నడాల్‌.. నవ చరిత్ర

Published: Mon, 31 Jan 2022 02:17:04 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నడాల్‌.. నవ చరిత్ర

  • రఫాదే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌.. 
  • 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో రికార్డు
  • ఫైనల్లో మెద్వెదెవ్‌పై విజయంవయసు పైబడుతున్నా.. యువ ఆటగాళ్లు సవాల్‌ విసురుతున్నా.. గాయాలు ఎదురవుతున్నా.. ఫిట్‌నెస్‌ సమస్యలు చుట్టుముడుతున్నా.. కిందపడ్డ ప్రతిసారీ నేలకు కొట్టిన బంతిలా పైకిలేచే.. రఫెల్‌ నడాల్‌ మరోసారి టెన్ని్‌సలో తన పవరేంటో చూపించాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచిన ఈ స్పెయిన్‌ స్టార్‌.. మరే ఆటగాడికీ సాధ్యంకాని రీతిలో కెరీర్‌లో 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించి నవ చరిత్ర సృష్టించాడు. దాదాపు ఐదున్నర గంటలపాటు జరిగిన ఫైనల్లో నడాల్‌ 2-6, 6-7 (7-5), 6-4, 6-4, 7-5తో రష్యాకు చెందిన డానిల్‌ మెద్వెదెవ్‌ను ఓడించి అత్యధిక గ్రాండ్‌స్లామ్స్‌తో ఒకే ఒక్కడుగా నిలిచాడు.


స్పెయిన్‌ బుల్‌ సాధించాడు.. పురుషుల టెన్నిస్‌ చరిత్రలో ఇప్పటిదాకా ఎవరికీ సాధ్యం కాని అత్యధిక గ్రాండ్‌స్లామ్స్‌ రికార్డుతో నడాల్‌ రఫ్ఫాడించాడు. తద్వారా ఫెడరర్‌, జొకోవిచ్‌తో సాగుతున్న రేసులో తనదే పైచేయి అని చాటుకున్నాడు. గతేడాది చివర్లో గాయం కారణంగా నాలుగు నెలలపాటు ఆటకు దూరమైన వేళ.. రఫా నుంచి ఈ స్థాయి ప్రదర్శన వస్తుందని ఎవరూ ఊహించలేదు. అదీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో కావడం మరింత విశేషం. వరల్డ్‌ నెంబర్‌ 2 మెద్వెదెవ్‌ తొలి రెండు సెట్లు గెలుచుకున్నా.. ఆ తర్వాత మూడు సెట్ల పాటు నడాల్‌ సాగించిన పోరు అదుర్స్‌ అనిపించింది. చివరకు ఎలాగైతేనేం.. 21వ గ్రాండ్‌స్లామ్‌తో శిఖరాన నిలిచాడు.


2 సుదీర్ఘంగా జరిగిన రెండో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఇది. 2012లో జొకో-నడాల్‌ మ్యాచ్‌ 5 గంటలా 53 నిమిషాలు సాగింది.


 3 ఓపెన్‌ ఎరాలో కెన్‌ రోజ్‌వాల్‌, ఫెడరర్‌ తర్వాత అతి పెద్ద వయస్సు (35)లో గ్రాండ్‌స్లామ్‌ నెగ్గిన మూడో ప్లేయర్‌గా నడాల్‌.


