నేటి నుంచి రబీ...

ABN , First Publish Date - 2022-10-01T07:19:57+05:30 IST

రైతన్నకు ఖరీఫ్‌ కలిసి రాలేదు. సీజన్‌ ఆరంభంలో వర్షాలు కురిసినప్పటికీ తరువాత ముఖం చాటేశాయి. ప్రధాన పంటలు సాగు కాని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ఆశలన్నీ రబీపైనే పెట్టుకున్నారు. శనివారం నుంచి రబీ ప్రారంభం కానుంది. జిల్లాలో

నేటి నుంచి రబీ...

వ్యవసాయశాఖ సాగు ప్రణాళిక సిద్ధం

సాధారణ విస్తీర్ణం 1,47,500 హెక్టార్లు

(కడప - ఆంధ్రజ్యోతి): రైతన్నకు ఖరీఫ్‌ కలిసి రాలేదు. సీజన్‌ ఆరంభంలో వర్షాలు కురిసినప్పటికీ తరువాత ముఖం చాటేశాయి. ప్రధాన పంటలు సాగు కాని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ఆశలన్నీ రబీపైనే పెట్టుకున్నారు. శనివారం నుంచి రబీ ప్రారంభం కానుంది. జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 1,47,500 హెక్టార్లు. అయితే ఉమ్మడి వైఎస్సార్‌ కడప జిల్లాలో 1,81,615 హెక్టార్లలో పంటలు సాగు కానున్నాయి. ప్రధానంగా వేరుశనగ, బుడ్డశనగ సాగు చేస్తారు. ఉమమ్మడి జిల్లాకు సంబంధించి 57,149 క్వింటాళ్ల విత్తనాలకు వ్యవసాయశాఖ ప్రతిపాదనలు పంపింది. బుడ్డశనగ సుమారు 29,900 క్వింటాళ్లు అవసరమని, 15,780 టన్నుల ఎరువులు కావాలని  వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది.


రబీపైనే ఆశలు

రైతన్న ప్రతి యేటా అతివృష్టి లేదా అనావృష్టితో దెబ్బతింటున్నాడు. గత ఏడాది నవంబరులో కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పట్లో అన్నమయ్య డ్యాం, పింఛా ప్రాజెక్టు తెగిపోవడం, చెరువులు, కుంటలకు గండ్లు పడ్డంతో పెద్ద ఎత్తున పంట దెబ్బతింది. కనీసం సాగు పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాలు ఆశాజనకంగా కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీనికి తగ్గట్లుగానే మే చివరి వారంలో వర్షాలు కురవడంతో ఖరీఫ్‌పై రైతులు ఆశలు పెట్టుకున్నారు. ప్రాజెక్టుల్లో నీరుండడంతో ప్రభుత్వం ముందస్తు ఏరువాక పేరుతో ప్రాజెక్టుల వారీగా నీటిని విడుదల చేస్తామని చెప్పుకొచ్చింది. అయితే పంటలు సాగు చేస్తే సాగు పెట్టుబడులు రావన్న భయంతో నీళ్లున్నప్పుడు కూడా ప్రధాన పంట అయిన వరి సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపలేదు. ప్రాజెక్టుల వారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ముందస్తు తేదీలు ప్రకటించినా రైతులు సుముఖత చూపించలేదు. దీంతో తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలో నీటి విడుదలను కొద్దిరోజులు వాయిదా వేశారు. జూన్‌లో వానలు కురిసినప్పటికీ పంటలు విత్తనం వేయడానికి అవసరమైనప్పుడు వర్షాలు కురవలేదు. దీంతో ఈ ఏడాది ఖరీఫ్‌ రైతులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రైతులంతా రబీ పైనే ఆశలు పెట్టుకున్నారు. 

ఈ సీజన్‌లో బుడ్డశనగ ప్రధానంగా సాగు చేస్తారు. దీంతో పాటు వరి, వేరుశనగ సాగు కానుంది. ప్రొద్దుటూరు, కమలాపురం, మైదుకూరు, పులివెందుల, ముద్దనూరు ప్రాంతాల్లో బుడ్డశనగ ఎక్కువగా సాగు చేస్తుంటారు. 97,500 ఎకరాల్లో బుడ్డశనగ, 7,500 ఎకరాల్లో వేరుశనగ, 8,500 ఎకరాల్లో వరి సాగు కానున్నాయి. వీటితో పాటు స్వల్పంగా ఇతర పంటలు సాగులో ఉంటాయి.  వైఎస్సార్‌ కడప జిల్లాకు సంబంధించి 29,900 క్వింటాళ్ల బుడ్డశనగ విత్తనాలు అవసరమని ప్రతిపాదనలు పంపించారు. వేరుశనగ నారాయణ రకం 600 క్వింటాళ్లు, కే6 రకం 3,500 క్వింటాళ్లు, టీఏసీ-24 రకం 400క్వింటాళ్లు కలిపి 4500 క్వింటాళ్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఇక అన్నమయ్య జిల్లాలోని రాజంపేట, రైల్వేకోడూరు, రాజంపేటకు సంబంధించి వ్యవసాయశాఖ అధికారులు 80,030 ఎకరాలు సాగు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు గాను 17,279 క్వింటాళ్లు అవసరమని వ్యవసాయ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో వరి 4,430 క్వింటాళ్లు, వేరుశనగ కే6, నారాయణ రకం కలిపి 11,107 క్వింటాళ్లతో పాటు ఇతర విత్తనాలు అవసరమని పంపించారు. మొత్తానికైతే రబీ అయినా రైతుల ఆశలు నెరవేరుస్తుందో లేదో చూడాలి.


రబీకి సిద్ధంగా ఉన్నాం

- నాగేశ్వరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి 

రబీకి వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంది. అవసరమైన విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలు ఇస్తాం. వీటిని రైతులు ఉపయోగించుకోవాలి.

Updated Date - 2022-10-01T07:19:57+05:30 IST