యాసంగిపై సందిగ్ధం

ABN , First Publish Date - 2020-12-02T04:52:14+05:30 IST

యాసంగి సాగు సమయం సమీపిస్తోంది. వానాకాలంలో మొదటి పంటగా వరి, పత్తి, మిర్చి పంటలు సాగు చేసిన ఎన్నెస్పీ కల్లూరు డివిజన్‌ పరిధిలోని రైతులు రెండోపంటలు వేసేందుకు సిద్ధమయ్యారు.

యాసంగిపై సందిగ్ధం

సాగునీటి సరఫరా షెడ్యూలు ప్రకటించని ప్రభుత్వం

రెండోపంటపై ఆశలు పెంచుకున్న రైతులు 

కల్లూరు డివిజన్‌లో నార్లు పోసిన అన్నదాతలు

సాగునీరందించాలని అధికారులకు వినతి

కల్లూరు, డిసెంబరు 1: యాసంగి సాగు సమయం సమీపిస్తోంది. వానాకాలంలో మొదటి పంటగా వరి, పత్తి, మిర్చి పంటలు సాగు చేసిన ఎన్నెస్పీ కల్లూరు డివిజన్‌ పరిధిలోని రైతులు రెండోపంటలు వేసేందుకు సిద్ధమయ్యారు. అయితే వానాకాలం సీజన్‌లో అధిక వర్షాలతో పంటలు దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయిన రైతులు.. గంపెడాశతో యాసంగిలో రెండోపంట పండించేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలోనే కల్లూరు డివిజన్‌ పరిధిలోని రైతులు వరిసాగుకు నార్లు పోశారు. కానీ సాగర్‌ ఎడమకాల్వ ద్వారా రెండోపంటకు సాగునీటి విడుదలపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది. అసలే మొదటి పంట అధిక వర్షాలతో దెబ్బతిని తీవ్రంగా నష్టపోయి పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఉన్న దశలో యాసంగి సాగుపై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. 

నాగార్జున సాగర్‌లో పుష్కలంగా నీరు..

ఎన్నెస్పీ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. నాగార్జునప్రాజెక్టులో మంగళవారం నాటికి 590అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టానికి గాను 589.50అడుగుల వరకు ఉంది. డ్యాంలో పుష్కలంగా నీరున్న దృష్ట్యా ప్రభుత్వస్థాయిలో సాగర్‌ఎడమకాల్వ పరిధిలో రెండోజోన్‌కు సత్వరమే నీటి సరఫరాపై షెడ్యూలు విడుదల చేయాల్సిన అవసరముంది. కానీ దీనిపై ప్రభుత్వం నుంచి గానీ, అధికారుల నుంచి గానీ ఎలాంటి స్పష్టత లేకపోవడంతో రెండోజోన్‌లో యాసంగి పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. రైతులు కూడా రెండోపంట సాగుపనులపై దృష్టి పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. 

నారుమడులకు నీరందించాలని రైతుల వినతి...

యాసంగి సాగుకు ముందస్తుగానే నార్లు పోశామని, నీరు లేక నార్లు ఎండిపోతున్నాయని సత్వరమే సాగునీరందించి నార్లు కాపాడాలని కోరుతూ మంగళవారం డివిజన్‌ పరిధిలోని చండ్రుపట్ల, పాయపూర్‌, ముచ్చవరం, రఘునాథబంజర్‌, యర్రబోయినపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఈఈ కార్యాలయానికి తరలివచ్చి వినతిపత్రం అందజేశారు. మొదటి పంటగా వరిసాగుచేసి తీవ్రంగా నష్టపోయామని, కనీసం రెండోపంటనైనా పండించి కొంత మేర నష్టాన్ని పూడ్చుకోవచ్చని భావిస్తున్నామని పేర్కొన్నారు. సత్వరమే సాగునీరందించి ఆదుకోవాలని రైతులు వల్లభనేని రవి, కాటమనేని కృష్ణారావు, వల్లభనేని శ్రీనివాసరావు, దొడ్డపనేని రవి తదితరులు అధికారులను కోరారు.  

Updated Date - 2020-12-02T04:52:14+05:30 IST