రాచబాట...!

ABN , First Publish Date - 2022-03-11T09:35:24+05:30 IST

మీకునచ్చినా లేకున్నా నరేంద్రమోదీ ఇంకొంత కాదు, మరెంతోకాలం అక్కడే ఉంటారన్న నిజాన్ని ఇప్పటికైనా జీర్ణించుకోండి అని ఓ సీనియర్ రాజకీయ విశ్లేషకుడు మీడియా చర్చలో భాగంగా వ్యాఖ్యానించాడు...

రాచబాట...!

మీకునచ్చినా లేకున్నా నరేంద్రమోదీ ఇంకొంత కాదు, మరెంతోకాలం అక్కడే ఉంటారన్న నిజాన్ని ఇప్పటికైనా జీర్ణించుకోండి అని ఓ సీనియర్ రాజకీయ విశ్లేషకుడు మీడియా చర్చలో భాగంగా వ్యాఖ్యానించాడు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మోదీకి తిరుగులేదన్న మరింత బలమైన నమ్మకమైన వాదనతో పాటు, రేపోమాపో కాకున్నా ఎప్పటికైనా ఢిల్లీ రావడానికి వీలుగా యోగి రూపంలోని బలమైన మాస్ నేత సిద్ధమవుతున్నాడన్న విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. రెండేళ్ళ తరువాత జరిగే సార్వత్రక ఎన్నికల ఫలితాల మీద మీకు ఇంకా ఏమైనా అనుమానాలు మిగిలున్నాయా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.


ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో విజేత ఎవరన్న ప్రశ్నకు సమాధానం సుస్పష్టం. పంజాబ్‌లో ఎలాగూ బీజేపీది వెనుక సీటే కనుక, మిగతా నాలుగు రాష్ట్రాల్లోనూ ఓట్లలోనూ, సీట్లలోనూ దానిదే అగ్రస్థానం కావడం విశేషం. తాను అధికారంలో ఉన్న నాలుగు రాష్ట్రాల్లోనూ సహజమైన ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకొని నిలబడింది. ఈ మారు కరోనా మహావిషాదాల వల్ల జాతకాలు తిరగబడవచ్చునని కొందరు అనుమానించకపోలేదు. మరీ ముఖ్యంగా, ఉత్తర్‌ప్రదేశ్‌లో అధిక కరోనా మరణాలు, పతనమైన ఆర్థికం, దెబ్బతిన్న గ్రామీణవ్యవస్థ, పంటను నాశనం చేస్తున్న గోమందల సమస్య వంటివి యోగి విజయావకాశాలను సన్నగిల్లదీస్తాయని అనుకున్నమాట నిజం. ఫలితాల అనంతరం ఆ పార్టీ ప్రదర్శిస్తున్న బుల్డోజర్ స్థాయిలో దూసుకుపోలేకపోయినా, సమాజ్‌వాదీ సవాలును బాగానే తట్టుకుంది. పాతతరహా ఆలోచనలనుంచి బయటకు వచ్చి, యాదవేతర కులాల నాయకులను కూడా దువ్వడం ద్వారా అఖిలేష్ చక్కని ప్రయత్నం చేసిన మాట వాస్తవం. కాకలుతీరిన బీసీ నేతలను సమయం చూసి మరీ బీజేపీనుంచి లాగేస్తూ అఖిలేశ్ మంచి పోరాటం చేసినందున ఎన్నికలకు కాస్త ముందువరకూ విజయం ఆయన పక్షాన ఉన్నట్టుగానే కనిపించింది. కానీ, చివరిదశలో మోదీ విస్తృత పర్యటనలతో, బీజేపీ ఆధ్యాత్మిక, రాజకీయ ప్రతిదాడులతో పరిస్థితి తారుమారైంది. బీజేపీకి సీట్లు తగ్గినా, ఐదేళ్ళనాటికంటే ఓట్లశాతం ఎక్కువ ఉండటం, జాట్లు, యాదవులు, దళితులు సహా అనేక కులాలవారిని ఆకర్షించగలగడం గమనించాలి. పాఠశాలలు, రహదారుల వంటి విస్తృత ప్రజోపయోగ అంశాలకంటే, గ్యాస్ సిలండర్లు, బ్యాంకు ఖాతాలు, మరుగుదొడ్లు, నీటి కనెక్షన్లవంటి వ్యక్తిగత సౌకర్యాలు, సంక్షేమాలు యోగికి ఓట్లు కురిపించాయని అంటారు. ఇక భావోద్వేగాలకూ, కుల మత పాచికలకూ కొదవేలేదు.


