని సర్పంచ్‌ గ్రామసభలోనే ఆరోపించడం దుమారం రేపింది. పంచాయతీని నగర పాలక సంస్థలో విలీనం చేయడానికి మెజారిటీ రైతులు అభ్యంతరం తెలిపారు. అదే సమయంలో గ్రామస్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. గ్రామసభకు రైతులను కాకుండా ఇతర గ్రామాల నుంచీ జనాన్ని తరలించి తమ అభిప్రాయాన్ని హైజాక్‌ చేశారన్న ఆరోపణలూ గ్రామస్తుల నుంచీ వినిపించాయి. శెట్టిపల్లె  అభివృద్ధి కోసమే నగర పాలకసంస్థలో విలీనం చేస్తున్నామని డిప్యూటీ మేయర్‌ భూమన అభినయ్‌రెడ్డి గ్రామసభలో ప్రకటించారు.  


శెట్టిపల్లె  నేపధ్యమిదీ....

తిరుపతి అర్బన్‌ మండల పరిధిలోని శెట్టిపల్లె  అన్‌ సెటిల్డ్‌ గ్రామం. అంటే ఈ గ్రామ పరిధిలోని భూముల సర్వే సెటిల్‌మెంట్‌ జరగలేదు. అందువల్ల ఇక్కడి వారికి తమ భూములపై క్రయవిక్రయాలకు సంబంధించిన హక్కులుండవు. 2015 వరకూ రిజిస్ట్రేషన్లు జరిగేవి. అన్‌ సెటిల్డ్‌ గ్రామం కావడంతో 2015 నుంచీ రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం నిషేధించింది. 2018లో టీడీపీ ప్రభుత్వం శెట్టిపల్లె  రైతులను ఒప్పించి ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా గ్రామంలోని సుమారు 650 ఎకరాల భూమిని సేకరించి అభివృద్ధి పరిచాక 30 శాతం రైతులకు తిరిగి ఇచ్చేలా ప్రతిపాదన చేసింది. తుడా ద్వారా భూమిని అభివృద్ధి పరిచేలా జీవో జారీ చేసింది. రైతులకు 30 శాతం భూమి వెనక్కు ఇవ్వనూ మిగిలిన భూమిలో రోడ్లు, పార్కులు వంటివి పోనూ మిగతా భూమిని ఐటీ పరిశ్రమలకు లేదా కంపెనీలకు కేటాయించి ఎకనమిక్‌ సిటీగా మార్చాలనే ప్రయత్నం జరిగింది.అయితే2019 ఎన్నికల్లో ప్రభు త్వం మారడంతో ఈ ప్రతిపాదన పెండింగ్‌లో పడింది.తిరుపతి నగర పాలకసంస్థ రంగంలోకి దిగింది. శెట్టిపల్లె  భూములను అభివృద్ధి చేయడానికి తుడాలో నిధులు లేవని, అందువల్ల నగర పాలకసంస్థ పరిధిలోకి విలీనం చేస్తే నిధులు పుష్కలంగా వున్నందున సులభంగా అభివృద్ధి జరుగుతుందని ప్రతిపాదించారు.ఆరు నెలల కిందట శెట్టిపల్లె  పంచాయతీ సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి సంతకాలు చేసిన తీర్మానం నగర పాలక సంస్థకు చేరింది. దాన్ని సంస్థ ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వం కలెక్టర్‌కు పంపి నివేదిక కోరింది. అయితే గ్రామసభ నిర్వహించకుండా పంచాయతీ పాలకవర్గం ఏకపక్షంగా తీర్మానం చేయడం నిబంధనలకు విరుద్ధం కావడంతో శుక్రవారం గ్రామసభ నిర్వహించారు.


నగర పాలకసంస్థలో విలీనానికి అంగీకరించేది లేదు!

