మూవీ రివ్యూ : ‘రాధేశ్యామ్’

Published: Fri, 11 Mar 2022 14:53:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మూవీ రివ్యూ : రాధేశ్యామ్

చిత్రం : ‘రాధేశ్యామ్’

విడుదల తేదీ : మార్చ్ 11, 2022

నటీనటులు : ప్రభాస్, పూజా హెగ్డే , కృష్ణంరాజు, మురళీ శర్మ, భాగ్యశ్రీ, రిద్దీ కుమార్, ప్రియదర్శి, జయరామ్, సచిన్ కేడ్కర్, జగపతి బాబు, కునాల్ రాయ్ కపూర్, సత్యన్, ఫ్లోరా జాకబ్ తదితరులు

ఛాయా గ్రహణం : మనోజ్ పరమహంస

సంగీతం : జెస్టిన్ ప్రభాకరన్, తమన్

ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు

నిర్మాణం : యూవీ క్రియేషన్స్,  టీ సిరీస్ 

రచన, దర్శకత్వం : రాధాకృష్ణ కుమార్

‘సాహో’ తర్వాత ప్రభాస్ నటించిన మరో పాన్ ఇండియా సినిమా ‘రాధేశ్యామ్’. కరోనా కారణంగా సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ఈ సినిమా ఈ రోజే (శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదలైంది. భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ తో నిర్మాణం జరుపుకుంది . టీజర్స్, సింగిల్స్, ట్రైలర్స్‌తో  విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి.  మరి ఈ పీరియాడికల్ లవ్ స్టోరీ అభిమానుల అంచానాల్ని ఏ మేరకు అందుకుంది? ప్రేక్షకులకు ఏ స్థాయిలో కనెక్ట్ అవుతుంది? అన్న విషయాలు రివ్యూలోచూద్దాం.

కథ 

విక్రమాదిత్య (ప్రభాస్) ప్రముఖ హస్త సాముద్రిక నిపుణుడు.  ప్రధానమంత్రి ఇందిరాగాంధి చెయ్యి చూసి ఎమర్జెన్సీ వస్తుందని ముందే చెప్పడం వల్ల.. ఇండియా వదిలేసి తన తల్లితో ఇటలీకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. తన చేతిలో లవ్ లైన్ లేదు కాబట్టి,  తన జీవితంలో ప్రేమ, పెళ్ళి ఉండవని బలంగా నమ్మే అతడికి డాక్టర్ ప్రేరణ (పూజా హెగ్డే)  పరిచయం అవుతుంది. తెలియకుండానే ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమెకి కూడా విక్రమాదిత్య అంటే ఇష్టం ఏర్పడుతుంది. చివరికి విధికి, వారి ప్రేమకు మధ్య జరిగిన యుద్ధం ఏమిటి? ఇద్దరూ ఆ జెర్నీలో ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నారు? చివరికి వారిద్దరూ ఒకటయ్యారా లేదా? అన్నదే మిగతా కథ. 

విశ్లేషణ 

సినిమా పూర్తిగా విదేశాల్లో తెరకెక్కింది. దాంతో ఆటోమేటిగ్గా విజువల్ బ్యూటీ యాడ్ అయింది . అందమైన లొకేషన్స్‌లో ఎంతో రిచ్ గా తెరకెక్కిన ఈ  సినిమాకి అదే ప్లస్ పాయింట్. రొమాంటిక్ లవ్ స్టోరీని పామిస్ట్రీతో ముడిపెట్టడంతో కథాకథనాలకు వైవిధ్యత కూడా తోడైంది. కాకపోతే ఇలాంటి కథను తెరపై ఆవిష్కరించడంలో పూర్తిగా కాకపోయినా.. కొంత వరకూ సక్సెస్ అయ్యాడు దర్శకుడు. ఫస్టాఫ్ ని  ప్రేమ సన్నివేశాలతో నింపేసిన దర్శకుడు .. సెకండాఫ్ ను ఎమోషనల్ సీన్స్ తో నడిపించాడు.  కేవలం ప్రేమకథపైనే దృష్టిపెట్టడం వల్ల సినిమాలోని మిగతా పాత్రలు పూర్తి స్థాయిలో ఎలివేట్ కాలేదు. సన్నివేశాల్లో ఎక్కువ శాతం ప్రభాస్, పూజా హెగ్డేనే కనిపిస్తారు.  కొన్ని సీన్స్ సాగదీసినట్టు అనిపిస్తాయి. కొన్ని బోరింగ్ గా అనిపిస్తాయి. అలాగే కొన్ని చోట్ల కథనం మందగిస్తుంది. అయితే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ను హీరోగా పెట్టినందుకైనా ఒక్కటంటే ఒక్క యాక్షన్ సీన్ కూడా లేకపోవడం అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరుస్తుంది. ఆయన హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సీన్ ఒక్కటైనా కనిపించదు. అలాగే హీరో  ప్రముఖ పామిస్ట్ అని ఎస్టాబ్లిష్ చేసే బలమైన సన్నివేశం లేదు.  ప్రభాస్ ను పూర్తిగా లవర్ బాయ్ గా చూపించడానికే ఎక్కువ తాపత్రయ పడ్డాడు దర్శకుడు. ఇంటెర్వెల్ ట్విస్ట్ , క్లైమాక్స్ మెప్పిస్తాయి. 


విక్రమాదిత్యగా ప్రభాస్ అభినయం, లుక్స్, మెప్పిస్తాయి. అలాగే ఎమోషనల్ సీన్స్ లో మంచి నటన కనబరిచాడు.  ప్రేరణగా పూజా హెగ్డే నటన ఆకట్టుకుంటుంది. ప్రభాస్ తల్లిగా భాగ్యశ్రీ, గురువు పరమహంసగా కృష్ణంరాజు, మురళీశర్మ, జగపతి బాబు పాత్రలకు అంతగా ప్రాధాన్యతనివ్వలేదు. డీన్ గా సచిన్ కేడ్కర్ పర్వాలేనిపించారు.  ఉన్నంతలో ఒక్క జయరామ్ పాత్రే అలరిస్తుంది. తమన్ నేపథ్య సంగీతం, జెస్టిన్ ప్రభాకరన్ సంగీతం మెప్పిస్తాయి. మనోజ్ పరమహంస కెమేరా పనితనం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తం మీద ‘రాధేశ్యామ్’ చిత్రం ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని చెప్పాలి. 

ట్యాగ్ లైన్ : విజువల్ ట్రీట్ 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International