Advertisement

మద్దతు ధర దక్కదా..?

Apr 23 2021 @ 01:26AM

  • రబీ రైతుకు దక్కని గిట్టుబాటు ధర 
  • 75 కేజీల బస్తా వెయ్యి నుంచి రూ.1100 
  • ఎట్టకేలకు  ప్రారంభమైన కొనుగోలు కేంద్రాలు 
  • ఇప్పటివరకు ఒక్క గింజా కొనలేదు 

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

రబీ వరి రైతు పరిస్థితి దయనీయంగా తయారైంది. నీటి ఎద్దడితో నానా కష్టాలు పడి ధాన్యం పండించిన రైతుకు మద్దతు ధర లభించడం లేదు. ఇప్పటికే జిల్లాలో 37 శాతం కోతలు పూర్తయ్యాయి. కానీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఎట్టకేలకు గురువారం మొదలయ్యాయి. సుమారు 272 కొను గోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించినా ఇంతవరకు ఎక్కడా ఒక గింజ కూడా కొనలేదు. కొనుగోలు కేంద్రాలు ఆలస్యం కావడంతో ధాన్యం కమిషన్‌ దార్లు, మిల్లర్లు, రైతును ఇష్టానుసారం దోచుకుంటున్నారు.  కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం 100 కేజీల గ్రేడ్‌ ఎ రకానికి రూ.1888 వరకు ఇవ్వాలి. కామన్‌ రకానికి రూ.1868 ఇవ్వాలి. అంటే 75 కేజీల బస్తాకు రూ.1300 నుంచి రూ.1400 వరకు ఇవ్వాలి. కానీ వెయ్యి నుంచి రూ.1100 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు, నగదు కూడా వెంటనే ఇవ్వడంలేదు. దీంతో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. రబీ సీజన్‌ కింద జిల్లాలో సుమారు 4 లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. 13.5 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తిని లక్ష్యంగా నిర్ణయించారు. మెట్ట ప్రాంతంలోను, ఈస్ట్రన్‌ డెల్టాలోను ఎకరానికి 40 నుంచి 45 బస్తాల ఽధాన్యం దిగుబడి ఉంది. వాస్త వానికి ఈస్ట్రన్‌ డెల్టాలో ఇంకా దిగుబడి రావాలి. నీటిఎద్దడి వల్ల చాలాచోట్ల పంట దెబ్బతింది. ఇప్పటికే ఈస్ట్రన్‌ కాలువలు కట్టేసినట్టు తెలిసింది. మెట్ట, తూర్పుడెల్టా, ఏజెన్సీ ప్రాంతాల్లో మాసూళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. కోనసీమలో మాత్రం ఇంకా ఊపందుకోలేదు. మే 2వ వారం వరకు కోతలు కొనసాగే అవకాశం ఉంది. నీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రైతాంగానికి కనీస మద్దతు ధర లభించినా బాగుండేది. కానీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా మొదలుకావడంతో ప్రైవేట్‌ వ్యాపారులు దోచుకున్నారు. దీంతో కనీస పెట్టుబడి కూడా రావడంలేదని ముగ్గళ్ల గ్రామానికి చెందిన కౌలు రైతు గెడ్డం రాంబాబు తెలిపారు. ఎకరానికి కౌలు రూ.32 వేలు ఇవ్వాల్సి వస్తుందని, పెట్టుబడి రూ.30 వేలు అవుతుందని ఆయన తెలిపా రు. ఇక అసలే కష్టాల్లో ఉన్న రైతును వాన కూడా దెబ్బతీసింది. సరైన ధర లేక కళ్లాల్లోని ఽధాన్యాన్ని కొందరు రైతులు నిల్వ చేస్తున్నారు. కొందరు రోడ్లపై ఆర బోస్తున్నారు. కానీ గురువారం సాయంత్రం గాలి దుమ్ము వర్షం రావడంతో రైతులు గిజగిజలాడిపోయారు. రైతులు కొంతవరకు టార్పెన్లు కట్టి కొంతవరకు ధాన్యం కాపాడుకున్నారు. ఒకపక్క ధరలు లేక గిజగిజలాడుతున్న రైతును ఈ వర్షాలు మరింత కుంగదీశాయి.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.