పంజాబ్‌లో కాంగ్రెస్ ఘోర పరాజయం స్వయంకృతం. ఎన్నికలు ఏడాది ఉండగా, సిద్దూ వంటి ఓ చపలచిత్తుడి మాట విని, కెప్టెన్ అమరీందర్‌ను పోగొట్టుకున్న కాంగ్రెస్ ఆ తరువాత కూడా సిద్దూ విన్యాసాలను భరిస్తూ, దళిత సీఎం చన్నీ ఓట్లు తెస్తాడని నమ్మింది. దూకుడు సిద్దూ, మెత్తని చన్నీ ముంచేశారు. కేజ్రీవాల్ పార్టీ ఇంతటి ప్రభంజనం సృష్టిస్తుందని ఊహించనట్టుగానే, బీజేపీతో చేతులు కలిపిన అమరీందర్ కూడా ఇంత చతికిలబడిపోతారని అనుకోలేదు. ఈ ఫలితాల తరువాత జాతీయపార్టీగా పిలిపించుకొనే అర్హతను కాంగ్రెస్ కోల్పోయిందనీ, రాహుల్, ప్రియాంక రాజకీయసమర్థతలను ఇక ఎవరూ విశ్వసించరని విశ్లేషకుల అభిప్రాయం. చురకత్తుల్లాంటి యువనేతలను పొగబెట్టి పంపించేసిన వృద్ధనేతలంతా ఇకపై ఏం చేస్తారో, ఎన్ని లేఖలు రాస్తారో చూడాలి. పరిమిత అధికారాలు, విస్తృత రాజకీయాలు ఉన్న ఢిల్లీ ఆవల పంజాబ్‌లో ఆప్ సాధించిన ఘన విజయం కేజ్రీవాల్‌కు మాత్రమే కాక బలమైన ప్రత్యామ్నాయం కోసం పరితపిస్తున్న చాలామందికి సంతోషం కలిగించింది. మూడేళ్ళక్రితం ఒకే ఒక్క ఎంపీని గెలిపించుకోగలిగిన పార్టీ ఇప్పుడు మంచి మెజారిటీతో అధికారంలోకి రాగలగడం వెనుక కేజ్రీవాల్ హామీలూ వ్యూహాలతో పాటు కాంగ్రెస్ అసమర్థతలూ, కుమ్ములాటలూ కారణం. భావి ప్రధానిగా ఇప్పటికే కేజ్రీవాల్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్న ఆయన పార్టీకి ఇక అడ్డూఆపూ ఉండదు. 2029లో హస్తిన పోరు యోగి వర్సెస్ కేజ్రీ అని అప్పుడే ప్రచారం ఆరంభమైంది. ఈ ఎన్నికల ఫలితాలు సానుకూలంగా ఉండటంతో రాష్ట్రపతి ఎన్నికల్లోనే కాదు, రాబోయే రోజుల్లో చాలా అవసరాలకు వారినీ వీరినీ బుజ్జగించాల్సిన అవసరం బీజేపీకి తప్పుతుంది. యూపీకి మాత్రమే పరిమితమైన బుల్డోజర్ బొమ్మలు ఇకపై ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయేమో!

Updated Date - 2022-03-11T09:35:24+05:30 IST