లే ‘అవుట్‌’పై రగడ

ABN , First Publish Date - 2021-07-24T06:08:08+05:30 IST

బవులవాడ పంచాయతీ పరిధిలోని దర్జీనగర్‌లో అనధికార లేఅవుట్‌ ప్రక్రియ కొనసాగుతోంది.

లే ‘అవుట్‌’పై రగడ
దర్జీనగర్‌లో కొనసాగుతున్న లేఅవుట్‌ పనులు

బవులవాడలో ఆగని పేదల ఇళ్ల కాలనీ అనధికార తరలింపు ప్రక్రియ

లబ్ధిదారులను ఒప్పించి సంతకాలు సేకరిస్తున్న అధికార పార్టీ నేతలు 

పోరాటాలకు సిద్ధమవుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు

ఎటూ తేల్చుకోని రెవెన్యూ అధికారులు


తుమ్మపాల, జూలై 23: బవులవాడ పంచాయతీ పరిధిలోని దర్జీనగర్‌లో అనధికార లేఅవుట్‌ ప్రక్రియ కొనసాగుతోంది. లేఅవుట్‌ మార్పుపై ఏం చేయాలో తెలియని స్థితిలో అధికారులు ఉండగా, మరోవైపు అఽధికార పార్టీ నేతలు తమ పనులను దర్జాగా కానిచ్చేస్తున్నారు. దీనిపై ప్రతిపక్ష నాయకులు పోరాటా లకు సన్నద్ధమవుతున్నారు.

రావుగోపాలరావుకాలనీలో జగనన్న కాలనీ లేఅవుట్‌ వేసి, 158 మందికి పట్టాలు ఇవ్వడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సమీ పంలోని క్వారీకి ముప్పు వస్తుందన్న ముందుచూపుతో సదరు నిర్వాహకులు ఈ లేఅవుట్‌ను వేరేచోటకు మార్పు చేయాలని అధికార పార్టీ నేతలతో రాయబేరాలు కుదుర్చుకున్నారని ఆరోపణలు వచ్చాయి. 

ఇందులో భాగంగానే అధికారులకు తెలియకుండా దర్జీనగర్‌లో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిలో చెట్లు నరికేసి మరీ అక్రమ లేఅవుట్‌ వేస్తున్న వైనంపై ‘లే అవుట్‌’ అనే శీర్షికతో ఈ నెల 20న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రత్యేక కథనం వెలువడిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ నాయకులు లబ్ధిదారులతో కలిసి వెళ్లి అభ్యంతరం తెలిపినప్పటికీ రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతో అధికార పార్టీ నాయకులు దర్జాగా తమ పనులు చేసుకుపోతున్నారు. 


అధికారుల తీరుపై విమర్శలు

వైసీపీ నేతల సొంత నిర్ణయాలతో దర్జీనగర్‌లో లేఅవుట్‌ వేస్తున్నా అధికారులు స్పందించకపోవడంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లేఅవుట్‌ను దర్జీనగర్‌కు మార్చాలని లబ్ధిదారులు ముందుగా వినతులు ఇవ్వకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో వ్యవహారం బయటపడిన తరువాత లబ్ధిదారుల కోరిక మేరకే లేఅవుట్‌ను మార్పు చేస్తున్నట్టు సంతకాలు సేకరించడంపై విస్మయం చెందుతున్నారు. ఉన్నతాధి కారులు స్పందించి క్షేత్ర స్థాయిలో దర్యాప్తు చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. 


పోరాటాలకు టీడీపీ నేతల సన్నద్ధం

నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ నేతలు దర్జీనగర్‌లో లేఅవుట్‌ వేయడంపై టీడీపీ నాయకులు అభ్యంతరం తెలుపుతున్నారు. ఇప్పటికే టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ, గ్రామ పార్టీ అధ్యక్షుడు కోట్ని ఈశ్వరరావు, గ్రామ ఎంపీటీసీ అభ్యర్థి విజయ్‌ తది తరులు ఈ అంశంపై తహసీల్దార్‌, ఆర్డీవో, హౌసింగ్‌ జేసీ కార్యాలయాల్లో ఫిర్యాదులు అందించారు. అలాగే జిల్లా కలెక్టర్‌ను కలిసి అనధికార లేఅవుట్‌, అక్కడి సమస్యలను వివరిస్తామని, అప్పటికీ న్యాయం జరగని పక్షంలో కోర్టులో పిల్‌ వేస్తామని టీడీపీ నేత కోట్ని బాలాజీ తెలిపారు. 


ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం..

-ఎ.శ్రీనివాసరావు, తహసీల్దార్‌

రావుగోపాలరావు కాలనీలో లేఅవుట్‌ను మా రికార్డు నుంచి తొలగించలేదు. దర్జీనగర్‌కు లేఅవుట్‌ మార్చాలని సర్పంచ్‌, లబ్ధిదారులు వినతిపత్రాలు అందించారు. వీటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి, వారి ఆదే శాల మేరకు నిర్ణయం తీసుకుంటాం. ఒకవేళ దర్జీనగ ర్‌లో లేఅవుట్‌ వేసి ప్లాట్‌లు కేటాయిస్తే, రావుగోపాల రావు కాలనీ లేఅవుట్‌ను స్వాధీనం చేసుకుంటాం.

Updated Date - 2021-07-24T06:08:08+05:30 IST