మెల్‌బోర్న్‌: రఫెల్‌ నడాల్‌ చరిత్ర సృష్టించాడు. ఫేవరెట్‌ కాకపోయినా అసమాన ఆటతీరుతో ఈ స్పెయిన్‌ దిగ్గజం 13 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో రష్యాకు చెందిన రెండో సీడ్‌ మెద్వెదెవ్‌ను 2-6, 6-7(7/5), 6-4, 6-4, 7-5తో ఓడించాడు. ఈ విజయంతో 21 గ్రాండ్‌స్లామ్స్‌ సాధించిన ఏకైక ఆటగాడయ్యాడు. తన పోటీదారులు రోజర్‌ ఫెడరర్‌, జొకోవిచ్‌ కెరీర్‌లో 20 గ్రాండ్‌స్లామ్స్‌ మాత్రమే ఉన్నాయి. ఫెడెక్స్‌కు గాయం కాగా.. తొమ్మిది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిళ్లు నెగ్గిన జొకో వీసా నిరాకరణతో ఈసారి టోర్నీకి దూరమవడం 35 ఏళ్ల నడాల్‌కు కలిసివచ్చింది. దీంతో 2009 తర్వాత రెండో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలుచుకోగలిగాడు. అయితే తుది పోరులో స్పెయిన్‌ బుల్‌కు విజయం అంత సులువుగా దక్కలేదు. 5 గంటల 24 నిమిషాలపాటు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో రష్యా పొడగరి మెద్వెదెవ్‌ శాయశక్తులా ప్రయత్నించినా మ్యాచ్‌ మధ్యలో అలిసిపోయినట్టు కనిపించాడు. అయితే ఫైనల్లో మెద్వెదెవ్‌ 23 ఏస్‌లు సంధించడం విశేషం. 


ఆరంభంలో వెనుకబడినా: రాడ్‌ లేవర్‌ ఎరీనాలో అత్యంత ఆసక్తిదాయకంగా నువ్వా.. నేనా అనే రీతిలో ఈ పోరు సాగింది. ఆరంభంలో రెండు సెట్లపాటు మెద్వెదెవ్‌ ఆధిపత్యం చూపాడు. తొలిసెట్‌లో నడాల్‌ పూర్తిగా తేలిపోవడంతో రెండు బ్రేక్‌ పాయింట్లతో పాటు మెద్వెదెవ్‌ వరుసగా ఐదు గేమ్‌లు సాధించాడు. దీంతో సెట్‌ను 6-2తో ముగించాడు. రెండో సెట్‌లో స్పెయిన్‌ బుల్‌ ఆటతీరు చూస్తే సెట్‌ దక్కించుకునేలాగే కనిపించాడు. బ్రేక్‌ పాయింట్‌ సహాయంతో మొదట 4-1తో అతడిదే ఆధిక్యం. ఈ దశలో మెద్వెదెవ్‌ పుంజుకుని ఏడో గేమ్‌లో బ్రేక్‌ సాధిస్తూ 3-4తో పోటీలోకొచ్చాడు. ఇద్దరూ సర్వీ్‌సను బ్రేక్‌ చేసుకుంటూ 6-6కు వెళ్లడంతో టైబ్రేక్‌ అనివార్యమైంది. చివరికి 7-6తో మెద్వెదెవ్‌ గట్టెక్కాడు. ఇక మూడో సెట్‌ తొలి గేమ్‌లో ఆరు డ్యూస్‌ల పాటు పోరాడి మెద్వెదెవ్‌ సర్వీస్‌ కాపాడుకున్నా.. తొమ్మిదో గేమ్‌లో బ్రేక్‌ పాయింట్‌తో నడాల్‌ ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే జోరుతో చక్కటి ఫోర్‌హ్యాండ్‌ విన్నర్‌తో మ్యాచ్‌లో తొలిసారి సెట్‌ను వశం చేసుకున్నాడు. నాలుగో సెట్‌లో ఇద్దరూ చెరో బ్రేక్‌ పాయింట్‌తో 2-2తో సమానంగా నిలిచారు. కానీ నడాల్‌ ఐదో గేమ్‌ను బ్రేక్‌ చేస్తూ సర్వీ్‌సను కాపాడుకోవడంతో చివరి సెట్‌ నిర్ణాయకమైంది.


