నగదు అందక.. నాగలి కదలక..!

ABN , First Publish Date - 2021-07-24T04:48:54+05:30 IST

నగదు అందక.. నాగలి కదలక..!

నగదు అందక.. నాగలి కదలక..!
ధాన్యం విక్రయిస్తున్న రైతులు(ఫైల్‌)

- రబీ ధాన్యం బకాయిలు రూ.14.79 కోట్లు

- మూడు నెలలుగా అన్నదాతల ఎదురుచూపు  

(ఇచ్ఛాపురం)

రబీ సీజన్‌కు సంబంధించి అన్నదాతలకు ధాన్యం బకాయిల చెల్లింపులో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. రైతులు ఉత్పత్తులను దళారులకు విక్రయించి  ఆర్థికంగా నష్టపోకుండా... మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏటా ధాన్యం సేకరిస్తోంది. పంట కొనుగోలు చేసిన రెండు రోజుల్లో రైతు బ్యాంకు ఖాతాలో నేరుగా నగదు జమ చేస్తామని ప్రకటించింది. కానీ, సకాలంలో నగదు చెల్లించకపోవడంతో రైతులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. రబీ సీజన్‌లో 2,331 మంది రైతుల నుంచి 20.236 వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. వీటికి సంబంధించి రూ.37.52 కోట్లు చెల్లించాల్సి ఉండగా... ఇప్పటివరకు అన్నదాతల ఖాతాల్లో రూ.23.08 కోట్లు జమ చేశారు. ఇంకా 846 మంది రైతులకు రూ.14.79 కోట్ల మేర బకాయి చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం ఖరీప్‌ సీజన్‌ కూడా ప్రారంభమైంది. అయినా, అన్నదాతల ఖాతాలకు ఇప్పటి వరకూ ధాన్యం విక్రయించిన నగదు జమ కాలేదు. నగదు కోసం రైతుభరోసా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ పేర్లు నమోదు చేసి.. మిల్లు యజమానులు బిల్లులు అఫ్రూవల్‌ చేస్తారు. వాటికి జిల్లా స్థాయిలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ ఆమోద ముద్ర వేస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయినా, రైతు ఖాతాల్లో మాత్రం డబ్బులు పడడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మూడు నెలలుగా ఎదురుచూస్తున్నా, ప్రభుత్వం బకాయిలు మంజూరు చేయడం లేదని వాపోతున్నారు. రబీ సీజన్‌లో చేసిన అప్పులు ఎలా తీర్చాలో.. ఖరీఫ్‌ సాగుకు పెట్టుబడి ఎక్కడి నుంచి తేవాలో.. అర్థం కాక సతమతమవుతున్నారు. ఈ విషయమై పౌరసరఫరాల సంస్థ డీఎం ఎన్‌.నరేంద్రబాబు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. వారం రోజుల్లో ధాన్యం బకాయిలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. 

Updated Date - 2021-07-24T04:48:54+05:30 IST