కోమాలో దర్శకనటుడు.. క్లారిటీ ఇచ్చిన నటి రాధిక

Jul 30 2021 @ 20:46PM

ప్రముఖ బుల్లితెర నటుడు వేణు అరవింద్‌ కోమాలోకి వెళ్ళారు. ఆయన ఉన్నట్టుండి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆయన ప్రస్తుతం కోమాలో ఉన్నట్టుగా కోలీవుడ్‌లో వార్తలు సంచరిస్తున్నాయి. పలు బుల్లితెర సీరియళ్ళలో నటించిన వేణు మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకుని, ప్రేక్షకుల మనస్సులో తనకంటూ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నారు. ఆ తర్వాత వెండితెరకు పరిచయమయ్యారు. అంద ఒరు నిమిడం, పడిక్కాద పణ్ణైయార్‌, అలైపాయుదే, నరసింహా, వల్లవన్‌, వేగం వంటి చిత్రాల్లో నటించిన వేణు అరవింద్‌ ‘శభాష్‌ సరియాన పోటీ’ అనే చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. ఆ తర్వాత ఆయనకు సినీ అవకాశాలు తగ్గిపోవడంతో మళ్ళీ బుల్లితెరకే వచ్చి అనేక సీరియళ్ళలో నటించారు. ప్రముఖ నటి రాధిక నటించిన ‘వాణి రాణి’ అనే సీరియల్‌లో ఆమెకు భర్తగా నటించారు.


ఈ నేపథ్యంలో ఇటీవల కరోనా వైరస్‌ బారినపడిన వేణు అరవింద్‌ ఆ వైరస్‌ బారినుంచి కోలుకున్నారు. అయితే, ఉన్నట్టుండి ఆయన అనారోగ్యం బారినపడ్డారు. దీంతో ఆస్పత్రిలో చేర్చి వైద్య పరీక్షలు చేయగా, ఇందులో నిమోనియా సోకినట్టు తేలడంతో దానికి చికిత్స తీసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన బ్రెయిన్‌లో చిన్నపాటి గడ్డ ఉన్నట్లు వైద్యులు గుర్తించి తక్షణం ఆపరేషన్‌ చేసి తొలగించారు. ఈ చికిత్స తర్వాత ఆయన కోమాలోకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. వేణు అరవింద్‌ త్వరగా కోలుకోవాలని ఆయన హితులు, స్నేహితులు, అభిమానులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా వేణు అరవింద్ కోమాలోకి వెళ్లినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిమితంగానే ఉందని నటి రాధిక ట్వీట్ చేశారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.