ఇందులోనూ మొదట నడాల్‌ బ్రేక్‌ పాయింట్‌తో 3-2తో పైచేయు సాధించాడు. తర్వాతి గేమ్‌లో మెద్వెదెవ్‌ పోటీ ఇచ్చినా నడాల్‌ సర్వీస్‌ కాపాడుకున్నాడు. అయితే 5-4 ఆధిక్యంతో సర్వీస్‌ ఆరంభించిన నడాల్‌ మ్యాచ్‌ ముగిస్తాడనుకున్న వేళ మెద్వెదెవ్‌ బ్రేక్‌ పాయింట్‌ సాధించాడు. కానీ తర్వాతి గేమ్‌లో అతడు సర్వీస్‌ కోల్పోవడంతో నడాల్‌కు మార్గం సుగమమైంది. 12వ గేమ్‌లో మెద్వెదెవ్‌ ఒక్క పాయింట్‌ కూడా సాధించకపోగా.. నడాల్‌ బ్యాక్‌హ్యాండ్‌ విన్నర్‌తో మ్యాచ్‌ను ముగించి సంబరాల్లో మునిగాడు.


నా కెరీర్‌లో అత్యంత భావోద్వేగ మ్యాచ్‌ల్లో ఇదీ ఒకటి. గత మూడు వారాల నుంచి మీరు నాకందించిన మద్దతు జీవితాంతం నా గుండెల్లో ఉండిపోతుంది. అంతా అద్భుతంలా అనిపిస్తోంది. వాస్తవానికి నెలన్నర క్రితం అసలు ఈ టోర్నీ ఆడగలనా? అని సందేహించాను. కానీ ఇప్పుడు చాంపియన్‌గా నిలవడం ఎంతో సంతోషంగా ఉంది.


నడాల్‌


తొలి రెండు సెట్లు ఓడినా ఆ తర్వాత పుంజుకుని గెలవడం నడాల్‌కిది నాలుగోసారి. అలాగే 2007 వింబుల్డన్‌ తర్వాత ఇదే మొదటిసారి. 


4 అత్యధిక గ్రాండ్‌స్లామ్స్‌ రికార్డులో పురుషుల్లో నడాల్‌ టాప్‌లో ఉన్నా ఓవరాల్‌గా తనది నాలుగోస్థానం. మార్గరెట్‌ కోర్ట్‌ (24), సెరెనా విలియమ్స్‌ (23) స్టెఫీ గ్రాఫ్‌ (22) ముందున్నారు.

నడాల్‌.. నవ చరిత్ర

దూకుడే మంత్రం

రఫెల్‌ నడాల్‌, నొవాక్‌ జొకోవిచ్‌, రోజర్‌ ఫెడరర్‌..నిస్సందేహంగా 21వ శతాబ్దపు గొప్ప టెన్నిస్‌ త్రయం. మరే దిగ్గజ టెన్నిస్‌ ఆటగాడికి కూడా సాధ్యంకాని రీతిలో ఒక్కొక్కరూ 20 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచారంటే వారి సత్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి ముగ్గురిలో ఎవరు తొలుత 21వ గ్రాండ్‌స్లామ్‌ గెలుస్తారనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌తో ‘నేనే ముందు’ అని స్పెయిన్‌ బుల్‌ నడాల్‌ నిరూపించుకున్నాడు. ముగ్గురు కూడా కొంతకాలంగా గాయాల బెడద ఎదుర్కొంటూనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సెర్బియా వీరుడు జొకోవిచ్‌ వీసా సమస్యలతో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పాల్గొనలేదుకానీ..లేదంటే టోర్నీ మరింత రంజుగా ఉండేది. ఇకపోతే ఎడమ పాదం గాయంతో రఫా గత సీజన్‌లో నెలలపాటు టెన్ని్‌సకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ సమస్యలను అధిగమించి షపోవలోవ్‌, బెరెట్టిని, మెద్వెదెవ్‌ వంటి కుర్రకారునుంచి ఎదురైన ప్రతిఘటనను తిప్పికొట్టి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలవడం ఆషామాషీకాదు. మూడుపదులు దాటిన వయస్సులో..అందునా తొలి రెండు సెట్లు కోల్పోయినా వెనుకంజ వేయకపోవడం నడాల్‌ పట్టువదలని పోరాటానికి తార్కాణం. 


