రేడియంట్‌ అప్లయెన్సెస్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్ నూతన తయారీ కేంద్రం ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-03T00:40:05+05:30 IST

రేడియంట్ అప్లయెన్సెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ తమ అత్యాధునిక తయారీ యూనిట్‌ను హైదరాబాద్‌లో

రేడియంట్‌ అప్లయెన్సెస్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్ నూతన తయారీ కేంద్రం ప్రారంభం

హైదరాబాద్: రేడియంట్ అప్లయెన్సెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ తమ అత్యాధునిక తయారీ యూనిట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర ఐటీ, వాణిజ్యశాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్ఐఐసీ వీసీ, ఎండీ నరసింహారెడ్డి, టీఫైబర్ సీఈవో సుజాయ్ కరంపురి, రేడియంట్ అప్లయెన్సెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎండీ రమీందర్‌సింగ్ సోయిన్, ఆ సంస్థ డైరెక్టర్ మణికందన్ నరసింహన్ తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


నూతన యూనిట్ ప్రారంభంతో కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 2.1 మిలియన్ యూనిట్ల నుంచి 4.5 మిలియన్ యూనిట్లకు పెరగనుంది. కరోనా మహమ్మారి కారణంగా పెను సవాళ్లను ఎదుర్కొనప్పటికీ గత రెండేళ్లలో ఏకంగా 5 మిలియన్లకుపైగా ఎల్‌ఈడీ టీవీలను రేడియంట్ ఉత్పత్తి చేసింది. కాగా, ఈ ప్లాంట్‌ను రూ. 100 కోట్లతో ఏర్పాటు చేశారు. దీని ద్వారా అదనంగా 1000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 


యూనిట్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఎలక్ట్రానిక్స్ రంగంలో రేడియంట్ అగ్రగామిగా నిలుస్తుందని అన్నారు. స్వల్ప కాలంలోనే 5 మిలియన్ టీవీలను ఉత్పత్తి చేసినందుకు సంస్థను అభినందిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో అత్యత్తమ మౌలిక వసతులతోపాటు నైపుణ్యం కలిగిన మానవవనరులు కూడా పుష్కలంగా ఉన్నట్టు చెప్పారు. దేశంలో ఎల్‌ఈడీ టీవీల తయారీలో అతిపెద్ద సంస్థలలో ఒకటైన స్కైవర్త్‌తో రేడియంట్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన 15కుపైగా  భారతీయ , ఎంఎన్‌సీల అవసరాలను రేడియంట్ తీరుస్తోంది. ఈ రంగంలో మార్కెట్‌లో 25 శాతం డిమాండ్‌ను రేడియంట్ తీర్చనుంది. 


రాష్ట్ర ఐటీ, వాణిజ్యశాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ.. రేడియంట్ అప్లయెన్సెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు తెలంగాణలో అత్యంత విజయవంతమైన ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థల్లో ఒకటిగా నిలిచిందన్నారు. రేడియంట్‌ అప్లయెన్సస్‌ డైరెక్టర్‌ మణికందన్‌ నరసింహన్‌ మాట్లాడుతూ.. రేడియంట్ అప్లయెన్సెస్ ఎలక్ట్రానిక్స్ తయారీలో నూతన మైలురాళ్లను చేరుకుంటోందన్నారు. ప్రభుత్వ మద్దతు, ప్రోత్సాహం వంటివి తమ విజయానికి మరింత తోడ్పాటు అందించాయన్నారు. ఆ సంస్థ ఎండీ రమీందర్ సింగ్ సోయిన్ మాట్లాడుతూ.. ఎల్‌ఈడీ టీవీల తయారీలో త్వరలోనే అగ్రస్థానానికి చేరుకుంటామన్నారు. సమీప భవిష్యత్‌లో  భారీ గృహోపకరణాల విభాగంలో నూతన తయారీ యూనిట్లను జోడిస్తామని, తద్వారా ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపరుస్తామని అన్నారు.

Read more