శెట్టిపల్లిలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో తమ పంచాయతీని తిరుపతి నగర పాలకసంస్థ పరిధిలో విలీనం చేయడానికి అంగీకరించే ప్రసక్తే లేదని మెజారిటీ రైతులు తేల్చి చెప్పారు. అసలు గ్రామసభ జరపకుండా పంచాయతీ పాలకవర్గం ఎలా తీర్మానం చేసిందని నిలదీశారు. ఈ విషయమై మెజారిటీ గ్రామస్తులు పాలకవర్గంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సర్పంచ్‌ వీరమ్మ తన సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేశారని, తనకు తెలియకుండానే తీర్మానం చేశారని ఆరోపించారు. దీంతో సభలో దుమారం రేగింది. దానికి తోడు అధికార పార్టీ నేతలు గ్రామసభకు చుట్టుపక్కల గ్రామాల నుంచీ జనాన్ని తరలించారు. అలాంటి వారు విలీనానికి మద్దతు తెలిపారు. దీంతో శెట్టిపల్లె  రైతులు మండిపడ్డారు. భూముల అభివృద్ధికి తుడాలో నిధులు లేకపోతే రూ. 50 కోట్లు మంజూరు చేసే సత్తా సీఎం జగన్‌కు లేదా అని ప్రశ్నించారు. తుడా ద్వారానే ల్యాండ్‌ పూలింగ్‌ జరపాలని మెజారిటీ రైతులు పట్టుబట్టారు. మరికొందరు ల్యాండ్‌ పూలింగ్‌ పూర్తయ్యాకే కార్పొరేషన్‌లో విలీనం చేయాలని వాదించారు. విలీన ప్రతిపాదనపై అభిప్రాయం చెప్పాలని అధికారులు కోరగా పక్క గ్రామం నుంచీ వచ్చిన వారు చేతులెత్తి మద్దతు తెలిపారు. దీంతో శెట్టిపల్లె  రైతుల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా పంచాయతీ పరిధిలోని మెజారిటీ జనం అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని గ్రామసభను ముగించారు. గ్రామసభకు తిరుపతి కార్పొరేషన్‌ నుంచి డిప్యూటీ మేయర్‌ భూమన అభినయ్‌రెడ్డి హాజరయ్యారు. కాగా ఈ తీర్మానానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని, ఈ ప్రక్రియను అడ్డుకుంటామని రైతులు హెచ్చరించారు.


అనాధీన భూములపై వైసీపీ నేతల కన్ను?

శెట్టిపల్లె పంచాయతీ పరిధిలో సుమారు 650 ఎకరాల భూములున్నట్టు అధికారులు గుర్తించారు. వాటిని సేకరించి అభివృద్ధి పరిచేందుకే ల్యాండ్‌ పూలింగ్‌ విధానాన్ని గత టీడీపీ ప్రభుత్వం అమలు చేసేందుకు ప్రయత్నించింది. అయితే ఇపుడు తుడా ద్వారా కాకుండా నగర కార్పొరేషన్‌ రంగప్రవేశం చేయడం వెనుక అధికార పార్టీ ముఖ్యనేతల స్కెచ్‌ వుందని రైతులు భావిస్తున్నారు. ఎందుకంటే రైతులు సాగు చేసుకుంటున్న 650 ఎకరాల భూములు కాకుండా సుమారు 40 ఎకరాలకు పైగా అనాధీన భూములు శెట్టిపల్లె భూములతో కలసి వున్నాయని చెబుతున్నారు. శెట్టిపల్లె భూములను కార్పొరేషన్‌ రోడ్లు వేసి అభివృద్ధి పరిస్తే అనాధీన భూములకు కూడా విలువ విపరీతంగా పెరిగిపోతుందని, ఆ భూములను కాజేసే ఉద్దేశంతోనే అధికార పార్టీ నేతలు కార్పొరేషన్‌లో వినీన ప్రతిపాదనను తెరమీదకు తెచ్చారని ఆరోపిస్తున్నారు.

Updated Date - 2022-07-02T06:39:40+05:30 IST