ఎన్నో సంచలనాలు: నాలుగో ఏట టెన్ని్‌సలో అడుగుపెట్టిన రఫా 15 ఏళ్లకే (2001లో) ప్రొఫెషనల్‌గా మారాడు. అప్పటినుంచి ఈరోజు వరకు అతని ఆటలో  సంచలనాలు అనేకం.  ఆదినుంచీ కోర్టులో చురుగ్గా కదులుతూ, ఎన్ని గంటలైనా అలుపూ సొలుపూ లేకుండా ఆడుతూ ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించేవాడు. తర్వాత కాలంలో నడాల్‌ తన ఆటతీరును పూర్తిగా మార్చుకున్నాడు. బేస్‌లైన్‌ ఆటతో, దూకుడే మంత్రంగా ప్రత్యర్థులకు సింహస్వప్నంగా మారాడు. పవర్‌ఫుల్‌ ఫోర్‌హ్యాండ్‌ షాట్‌ నడాల్‌ అమ్ములపొదిలో ప్రధాన అస్త్రం. ఫోర్‌హ్యాండ్‌ టాప్‌స్పిన్‌ షాట్‌ సంధిస్తే బంతి బుల్లెట్‌లా ప్రత్యర్థి భుజాలమీదకు దూసుకుపోతుంది. ఇక అతడి బ్యాక్‌హ్యాండ్‌ షాట్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. ర్యాలీలలో ఈ షాట్‌ కొట్టాడంటే ప్రత్యర్థి బెంబేలెత్తాల్సిందే. ఇక క్రాస్‌కోర్టు బ్యాక్‌హ్యాండ్‌ షాట్లు సంధించడంలో సమకాలీన టెన్ని్‌సలో రఫాను మించినవాడు లేడంటే అతిశయోక్తికాదు. 


క్లేకింగ్‌: తన టాప్‌స్పిన్‌ ఆటకు సరిగ్గా సరిపోతుంది కాబట్టే..క్లేకోర్టు రారాజుగా రఫా పేరు తెచ్చుకున్నాడు. గ్రాస్‌, హార్డ్‌ కోర్టులు జారే స్వభావం కలిగి ఉంటాయి. అందువల్ల వాటిపై బంతి వేగంగా దూసుకొస్తుంది. కానీ క్లే కోర్టులపై నెమ్మదిగా కదలడంతోపాటు బంతి బౌన్స్‌ అవుతుంది. ఆ బౌన్స్‌కు, నడాల్‌ టాప్‌స్పిన్‌ ఆట తోడై అతడు ఏకంగా 13 ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిళ్లు  తన ఖాతాలో వేసుకున్నాడు. 


వారిద్దరితో సమరమే: నడాల్‌-ఫెడరర్‌, నడాల్‌-జొకోవిచ్‌ మ్యాచ్‌ అంటే టెన్నిస్‌ అభిమానులకు పండుగే. ఫెడెక్స్‌తో ఇప్పటివరకు 40సార్లు తలపడిన నడాల్‌ 24-16తో ఆధిక్యంలో నిలిచాడు. అలాగే గ్రాండ్‌స్లామ్‌ల్లోనూ 10-4తో ఫెడెక్స్‌పై నడాల్‌దే పైచేయి. జొకోని 58 సార్లు ఢీకొన్న స్పెయిన్‌ బుల్‌ 28-30తో ఒకింత వెనుకంజలో ఉన్నాడు. కానీ గ్రాండ్‌స్లామ్‌లలో 7-1తో నడాల్‌దే ఆధిపత్యం. మొత్తంగా 21 గ్రాండ్‌స్లామ్‌లతో చరిత్ర సృష్టించిన 35 ఏళ్ల రఫా..తనకు తిరుగులేని ఫ్రెంచ్‌ ఓపెన్‌లోనూ విజేతగా నిలిచి తన రికార్డును మరింత మెరుగుపర్చుకొనే అవకాశాలు లేకపోలేదు. 

ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం

నడాల్‌.. నవ చరిత్ర

నాన్నతో .. రఫెల్‌ నడాల్‌

నడాల్‌.. నవ చరిత్ర

అత్యధిక గ్రాండ్‌స్లామ్స్‌ వీరులు వీరే!


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.