అదే అంతరార్థం

ABN , First Publish Date - 2021-04-09T05:30:00+05:30 IST

జెన్‌ పథంలో దివ్యకాంతులు వెదజల్లిన గురువు టోజన్‌. ఆయన ఎందరినో ఆకర్షించి, తగిన విధంగా బోధ చేసి, ఆధ్యాత్మికమార్గంలో నడిపించాడు. ఒకసారి ఒక సాధువు ఆయన దగ్గరకు వచ్చాడు

అదే అంతరార్థం

శీతలత, ఉష్ణం లేని చోటుకు పోదలిస్తే... అలాంటి చోటు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. వాటి నుంచి తప్పించుకొనే స్థితి... మరణం తరువాత మాత్రమే ఉంటుంది. నిజానికి ఏ గురువూ శిష్యుణ్ణి ఆత్మహత్య చేసుకోవాలనీ, మరణించాలనీ చెప్పడు కదా! మరి ఆ సాధువుకు టోజన్‌ చేసిన సూచన ఏమిటి?


జెన్‌ పథంలో దివ్యకాంతులు వెదజల్లిన గురువు టోజన్‌. ఆయన ఎందరినో ఆకర్షించి, తగిన విధంగా బోధ చేసి, ఆధ్యాత్మికమార్గంలో నడిపించాడు. ఒకసారి ఒక సాధువు ఆయన దగ్గరకు వచ్చాడు. 


‘‘అయ్యా! చలీ, ఎండా మాకు ఎంతో ఇబ్బంది కలిగిస్తున్నాయి. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి?’’ అని అడిగాడు. అప్పుడు టోజన్‌ అతనితో ‘‘అవి లేని చోటుకు పోతే సరి!’’ అన్నాడు.


సాధారణంగా మనుషులు ఏవో కొన్ని ఇబ్బందులో, కష్టాలో, నష్టాలో కలిగినప్పుడు ఉన్న ఇంటిని వదిలి మరో ఇంటికీ, ఉన్న ఊరు వదిలి మరో ఊరూ వెళతారు. అయితే అక్కడ వారి పరిస్థితి పెనంలో నుంచి ఎగిరి పొయ్యిలో పడినట్టు ఉంటుంది. పులి బోనులో నుంచి తప్పించుకొని సింహం బోనులో పడినట్టు ఉంటుంది. ఇక భరించలేక... కష్ట నష్టాల నుంచి తప్పించుకోవడానికి ఆత్మహత్యకు పాల్పడతారు. టోజన్‌ చెప్పినట్టు శీతలత, ఉష్ణం లేని చోటుకు పోదలిస్తే... అలాంటి చోటు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. వాటి నుంచి తప్పించుకొనే స్థితి... మరణం తరువాత మాత్రమే ఉంటుంది. నిజానికి ఏ గురువూ శిష్యుణ్ణి ఆత్మహత్య చేసుకోవాలనీ, మరణించాలనీ చెప్పడు కదా! మరి ఆ సాధువుకు టోజన్‌ చేసిన సూచన ఏమిటి?


ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్ళాలనీ కాదు, మరణించాలనీ కాదు. శీతోష్ణాల నుంచి, కష్ట నష్టాల నుంచీ తప్పించుకోవడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి శవంగా మారడం, మరొకటి శివంగా మారడం! బహిర్ముఖులై స్థలాలను మార్చడం వల్ల ప్రయోజనం లేదు. అంతర్ముఖులై స్థితులను మార్చుకోగలిగితే శివం అవుతారు. ‘శివోహం’ అంటారు. అదే టోజన్‌ మాటల్లోని అంతరార్థం.

రాచమడుగు శ్రీనివాసులు

Updated Date - 2021-04-09T05:30:00+05:30 IST