మర్యాదలో మర్మం

ABN , First Publish Date - 2022-05-27T05:52:19+05:30 IST

సుప్రసిద్ధ జెన్‌ గురువుల్లో ఛావో చౌ ఒకరు. ఆ ప్రాంతాన్ని పాలించే రాజు ఆయన గొప్పతనం గురించి విన్నాడు.

మర్యాదలో మర్మం

సుప్రసిద్ధ జెన్‌ గురువుల్లో ఛావో చౌ ఒకరు. ఆ ప్రాంతాన్ని పాలించే రాజు ఆయన గొప్పతనం గురించి విన్నాడు. ఛావోను సందర్శించడం కోసం ఆయన మఠానికి వచ్చాడు. వచ్చిన వ్యక్తి రాజు అని ఛావోకు బాగా తెలుసు. కానీ కనీసం లేచి నిలబడలేదు. ఆయన వైఖరికి రాజు ఆశ్చర్యపోయాడు.


‘‘అయ్యా! మీరు చెప్పండి. లౌకిక రాజు అధికుడా? మత (ధర్మ) గురువు అధికుడా?’’ అని ఛావోను అడిగాడు.

‘‘లౌకిక రాజుల్లో నేను అధికుణ్ణి. మత గురువుల్లోనూ నేనే అధికుణ్ణి’’ అంటూ తడుముకోకుండా జవాబు ఇచ్చాడు ఛావో.


ఆ సమాధానం రాజుకు కోపాన్ని కలిగించలేదు. పైగా ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ కలిగించాయి. ఛావోలోని ఆత్మవిశ్వాసం, నిరాడంబరత, నిర్భయత్వం రాజును ఆకర్షించాయి. ఆయన పట్ల గౌరవాన్ని కనబరుస్తూ అక్కడి నుంచి రాజు నిష్క్రమించాడు.


ఆ మరుసటి రోజు ఛావోను దర్శించడానికి సైన్యాధిపతి వచ్చాడు. అందరికీ ఆశ్చర్యం కలిగించేలా... ఛావో తన స్థానం నుంచి లేచి నిలబడ్డాడు. అంతేకాదు, రాజుకు సైతం చెయ్యని అతిథి సత్కారాలు చేశాడు. 


ఛావో శిష్యులు ఇదంతా గమనించారు. సైన్యాధిపతి వెళ్ళిన తరువాత... ‘‘గురువుగారూ! ఏమిటీ వింత ప్రవర్తన? నిన్న సాక్షాత్తూ రాజుగారు వస్తే మీరు లేచి నిలబడలేదు. కనీస మర్యాద పాటించలేదు. ఈ రోజు... ఆ రాజు దగ్గర పని చేస్తున్న సైన్యాధిపతి వస్తే... ఎంతో గౌరవంగా లేచి నిలబడి, అన్ని మర్యాదలూ చేశారు. దీన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి?’’ అని ప్రశ్నించారు.


‘‘మీరు తెలుసుకోవలసిన విషయం మరొక్కటుంది. ఒకవేళ రేపు సాధారణ సైనికుడో, ఉద్యోగో, పౌరుడో వస్తే... నేను లేచి, ఎదురువెళ్ళి, చేతులు జోడించి, నమస్కరించి... ఆహ్వానిస్తాను’’ అన్నాడు ఛావో. ఆ మాటలు విన్న శిష్యులకు నోట మాటరాలేదు.


సాధారణంగా ఉన్నత పదవుల్లో ఉన్నవారికి అహంకారం ఎక్కువగా ఉంటుంది. వారి నుంచి లబ్ధి పొందాలనుకున్నవారు... వారికి వంగివంగి దండాలు పెడతారు. వారిలో అహంకారాన్ని పెంచి పోషిస్తారు. మరి ఆధ్యాత్మిక గురువులైనా వారిలోని అహంకారాన్ని తెంచేసే బాధ్యత తీసుకోవాలి కదా! తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలి కదా! 


ఇక, చిన్న ఉద్యోగులకు, సామాన్యులకు ఆత్మవిశ్వాసం కొంత తక్కువగా ఉంటుంది. ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలన్న ఆలోచన వారికి ఉండదు. వారిలో ఎవరైనా కాస్త ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తే... ఇతరులు దానికి అహంకారం అనే ముద్ర వేస్తారు. వాళ్ళను అణగదొక్కడానికి చూస్తారు. మరి ఆధ్యాత్మిక గురువులు వారిని మేలుకొలిపి... వారిలో ఆత్మవిశ్వాసాన్నీ, గౌరవాన్నీ పెంచడానికి కృషి చెయ్యాలి కదా! పాలకుల్లో అహంకారాన్నీ, ప్రజల్లో ఆత్మన్యూనతాభావాన్నీ రూపుమాపడాన్ని మించిన సత్కార్యం ఏముంటుంది? ఛావో చేసిన పని అదే. ఉన్నత స్థితిలో ఉన్న ఆ రాజు గుణం కూడా ఉన్నతమైనదే. కాబట్టి ఛావో తీరును అతను బాగా అర్థం చేసుకున్నాడు, ఆయనను గౌరవించాడు.


రాచమడుగు శ్రీనివాసులు

Updated Date - 2022-05-27T05:52:19+05:30 IST